ఉత్తర ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున 4.6 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల వరసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (SECL)కి చెందిన ఇద్దరు ఉద్యోగులు భూగర్భ బొగ్గు గనిలో పని చేస్తుండగా భూ ప్రకంపనలను పసిగట్టి సురక్షితంగా బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కిందపడటంతో వారికి స్వల్ప గాయాలయ్యాయి. జిల్లాలో 4 తీవ్రతతో భూకంపం నమోదు కావడం ఈ నెలలో ఇది రెండోసారి. జూలై 11న జిల్లాలో అదే ప్రాంతంలో 4.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. మధ్యప్రదేశ్‌కు ఆనుకుని ఉన్న కొరియా జిల్లా ప్రధాన కార్యాలయం బైకుంత్‌పూర్ పరిసర ప్రాంతంలో అర్ధరాత్రి 12.56 గంటల ప్రాంతంలో 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం భూమి ఉపరితలం నుంచి 16 కిలోమీటర్ల లోతులో ఉందని ఇక్కడ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఇది మోస్తరు వర్గానికి చెందిన భూకంపమని, పెద్దగా విధ్వంసం జరగలేదని, అయితే ఇది కచ్చా (మట్టి) ఇళ్లకు నష్టం కలిగించవచ్చన్నారు.
కొరియా కలెక్టర్ కుల్దీప్ శర్మ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో చిన్నపాటి ప్రకంపనలు సంభవించాయన్నారు. ఐతే ఈ ప్రకంపనల కారణంగా ఎలాంటి ఆస్తి , ప్రాణ నష్టం జరగలేదన్నారు. పరిస్థితిని జాగ్రత్తగా పర్యవేక్షించి నష్టం జరిగితే నివేదించాలని స్థానిక అధికారులను ఆదేశించినట్లు ఆయన చెప్పారు. ప్రాథమిక నివేదిక ప్రకారం, SECL యొక్క చర్చా భూగర్భ బొగ్గు గనుల లోపల ఉన్న ఇద్దరు ఉద్యోగులు ప్రకంపనలను పసిగట్టిన తర్వాత బయటకు వచ్చే ప్రయత్నంలో కిందపడిపోవడంతో స్వల్ప గాయాలయ్యాయని కలెక్టర్ తెలిపారు. గాయపడిన ఇద్దరు ఉద్యోగులను స్థానిక ఆసుపత్రికి తరలించామని అక్కడి నుంచి తదుపరి చికిత్స కోసం బిలాస్‌పూర్లోని ప్రైవేటాస్పత్రికి తరలించామని SECL అధికారి తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి ప్రమాదం లేదని నిలకడగా ఉందని తెలిపారు.