ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జులై 4న భీమవరం లో పర్యటించనున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. . ఈ విషయమై సచివాలయం నుంచి అధికారులతో ఆయన వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ప్రధాని పర్యటనకు ఇంకా నెల రోజులు సమయం ఉందని, ఇప్పటి నుంచే తగిన ప్రణాళిక రూపొందించి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృతోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రముఖ చారిత్రక కట్టడాలు, సమరయోధుల ప్రాంతాల సందర్శనలో భాగంగానే ప్రధాని వస్తున్నారు. నేటి యువతకు ఆనాటి స్వాతంత్య్ర పోరాటాలను వివరించడం లక్ష్యంగా, 75 ఏళ్ల స్వాతంత్ర్యోత్స వాల సందర్భంగా విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు జ్ఞాపికలను గౌరవించడం కోసం ప్రధాని హాజరవుతున్నారన్నారు. భీమవరం పర్యటనలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలను పురస్కరించుకుని 30 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. అల్లూరి పుట్టిన మోగల్లు ప్రాంతం సందర్శించే అవకాశం ఉందన్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చే జూన్ 9వ తేదీన భీమవరం వస్తారన్నారు. అల్లూరి సీతారామరాజు చిన్నతనంలో తమ స్వగ్రామం కొవ్వాడ అన్నవరంలో నాలుగు సంవత్సరాలున్నారన్నారు. అక్కడి నుంచే కొంతకాలం భీమవరం లూథరన్ స్కూల్‌కు వచ్చి చదువుకున్నారన్నారు. విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు పుట్టిన గ్రామమైన పాలకోడేరు మండలం మోగల్లులో జరిగే జయంతి కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారని చెప్పారన్నారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడతారన్నారు.
జూన్ 7న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాక
ప్రధాని మోదీ పర్యటన కంటే ముందే.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీలో పర్యటిస్తారని బీజేపీ అధ్యక్షులు సోమువీర్రాజు తెలిపారు.. జూన్ 7, 8 తేదీల్లో జేపీ నడ్డా ఏపీలో పర్యటిస్తారు. జూన్ 7న రాజమహేంద్రవరంలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. బహిరంగ సభ మరుసటి రోజు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో జేపీ నడ్డా సమావేశమవుతారని సమాచారం.ఇరువురి భేటీ తర్వాత బీజేపీ, జనసేన పొత్తులపై మరింత స్పష్టత వచ్చే అవకాశముంది. జూన్ 8న విజయవాడలో పార్టీ నేతలతో జేపీ నడ్డా భేటీ అవుతారు. వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా వారికి దిశానిర్దేశం చేయనున్నారు. జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలతో బీజేపీలో సరికొత్త ఉత్సాహం కనిపిస్తుందని.. పార్టీ బలోపేతానికి ఇది దోహదపడుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.