వైసీపీ దూకుడు పెంచింది. ఎన్నడూ లేని విధంగా అమలుచేస్తున్న సామాజిక న్యాయాన్ని ప్రజలకు వివరించాలని సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పార్టీకి దిశానిర్దేశం చేశారు. విభజనకు ముందు, ఆ తర్వాత టీడీపీ హయాంలో సామాజిక అన్యాయం ఎలా జరిగింది? మూడేళ్లుగా ప్రభుత్వం ఆచరిస్తున్న సామాజిక న్యాయాన్ని జనం ముందుకు తీసుకెళ్లేలా ఈనెల 26 నుంచి 29 వరకూ బస్సు యాత్రను చేపడుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 17 మంది మంత్రులు యాత్ర బస్సు యాత్ర చేయనున్నారు. ఈ యాత్రకు పెట్టిన పేరు సామాజిక భేరి.
సామాజిక న్యాయం కోసం బాబా సాహెబ్ అంబేద్కర్, జ్యోతిబా పూలే, బాబూ జగ్జీవన్‌రాం, మౌలానా ఆజాద్, కొమరం భీమ్ కోరుకున్న సమాజం దిశగా జగన్‌గారి పాలన సాగిందని, అది ప్రతి ఒక్కరికీ తెలియజేసేలా ఈ యాత్ర ఉంటుంది. సామాజిక న్యాయభేరి పేరుతో 26 నుంచి బస్సు యాత్ర చేపడుతున్నాం. శ్రీకాకుళం జిల్లా నుంచి యాత్ర మొదలవుతుంది. నాలుగు రోజుల పాటు ఎక్కువ ప్రాంతాలు కవర్ చేస్తూ, అనంతపురంలో 29న యాత్ర ముగుస్తుంది. రాష్ట్ర చరిత్రలోనూ, దేశ చరిత్రలోనూ గతంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు తగిన సామాజిక న్యాయం జరగలేదు. ఇప్పుడు వారికి రాజ్యాధికారం ఇవ్వడం జరిగింది వివరిస్తారు.
అధికారం, పాలన ఏనాడూ చూడని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఎంతో ఆవేదనతో ఉన్న నేపథ్యంలో, వైయస్సార్‌సీపీ వారి కోసం ఎంతో చేసింది. మూడేళ్ల క్రితం సీఎం జగన్ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం, ఆ వర్గాల వారి ఆత్మఘోష నివారించడం కోసం, వారిని రాజ్యాధికారంలో భాగస్వాములను చేశారు. స్వాతంత్య్రం తర్వాత, అంతకు ముందు కూడా ఆ వర్గాలు బండ చాకిరికే పరిమితమయ్యాయి. వారు పాలనకూ ఎప్పుడూ దూరంగానే ఉన్నారు. అలాంటి వారికి మాట ఇచ్చి, అమలుచేసింది వైసీపీ. ఈ ప్రభుత్వం ఏర్పడినప్పుడే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు పూర్తి సామాజిక న్యాయం చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా అన్ని రాజకీయ పదవుల్లో వారికి ప్రాధాన్యత ఇచ్చాం. రిజర్వేషన్ కూడా కల్పించాం. తాజాగా మంత్రివర్గ మార్పులో కూడా సామాజిక న్యాయం చేయడం జరిగింది.
ఈ యాత్ర ఎందుకంటే ?
అయితే ఇంత చేస్తున్నా, కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. అందుకే వాస్తవాలు ప్రజలకు వివరించేందుకు యాత్ర మొదలుపెడుతున్నాం. యాత్రలో అందరినీ కలుస్తాం. చేసింది చెబుతాం. అలాగే ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట ఒక సభ ఏర్పాటుచేసి, అన్నీ వివరిస్తాం. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరైతే పదవులు పొందారో, తమ వర్గాల వారి ఆశలు తీర్చారో, వారికి అండగా ఉన్నారో వారంతా ఆ సభల్లో పాల్గొంటారు.
26న శ్రీకాకుళంలో యాత్ర మొదలైతే, అదే రోజు సాయంత్రం విజయనగంలో సభ జరుగుతుంది. ఆ సభలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చెందిన మంత్రులు మొదలు, పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, రాజకీయ పదవుల్లో ఉన్న వారు పాల్గొని, ఈ ప్రభుత్వంలో తమకు ఏ విధమైన గుర్తింపు వచ్చిందన్నది వివరిస్తారు. మరో వైపు యాత్ర యావత్తూ, మంత్రులు ఉంటారు. వారు ఎక్కడిక్కకడ ప్రజలకు అన్నీ వివరిస్తారు. మంత్రి వర్గంలో 70 శాతం వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చోటు గతంలో ఎక్కడైనా విన్నామా ? ఎక్కడో ఒకరు, ఇద్దరుంటే అదే గొప్ప. కానీ ఈ ప్రభుత్వ మంత్రి వర్గంలో ఏకంగా 70 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారున్నారు. దీన్ని కూడా ప్రతిపక్షం అవహేళన చేస్తోంది.
దేశమంతా కరోనా వచ్చింది. అన్ని ప్రభుత్వాలు అప్పులుచేస్తున్నాయి. ఎక్కడా ఆదాయాలు పెరగలేదు. అయినా మా ప్రభుత్వం ఏ పథకాన్ని ఆపలేదు. ఇక ధరలు పెరిగాయని విమర్శిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ధరలు తక్కువగా ఉన్నాయో చెప్పండి? అయినా సీఎం పాలనలో ధరలు పెరిగాయని ఆరోపిస్తున్నారు. మీ హయాంలో ఎక్కడైనా గొప్ప పరిశ్రమలు వచ్చాయా? ప్రాజెక్టులు వచ్చాయా ? మరి ఈ ప్రభుత్వాన్ని ఎందుకు దుయ్యబడుతున్నారు? ఏ కులం, వర్గంలో అయినా ఇవాళ ఎవరైనా అసంతృప్తితో ఉన్నారా ? వారికి పథకాలు అందడం లేదా ? పథకాల అమలులో అవినీతి చోటు చేసుకుందని మీరు చెప్పగలరా ? మేము ఈ యాత్రలో ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయంపై అర్ధమయ్యేలా చెబుతాం. జగన్ గారి ప్రభుత్వ హయాంలో ఏం మార్పులు చోటు చేసుకున్నాయనేది ప్రజలకు వివరిస్తాం అని మంత్రి ధర్మాన ప్రసాదరావు వివరించారు.
మంత్రివర్గంలో ఆయా వర్గాలకు చెందిన 17 మంది ఈ యాత్రలో పాల్గొంటారు. అలాగే ఎక్కడిక్కడ, ఆయా ప్రాంతానికి చెందిన ప్రజా ప్రతినిధులు, రాజకీయ పదవులు పొందిన వారు, స్థానిక ప్రజాప్రతినిధులు యాత్రకు హాజరవుతారు. మా ఈ భేరీ యాత్రలో ప్రతి రోజూ సాయంత్రం బహిరంగ సభ ఉంటుంది. తొలి రోజు 26న శ్రీకాకుళంలో యాత్ర మొదలైతే, ఆరోజు సాయంత్రం విజయనగరంలో సభ ఉంటుంది. మర్నాడు 27న రాజమండ్రిలో, 28న నర్సరావుపేటలో, చివరి రోజు 29న అనంతపురంలో బహిరంగ సభలు ఉంటాయి.