భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహ నిర్మాణపనులను అంబేద్కర్ జయంతి వరకూ ఆలస్యం చేయకుండా ముందస్తుగానే పూర్తి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణీత సమయానికి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కూడా అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర మంత్రులు, అధికారులతో కూడిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కమిటీ తాడేపల్లిలోని ఎస్సీ గురుకులం ప్రధాన కార్యాలయంలో సమీక్షను నిర్వహించింది. రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ సమావేశానికి హాజరు కాగా పురపాలక శాఖ మంత్రి ఆదిమూలం సురేష్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు వర్చువల్ గా ఈ సమావేశంలో పాల్గొన్నారు.. మేరుగు నాగార్జున మాట్లాడుతూ, రాబోయే అంబేద్కర్ జయంతి నాటికి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. అయితే అంబేద్కర్ జయంతి అంటే ఏప్రిల్ 14 వరకూ గడువు ఉంది కదా అని విగ్రహనిర్మాణ పనుల్లో జాప్యం చేయకుండా ఈ గడువుకు ముందుగానే విగ్రహ ఆవిష్కరణ పనులను శీఘ్రగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఏపీఐఐసీ అధికారులు ఈ విగ్రహం ఏర్పాటు చేయాల్సిన చోట అడ్డుగా ఉన్న భవనాలను తొలగించే పనులు పూర్తి చేయడంలోనూ ఆలస్యం జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. అంబేద్కర్ విగ్రహంలో అణువణువూ సహజత్వం ఉట్టి పడేలా విగ్రహాన్ని రూపొందించాలని, అంబేద్కర్ ముఖాకృతి తీర్చిదిద్దే విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గతంలో కమిటీ సూచించిన విధంగా విగ్రహంలో మార్పులు చేర్పులు చేసారా, లేదా అనే విషయంగా విగ్రహ శిల్పి నరేష్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు.
మంత్రి ఆదిమూలం సురేష్ మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి 12.5 అడుగులు, 25 అడుగుల నమూనా విగ్రహాల్లో కమిటీ సూచించిన మార్పులన్నీ చేయాలని సూచించారు. అంబేద్కర్ విగ్రహం ప్రజలను ఆకట్టుకొనే విధంగా ఉండేలా చూడాలని కోరారు.
మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటును అత్యంత ప్రాధాన్యతాంశంగా తీసుకోవాలని, దీనికి సంబంధించిన పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విగ్రహం పెడుతున్న చోట భవనాల తొలగింపు విషయంలో సమస్యలు ఉంటే వాటిని కమిటీ దృష్టికి తేవాలని కోరారు. సిఎంఓ సహకారంతో అన్ని సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని చెప్పారు.
దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ, అంబేద్కర్ జయంతి నాటికి విగ్రహం ఏర్పాటు చేయడంలో ఎలాంటి ఆలస్యం జరగకుండా చూసుకోవాలని కోరారు. విగ్రహంలో అంబేద్కర్ ముఖాకృతి మరింత చక్కగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. కాగా అంబేద్కర్ విగ్రహం ముఖాకృతిని 125 అడుగుల సైజులో ఉండే విధంగానే ముందుగా మట్టితో నమూనా విగ్రహాన్ని తయారు చేసి చూపిస్తామని, అందులో ఒకవేళ మార్పులు సూచిస్తే వాటిని కూడా చేసి ఆ తర్వాత మైనంతో నమూనా రూపొందిస్తామని, అనంతరం కాంస్య విగ్రహం తయారీని ప్రారంభిస్తామని విగ్రహశిల్పి నరేష్ కుమార్ ఈ సందర్భంగా చెప్పారు.
మట్టితో చేసే నమూనా విగ్రహాన్ని చూడడానికి మంత్రుల బృందం ఢిల్లీలోని తమ స్టుడియోకు రావాల్సి ఉంటుందన్నారు. దీంతో అసలు సైజులో తయారు చేసే నమూనా విగ్రహాన్ని చూడటానికి ఢిల్లీ వెళ్లాలని మంత్రులు నిర్ణయించారు.