రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ ఆరోపించారు. రహదారుల అభివృద్ధికి భారీ కార్యాచరణతో కూడిన ప్రణాళిక సిద్ధం చేశామని గొప్పలు చెప్పిన జగన్ రెడ్డి ప్రభుత్వం మూడేళ్లు గడుస్తున్నా రాష్ట్రంలో ఒక్క కిలోమీటర్ కూడా రోడ్లు వేయలేదని కనీసం పాడైపోయిన రోడ్లకు మరమ్మతులు కూడా చేయించలేకపోయిందని శైలజనాధ్ మండిపడ్డారు.
కొన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి చేరుకునేందుకు ఇరుకు రహదారులపై ప్రజలు ప్రతిరోజు అవస్థలు పడుతున్నా చోద్యం చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీలో రోడ్లపై పక్క రాష్ట్ర మంత్రులు ఛలోక్తులు విసురుతున్నారని, చినజియ్యర్ స్వామి కూడా ఈ విషయం గురుంచి పేర్కొనడం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి మాటలు వట్టి మాయమాటలేనని తేటతెల్లం అయ్యిందన్నారు. రాష్ట్రాన్ని దివాలా తీయించి, ఆర్ధికవ్యవస్థని నిర్వీర్యం చేసిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి హెలికాప్టర్ లో తిరుగుతూ ప్రజాధనాన్ని వృధా చేయకుండా కనీసం రోడ్లపై తిరిగితే ప్రజలు పడే పరిస్థితి తెలుస్తుందన్నారు. రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, ఒక మండల కేంద్రం నుంచి మరో మండల కేంద్రానికి రెండు లేన్ల రహదారుల అభివృద్ధి ప్రణాళికను ప్రభుత్వం ఖరారు చేసిందని కానీ అవి పేపర్లకే పరిమితమైన ప్రకటనలు అని శైలజనాధ్ అన్నారు. రాష్ట్రంలో ఏ మండలానికి వెళ్లినా సరే గుంతలమయమేనని మండల కేంద్ర రహదారులలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.
న్యూడెవలప్‌మెంట్ బ్యాంక్ ( NDB నుంచి రూ.6,400 కోట్ల రుణంతో రాష్ట్రంలో రెండు దశల్లో 2,500 కి.మీ.మేర రోడ్లు నిర్మిస్తామన్న ప్రభుత్వం ఆ నిధులను ఎక్కడ ఖర్చు పెట్టిందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్‌బీడీ బ్యాంకు రుణంతో జిల్లా ప్రధాన రహదారుల నిర్మాణం శరవేగంగా అభివృద్ధి చేస్తానన్న జగన్ రెడ్డి ప్రభుత్వం గొప్పలు తప్ప ఎక్కడా ఒక్క కిలోమీటర్ రోడ్ కూడా వేయలేదన్నారు. మొదటి దశలో రూ.3,014 కోట్లతో 1,244 కి.మీ., రెండో దశలో రూ.3,386 కోట్లతో 1,268 కి.మీ. మేర మొత్తంగా 2,512 కిలోమీటర్ల రహదారులలో కనీసం ఒక్క అంగుళం రహదారి వేయకుండా కాలయాపన చేశారని దుయ్యబట్టారు. అసలు ఒక్క రోడ్ కూడా నిర్మాణ జరగకుండా రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.85.43 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేశామని గొప్పలు చెబుతున్న జగన్ రెడ్డి సర్కారు రోడ్లు ఎక్కడ వేసిందని ప్రశ్నించారు. రహదారులు వేస్తామని టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థలకు నిధులు మంజూరు చేయకుంటే ఎలా రోడ్లు వేస్తారని శైలజనాధ్ ప్రశ్నించారు. ఈ రహదారులపై కేటాయించిన రూ.6400 కోట్లు ఎటు మళ్లించారో శ్వేత పత్రం విడుదల చేయాలని శైలజనాధ్ డిమాండ్ చేశారు.