అమెరికాలో ప్రతి ఏటా నిర్వహించే క్లిష్టమైన ఆంగ్ల పదాల పోటీ స్పెల్లింగ్ బీ చాంపియన్ షిప్ లో భారత సంతతి వాళ్లే అత్యధికంగా విజేతలుగా నిలుస్తుంటారు.టెక్సాస్ లోని శాన్ ఆంటోనియోలో నిర్వహించిన స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ-2022 పోటీలో తాజాగా 14 ఏళ్ల హరిణి లోగాన్ ఆ ఒరవడిని కొనసాగించింది.
ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న హరిణి 90 సెకన్లలో 21 కష్టమైన పదాలకు ఒక్క తప్పు కూడా లేకుండా స్పెల్లింగ్ చెప్పింది. టోర్నీ చరిత్రలోనే తొలిసారిగా టైబ్రేకర్ ఏర్పడగా, భారత సంతతి కుర్రాడు విక్రమ్ రాజును హరిణి ఓడించింది. డెన్వర్ కు చెందిన విక్రమ్ రాజు 7వ తరగతి చదువుతున్నాడు. చివరిగా moorhen అనే పదానికి స్పెల్లింగ్, అర్థం, ఎలా పలకాలి? అంశాలను కరెక్టుగా చెప్పిన హరిణి లోగాన్ ఈ పోటీలో విజేతగా నిలిచింది.
కాగా, ఇప్పటిదాకా హరిణి నాలుగుసార్లు ఈ స్పెల్లింగ్ బీ పోటీల్లో పాల్గొనగా,. చివరి పర్యాయంలో నెగ్గడం విశేషం. స్పెల్లింగ్ బీ టోర్నీ చరిత్రలో భారతీయులదే ఆధిపత్యం. అయితే గతేడాది మాత్రం ఆఫ్రికా సంతతికి చెందిన జైలా అవాంట్ గార్డే అనే అమ్మాయి విజేతగా నిలిచి భారత సంతతి విద్యార్థుల పరంపరకు అడ్డుకట్ట వేసింది.పుస్తక పఠనం, సృజనాత్మక రచనలు తన అభిరుచులు అని చెప్పే హరిణి… తనకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్ఫూర్తి అని వెల్లడించింది.