కేంద్ర నిబంధనల ప్రకారం పది శాతం విదేశీ బొగ్గు కొనుగోళ్ళకు చర్యలు
దేశవ్యాప్తంగా బొగ్గు కొరతను అధిగమించేందుకు పది శాతం విదేశీ బొగ్గు కొనుగోళ్ళు చేయాలన్న కేంద్రప్రభుత్వ నిబంధనల మేరకు బొగ్గు దిగుమతికి చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సచివాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గత అక్టోబర్ నుంచి దేశ వ్యాప్తంగా బొగ్గు కొరత ప్రారంభమైందని, దానిని పరిష్కరించేందుకు కేంద్ర బొగ్గు, రైల్వే, విద్యుత్ శాఖ మంత్రుల కోర్ కమిటీ ప్రతివారం సమావేశమవుతూ పలు నిర్ణయాలు తీసుకుందన్నారు. దీనిలో భాగంగా విద్యుత్ ప్లాంట్ లకు అవసరమైన బొగ్గులో పదిశాతంను విదేశాల నుంచి రాష్ట్రాలు కొనుగోలు చేయాలన్న నిబంధనను తీసుకువచ్చారని అన్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని బొగ్గు డిమాండ్ లో 31 లక్షల ఎంటిల బొగ్గును విదేశాల నుంచి కొనుగోలు చేసేందుకు విద్యుత్ శాఖ చర్యలు చేపట్టిందని వెల్లడించారు.
దేశంలోని అన్ని విద్యుత్ ప్లాంట్ లకు ఉన్న మాదిరిగానే రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్ లు కూడా రెండు, మూడు రోజులకు సరిపడా నిల్వలనే కలిగి ఉన్నాయని, కేంద్రం ద్వారా వస్తున్న బొగ్గును ఎప్పటికప్పుడు నిల్వ చేసుకుని వినియోగించుకుంటున్నామన్నారు. కనీసం 21 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలలను ఉంచుకోవాలని కేంద్ర నిర్ధేశం ఉన్నా, దానికి అనుగుణంగా డిమాండ్ కు తగినట్లు కోల్ ఇండియా నుంచి ఉత్పత్తి పెరగడం లేదని, కేంద్రం నుంచి కూడా ఎక్కువ సరఫరా జరగడం లేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం నిర్ధేశించిన మేరకు విదేశీ బొగ్గు కొనుగోళ్ళు చేపట్టడం ద్వారా బొగ్గు నిల్వలను పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
విద్యుత్ శాఖాధికారుల అంచనాల ప్రకారం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు డిమాండ్ మేరకు విద్యుత్ ను అందించగలమని, అయితే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఖరీఫ్ పంటలు, ఇతర కారణాల వల్ల విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ సమయంలో అవసరమైన విద్యుత్ ఉత్పత్తిని సాధించడం, రాష్ట్రంలో విద్యుత్ జనరేట్ చేసే సంస్థల నుంచి రాష్ట్ర అవసరాల కోసం విద్యుత్ కేటాయింపులను పొందడం, కృష్ణపట్నం మూడో యూనిట్ ను వినియోగంలోకి తీసుకురావడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు.