దావోస్ ఒప్పందాల వల్ల రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదు
విద్యారంగంలో ప్రమాదకర ధోరణులు పెరిగిపోవడానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలే కారణవుతున్నాయని మాజీ రాజ్యసభ సభ్యులు, సిపిఎం రాష్ట్ర నేత పెనుమల్లి మధు తీవ్ర విమర్శ చేశారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ దావోస్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి ‘బైజుస్’ కంపెనీతో విద్యారంగంలో కలిసి పని చేస్తామని ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో స్కూళ్ల మూసివేత ఉపాధ్యాయ ఉద్యోగాలు రద్దు కార్యక్రమం ఇందులో భాగమేనని అన్నారు. బైజూస్ ద్వారా చదువుకునే విద్యార్థులకు ఆడుకోవడానికి గ్రౌండ్, ల్యాబ్ లు ఉండవని మౌళిక సౌకర్యాలు లోపిస్తాయని ఆన్ లైన్ పాఠాల వల్ల ఉపాధ్యాయులు నిరుద్యోగులుగా మారుతారని పేర్కొన్నారు. రాష్ట్ర విద్యా రంగంలో బైజూస్ కంపెనీ ప్రవేశాన్ని తాము అడ్డుకుంటామని ప్రకటించారు. దావోస్ లో మరో రెండు ఒప్పందాలు ముఖ్యమంత్రి చేసుకున్నారని అందులో టూరిజం ఉందన్నారు. టూరిజం ఒప్పందం అమలైతే టూరిజం లో పనిచేస్తున్న వారందరికీ ఉపాధి కోల్పతారన్నారు. ఆన్ లైన్ షాపింగ్ వల్ల ఇప్పటికే చిల్లర వ్యాపారస్తులు వీధినపడ్డారని గుర్తు చేశారు.
విదేశాల్లో చేసుకున్న ఒప్పందాల వల్ల రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదని ఉన్న ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని పెనుమల్లి మధు పేర్కొన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు 237 శాతం పెంచడం వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారం పడిందని రెండేళ్ల క్రితం లీటర్ పెట్రోలు రూ 69 ఉంటే ప్రస్తుతం రూ .121 లకు పెరిగిందని… మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ పెంచడం వల్ల దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు మండుతున్నాయన్నారు.
వైసిపి నిర్వహించే సామాజిక న్యాయం బస్సుయాత్ర, టిడిపి నిర్వహించే మహానాడులలో కేంద్రంలోని మోడీ విధానాలను విమర్శిస్తారా? అని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని తీర్మానం చేసి కేంద్రాన్ని నిలదీయాలన్నారు. నగరిలో పవర్ లూమ్ కార్మికులకు ఈడీ చార్జీలు పెంచడం దారుణమన్నారు యూనిట్ కు గతంలో 6 పైసలు ధర ఉంటే జగన్ ప్రభుత్వం ఒకేసారి యూనిట్ కు 94 పైసలు పెంచటం శోచనీయమన్నారు. హనుమాన్ శోభాయాత్ర పేరిట బీజేపీ అనుయాయులు సాగిస్తున్న మతోన్మాద చర్యలను ప్రభుత్వం అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. అమలాపురంలో అలజడి జరగడానికి కారణం ప్రభుత్వం ఉదాశీనం గా వ్యవహరించడం వల్లే గొడవలు జరిగాయని ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.
అమలాపురం ఘటనకు కారణమైన శక్తుల్ని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పెనుమల్లి మధు డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు అవుతున్నా ఇప్పటివరకు విభజన హామీలు అమలుకు నోచుకోలేదని అన్నారు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్యాకేజీ, పోలవరం డ్యాం పూర్తి చేసే బాధ్యతలు కేంద్రంపై ఉన్నాయని దీనికి సంబంధించిన సమావేశాలు పదేపదే వాయిదాలు వేయడం మంచిది కాదన్నారు. తక్షణమే విభజన హామీలు అమలు చేయాలని కోరారు. టిటిడిలో పనిచేస్తున్న అటవీ కార్మికులకు టైం స్కేల్ ఇవ్వాలని 558 రోజులుగా రిలే దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వారికి న్యాయం చేయకపోతే అన్ని పార్టీలతో కలిసి ఆందోళన చేస్తామని అవసరమైతే తిరుపతి బంద్ ను నిర్వహిస్తామని ప్రకటించారు.