ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాల కారణంగా మరణాలు సంభవించకుండా పటిష్టమైన రవాణా భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు . కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశ మందిరంలో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జరిగింది. ప్రతి ఒక్కరి ప్రాణం ఎంతో విలువైనదని, కాబట్టి రోడ్డు ప్రమాదాల కారణంగా ఏ ఒక్కరూ ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి రాకుండా జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఇందుకు సంబంధించి రవాణా, పొలీస్, జాతీయ రహదారి, ఆర్ అండ్ బి , పంచాయితీరాజ్, తదితర శాఖల అధికారులకు కలెక్టరు ప్రసన్న వెంకటేష్ పలు సూచనలు చేశారు .
జిల్లాలో నాలుగు నెలల్లో 81 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా వాటిల్లో 83 మంది మృతిచెందడం బాధాకరమన్నారు . ఇటువంటి రోడ్డు ప్రమాదాల నివారణకు ఇప్పుడు తీసుకునే చర్యలు ప్రయోజనం కలిగించే విధంగా ఉండాలన్నారు. ఇకపై ప్రత్యక్షంగా, వర్చువల్ గా ప్రతినెలా రెండు సార్లు రోడ్డు భద్రతా చర్యలపై సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు . ఆర్ అండ్ బి, పంచాయితీరాజ్ , ఎన్.హెచ్ తదితర ఇంజనీరింగ్ శాఖలకు చెందిన ఇంజనీర్లు వారానికి రెండుసార్లు ముఖ్యంగా ప్రధాన రహదారులను పరిశీలించి సమస్యలను గుర్తించి అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న రోడ్లు మరమ్మత్తులు అభివృద్ధి పనులను ఆయా శాఖల ఇంజనీర్లు తనిఖీ చేసి సంబంధిత ఫొటోలను నివేదించాలని కలెక్టరు ఆదేశించారు .
1033 హెల్ప్ లైన్ కు మంచి ప్రచారం కల్పించాలని .. రోడ్డు ప్రమాదాలు సమయంలో అత్యవసర సేవలు అందించేందుకు ఏర్పాటుచేసిన 1033 హెల్స్ లైన్ ( ఎమర్జెన్సీ అంబులెన్స్ ) పై విస్తృత అవగాహన కల్పించాలన్నారు . హెల్ప్ లైన్ నెంబరు 1033 అందరికి కనబడేలా ముఖ్యంగా టోల్గేట్లు రెండు వైపులా ఉన్న ముఖద్వారాల వద్ద పెద్దసైజులో సూచిక బోర్డులను ఏర్పాటుచేయాలన్నారు. జిల్లాలో జీలుగుమిల్లి- జంగారెడ్డిగూడెం- కొయ్యలగూడెం జాతీయ రహదారి మరమ్మత్తుల అభివృద్ధి పనులు పూర్తి చేసే వరకు వేచిచూడకుండా రానున్న 10 రోజులు లోపు ఆ రహదారిలోని గుంతలన్నింటిని పూడ్చే పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని జాతీయ రహదారి అధికారులను కలెక్టరు ఆదేశించారు . ఈ విషయంలో మానవతా ధృక్పదంతో సంబంధిత అధికారులు వ్యవహరించి ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు . జిల్లాలో కొన్ని వంతెల వద్ద విద్యుత్ లైట్లు ఏర్పాటు చెయ్యాలని ఆదేశించారు. జాతీయ రహదారి డివైడర్లపై నిబంధనలకు అనుగుణంగా వర్షాకాల సీజన్ లో మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఇందులో భాగంగా ట్రీ గార్డ్స్ సమకూర్చేందుకు ఎన్.హెచ్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో కాలువ బండ్ , వివిధ ప్రాంతాలలో ఉంచిన యాక్సిడెంట్ , వివిధ కేసులకు సంబంధించి ఉన్న పాత వాహనాలను పోణంగిలోని డంప్ యార్డ్ కు తరలించేందుకు పోలీసు , రవాణా శాఖాధికారులు చర్యలు చేపట్టాలన్నారు .
మానవ తప్పిదాలతోనే ఎక్కువ ప్రమాదాలు .. మానవ తప్పిదాలతోనే అత్యధిక శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు . మద్యం సేవించి , హెల్మెట్ లేకుండా , సీట్ బెల్ట్ లేకుండా, సెల్ ఫోన్ వినియోగిస్తూ ఆయా వాహనాలను నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు . పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కూడా ముమ్మరంగా చేపట్టాలన్నారు .
ప్రాణదాతలకు రూ . 5 వేలు పారితోషికం ..
రహదారి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించి ఆదుకోనే వారికి రూ. 5 వేల చొప్పున పారితోషికాన్ని అందించే విషయంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు . ఈ విషయంలో జాతీయ రహదారి వెంబడి ఉన్న గ్రామాల్లో డీఎస్పీల ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు . తొలిగంటలో ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడేవారికి నగదుతో పాటు ప్రశంసా పత్రాన్ని అందించడం జరుగుతుందన్నారు . ఎవరైనా తమంతటి తాముగా బాధితుల్ని నేరుగా ఆసుపత్రికి తరలిస్తే పూర్తి వివరాలను ఆసుపత్రి వారే నేరుగా పోలీసులకు అందిస్తారని సూచించారు. ప్రమాదం గురించి మొట్టమొదటిగా ఎవరైనా పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి తెలియజేయవచ్చన్నారు. ఈ విషయంలో సమాచారం అందించిన వారికి ఎటువంటి ఇబ్బంది లేకపోవడంతో పాటు రూ. 5 వేలు పారితోషికం, ప్రసంశా పత్రాన్ని పొందే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు .
