ఏ మహానాడులోనూ ఒంగోలు మహానాడులో ఉన్నంత కసి చూడలేదని ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అద్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఉన్మాదుల పాలన నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించాలని కార్యకర్తలు తరలి వచ్చారన్నారు. టీడీపీకి జనాలు ఉన్నారని, వైసీపీకి బస్సులున్నాయని చంద్రబాబు ఎద్దేవా చేశారు. మహానాడును అడ్డుకునేందుకు పోలీసులు ఎంతో ప్రయత్నించారనున్నారు. మహానాడు వాహనాలకు గాలి తీసేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం గాలి తీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. ‘‘జగన్ కు ఈ రోజు పిచ్చెక్కుతుంది. ఇవాళ నిద్ర పట్టదు. వైసీపీ నేతలు వెల వెల..టీడీపీ మీటింగులు కళ కళ. భవిష్యత్తులో ఎన్టీఆర్ రికార్డులను ఎవ్వరూ బద్దలు కొట్టలేరు. ఏడాది పాటు ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు చేపడుతున్నాం. ఎన్టీఆర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా జిల్లాల్లో మినీ మహానాడు కార్యక్రమాలు చేపడతాం.’’ అని చంద్రబాబు తెలిపారు. జగన్ తనను తాను కాపాడుకోడానికి కేంద్ర చేతిలో కీలుబొమ్మగా మారాడని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఎన్టీఆర్ వ్యవసాయ మోటార్లకు మీటర్లు తీసేస్తే.. జగన్ వచ్చి మీటర్లు పెడుతున్నాడని.. మీటర్లు బిగించకుండా రైతులు పోరాడాలని.. అందుకు మేం అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పోలవరం, రైల్వే జోన్, విశాఖని జగన్ తాకట్టు పెట్టారని పేర్కొన్నారు.
ముగింపు సభలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రసంగించారు. తాను కొన్ని వందల సభల్లో పాల్గొన్నానని, కానీ ఇంత చైతన్యం కనిపించిన సభ ఇదొక్కటేనని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సభ ద్వారా వైసీపీతో యుద్ధం మొదలైందని సమరశంఖం పూరించారు. ఎంతో పట్టుదలతో, ఈ యుద్ధంలో భాగస్వాములు కావాలని కార్యకర్తలు ముందుకొచ్చారని, సోదరసోదరీమణులందరికీ శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నానని కొనియాడారు. ఈ యుద్ధంలో వైసీపీని భూస్థాపితం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, తాడోపేడో తేల్చుకోవడానికి మీరంతా ముందుకొచ్చారని అభినందించారు. ఈ జనాన్ని చూసి వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. ఒంగోలు మహానాడుకు లక్షలాదిగా తరలివచ్చారు. టీడీపీ కార్యకర్తలను రాకుండా చేసేందుకు వాహనాలను అడ్డుకున్నారు. డబ్బులు కడతాం అని చెప్పినా బస్సులు ఇవ్వలేదు. తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక వంటి మహానుభావుడికి మనం వారసులం… మనం భయపడతామా? మనలో ఎన్టీఆర్ స్ఫూర్తి ఉంది.
చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రి సినిమా వాళ్లను కూడా గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నాడు. సినిమా వాళ్లకు నువ్వు పర్మిషన్లు ఇస్తావా? జగన్…అలాగైతే రేపు నీ పేపర్ కు కూడా నేనే పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. నీ టీవీ చానల్ ఎలా నడుపుతావ్? నీ భారతి సిమెంట్ ఎలా నడుపుతావ్?ఏదైనా కొన్ని విలువలతో రాజకీయం చేస్తే శాశ్వతంగా ఉంటుంది కానీ, తప్పుడు రాజకీయాలు చేస్తే అది శాశ్వతం కాదు. మనం బాదుడే బాదుడు మొదలుపెడితే… వీళ్లు వెంటవెంటనే గడపగడపకు మన ప్రభుత్వం అని మొదలుపెట్టారు. ప్రజలు నిలదీయడంతో బస్సు యాత్ర పెట్టారు. అది కూడా అయిన తర్వాత గాలి యాత్ర పెట్టి, గాల్లో తిరుగుతారని చంద్రబాబు విమర్శించారు. మహానాడు నిర్వహణకు భూములు ఇచ్చిన రైతులకు, ప్రకాశం జిల్లా నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఇళ్లకు జాగర్తగా వెళ్ళండి అంటూ కార్యకర్తలకు చంద్రబాబు సూచన చేశారు. ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. క్విట్ జగన్ ..సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ప్రసంగం ముగించిన చంద్రబాబు..
గుడినే కాదు గుడిలోని లింగాన్నీ మింగే రకం : బాలకృష్ణ
టీడీపీ మహానాడు 2022 ముగింపు సందర్భంగా ఒంగోలులో నిర్వహించిన బహిరంగ సభలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే యువతకు భవిత ఉంటుదన్నారు బాలయ్య. నేల ఈనిందా ఆకాశానికి చిల్లుబడిందా అన్నట్టుగా ఇసుకేస్తే రాలనంత జనం ఈ సభకు హాజరయ్యారని బాలయ్య వ్యాఖ్యానించారు. జగన్ సర్కారు ప్రజలకు ఊపిరి ఆడకుండా బస్సు ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు.. ఇలా అన్నింటి రేట్లు పెంచేసిందని మండిపడ్డారు. ఏటా మహానాడు జరుపుకుంటున్నాం. కానీ ఈ మహానాడుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజు ప్రపంచపటం మీద తెలుగు సంతకం, తెలుగు ఆత్మగౌరవానికి ఆరడుగుల ప్రతిరూపం, శక పురుషుడు నందమూరి తారకరామారావు శత జయంతి అంటూ ఎన్టీఆర్‌ను బాలయ్య స్మరించుకున్నారు.
ఇది లోకేష్ మార్క్ మహానాడు…
టిడిపి మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అధికార పక్షం కలవరపడేలా సొంత పక్షంలో నేతలు సైతం యాక్టివ్ అయ్యేలా మహానాడు పెద్ద మెసేజ్ నే పంపింది. టిడిపికి మహానాడు కొత్త కాకపోయినా ఈ మహానాడు అత్యంత కీలకం. దీంతో మహానాడు నిర్వహించే ప్రాంతం నుంచి తీర్మానాల వరకు ప్రతి అంశంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు పార్టీ పెద్దలు. ముఖ్యంగా ఈ మహానాడులో అడుగడుగునా లోకేష్ మార్పు కనిపిస్తుంది. అధినేతను ఒప్పించడం నుంచి నేతలను సమన్వయ పరచడం వరకు తెర వెనుక చేసిన కృషి అద్భుత ఫలితాన్ని ఇచ్చింది.
మహానాడు అంటే విజయవాడ, తిరుపతి, వైజాగ్, రాజమండ్రి వంటి ప్రాంతాలే గుర్తు వస్తాయి. కానీ ఈ సారి వినూత్నంగా ఒంగోలును ఎంపిక చేశారు. దీని వెనుక ప్రత్యేక కారణం, లోకేష్ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పుడూ మహానాడు చేసే ప్రాంతం కాకుండా…కొత్త ప్రాంతంలో…కొత్తగా ప్రజలకు కనెక్ట్ అయ్యేలా మహానాడు ఉండాలని భావించారు. వెనుకబడిన ప్రాంతంగా ఉన్న ప్రకాశం జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి. వీటిపై టిడిపి నేతలు గట్టిగానే పోరాడుతున్నారు. దీంతో ఒంగోలులో మహానాడు నిర్వహిస్తే మంచి సక్సెస్ అవుతుందని లోకేష్ భావించారు. .లోకేష్ ఈ విషయంలో అధినేతను ఒప్పించారు. దీంతో మొదటి సారి టిడిపి మహానాడుకు ఒంగోలు వేదిక అయ్యింది.
మారుతున్న కాలం…ఇతర పోకడలకు అనుగుణంగా మహానాడు నిర్వహణ ఉండాలన్నది లోకేష్ ఆలోచన. అందులో భాగంగానే మూడు రోజుల మహానాడును రెండు రోజులకు కుదించారు. అది కూడా తొలి రోజు ప్రతినిధుల సభతో సరిపెట్టారు. రెండో రోజు భారీ బహిరంగ సభ నిర్వహించారు. రానున్న రోజుల్లో ఎన్నికల్లో 40శాతం సీట్లు యువతకే అని అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ప్రకటించారు.దీంతో మహానాడు నిర్వహణ నుంచే విధాన నిర్ణయం అమలు మొదలు పెట్టాలని లోకేష్ భావించారు. ఇందులో భాగం గా తీర్మానాలపై మొత్తం 36 మంది మాట్లాడితే మొదటి సారి 50 శాతం యువత, కొత్తవారికే అవకాశం ఇచ్చారు.
మహానాడు ప్రాంగణంలో మీడియా పాయింట్ కు వచ్చిన లోకేష్ అత్యంత కీలకాంశాలపై తన అభిప్రాయాలు, పార్టీ నిర్ణయాలు వెలిబుచ్చారు. మూడుసార్లు వరుసగా ఓడిపోతే పార్టీ టిక్కెట్ ఇవ్వకూడదు అనే చర్చ ఉందని..దీనిపై పార్టీ సీరియస్ గా ఆలోచన చేస్తుందన్నారు. పార్టీలో రెండు సార్లు వరుసగా పార్టీ పదవుల్లో ఉన్న వారికి మూడో సారి అవకాశం ఉండదు అనే అంశాన్ని ప్రస్తావించారు. ఇది కేవలం కొందరికే కాదని తనతో పాటు అంతా ఈ నిర్ణయం పరిధిలోకి వస్తారని తేల్చి చెప్పారు. మహానాడు నిర్వహణ ద్వారా పార్టీ ఏం చెప్పాలనుకుందో ఆ విషయాన్ని చెప్పించడంలో లోకేష్ నూటికి నూరు శాతం గ్రాండ్ సక్సెస్ అయ్యారు.
అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా మహానాడును విజయవంతం చేయగలిగాం-అచ్చెన్నాయుడు
ప్రభుత్వం ఎంత బెదిరించినా, అధికార పార్టీ నేతలు ఎన్ని హెచ్చరికలు చేసినా లెక్క చేయకుండా విలువైన భూమిని మహానాడు నిర్వహించుకోవడానికి ఇచ్చిన మండువవారిపాలెం రైతులందరికి టీడీపీ తరపున టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు పాదాభివందనాలు తెలిపారు..
అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా మహానాడును విజయవంతం చేయగలిగాం. మహానాడుకు ప్రజలు, కార్యకర్తల నుంచి వచ్చిన స్పందన చూసి వళ్లు పులకరించింది.. మహానాడు జరగకుండా జగన్, ఆయన తాబేదారులు అనేక అడ్డంకులు సృష్టించారు. అయినా లక్షలాది మంది, ఇసుక వేస్తే రాలనంత జనం హాజరయ్యారు. 46 డిగ్రీల ఉష్ణోగ్రతలున్నా లెక్క చేయకుండా జనం తండోపతండాలుగా వచ్చారు. వైసీపీపై వచ్చిన తిరుగుబాటు అని స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటికైనా జగన్ లో మార్పు రావాలని అచ్చెన్నాయుడు సూచించారు.
పసుపుమయంగా మారిన మండువవారిపాలెం
ఒంగోలు సమీపంలోని మండువవారిపాలెం కేంద్రంగా జరిగిన టీడీపీ మహానాడుకు ఆ పార్టీ శ్రేణులు పోటెత్తారు. ఈ సభకు తెలుగు రాష్ట్రాల నుంచి పార్టీ శ్రేణులు, టీడీపీ అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఏపీ నుంచే కాకుండా తెలంగాణ నుంచి కూడా మహానాడు బహిరంగ సభకు భారీ ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చాయి. బహిరంగ సభకు దాదాపుగా 1.50 లక్షల మంది హాజరు అవుతారని టీడీపీ అధిష్ఠానం భావించింది. అయితే ఆ అంచనాలను మించి ఏకంగా 3 లక్షల మంది పార్టీ శ్రేణులు బహిరంగసభకు హాజరు కావడం గమనార్హం.