మూడేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు ఎవ్వరూ సంతోషంగా లేరని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పేర్కొన్నారు.విజయవాడలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…..పదవులు పొందిన వారు తప్పా ఎవ్వరూ సంతోషంగా లేరని తెలిపారు. లక్షా 42 వేల కోట్ల రూపాయలను వివిధ పధకాల కింద ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పంచారని, రాష్ట్ర అభివృద్ధిని ఏ మాత్రం పట్టించుకోలేదని తీవ్రస్థాయిలో విమర్శించారు. పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో అన్నీ ధరలు విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలను పెంచేశారని వివరించారు. ఆవగింజ అంత ఇచ్చి గుమ్మడి కాయంతా తీసుకున్నట్టుగా ….ఆటో డ్రైవర్లకి పది వేలు ఇచ్చి… రెట్టింపు వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు.
ఈ మూడేళ్లల్లో ఒక్క రంగంలో అయినా అభివృద్ధి ఉందా? అని ఆయన ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి మాట తప్పారని, కనీసం కేంద్రాన్ని అడిగే ధైర్యం కూడా ముఖ్యమంత్రికి లేదని విమర్శించారు.దావోస్‌కి వెళ్లిన సీఎం జగన్ ఏం తెచ్చారో ప్రజలకు చెప్పాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పదవులు ఇచ్చామని చెప్పుకుంటున్నారని, వాళ్ల అభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. గడప గడపకు మన ప్రభుత్వం,బస్సు యాత్రలతో ప్రజలకు ప్రయోజనం ఏమిటని ఆయన ప్రశ్నించారు.గతంలో ఉన్న అప్పులు , తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అప్పుల గురించి శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై అన్ని వర్గాల వారిని ఆహ్వానించి త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని కె. రామకృష్ణ తెలిపారు.
