- ఇందిరమ్మ ఇళ్ల పరిస్థితి అద్వాన్నం
కనీస మౌలిక వసతులు సూన్యం
అవస్థల్లో నియోజకవర్గవాసులు
ప్రభుత్వం తమ గోడు పట్టించుకోవాలని వినతి
చంద్రగిరి : ఈ నియోజకవర్గంలోని ఇందిరమ్మ ఇళ్ల పరిస్థితి అద్వాన్నంగా ఉంది. కనీస మౌలిక వసతులు కూడా ఇక్కడ ఉండడం లేదు. ఇక్కడి ప్రజలు అధికారులకు ఎన్నిసార్లు మోర పెట్టుకున్న ఫలితం లేకుండాపోతోంది. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పుత్తూరు నియోజకవర్గం నుండి రామచంద్రాపురం మండలం, పీలేరు నియోజకవర్గంలో ఉన్న ఎర్రావారిపాళ్యం, చిననగట్టిగల్లు, తిరుపతి రూరల్ మండలాలు చంద్రగిరి నియోజకవర్గంలో చేరాయి. చంద్రగిరి నియోజకవర్గం నుండి చంద్రబాబు తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. చంద్రబాబు 1989 నుండి వరుసగా ఆరు సార్లు గెలిచారు. 1978 లో ఇక్కడ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు 1983 లో టీడీపీ అభ్యర్ధి చేతిలో ఓడిపోయారు. 1994 లో ఇదే నియోకవర్గం నుండి చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు టీడీపీ అభ్యర్ధిగా గెలుపొందారు. ఇద్దరు మహిళా నేతలు గల్లా అరుణ, సినీనటి రోజా సైతం ఈ నియోజకవర్గం నుండే ఎన్నికల బరిలోకి దిగారు. ప్రస్తుతం వైస్సార్సీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఇందిరమ్మ ఇళ్ళలో మౌళిక వసతులు కరువు ?
మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయంలో చిత్తూరు బెంగుళూరు నేషనల్ హైవే మల్లయ్యపల్లికి వెళ్ళే దారిలో ఇందిరమ్మ ఇళ్లులు పేదలకు కేటాయించారు. ఐతే ఇక్కడ సామాన్య పేద ప్రజానీకం నివసించడానికి అవసరమయ్యే వసతులు మాత్రం ఇంకా కల్పించలేదు . నీటి సమస్యతో పాటు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ లో విద్యుత్తు సమస్య అదే విధంగా చెత్తసమస్యతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. అదేవిధంగా విషసర్పాలు ఇళ్లలోకి వస్తుండడంతో తీవ్ర ఆందోళనకు గురి చేసే విషయం చిన్నపిల్లలు, వృద్దులు ఈ సమస్యలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. స్వచ్ఛభారత్ కూడా ఇక్కడ అమలు కావడం లేదు. ప్రతి నెలా టాంకర్ నీటి రూ.500 లు పెట్టి కొనుక్కునే పరిస్థితి ఈ నియోజకవర్గంలో నెలకొంది. అలాగే సరైన డ్రైనేజి వ్యవస్థ లేకపోవడంతో చిన్నపాటి వర్షానికే మురుగునీరు రోడ్ల మీదకు, ఇళ్లలోకి వచ్చి చేరుతోంది. వీధి లైట్లను కూడా ఏర్పాటు చేయకపోవడంతో రహదారి మధ్యలో పిచ్చి చెట్లు పెరిగిపోయి చీకటైతే బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు వీధికుక్కల బెడద చాలా ఎక్కువైపోయింది. ఇన్ని సమస్యలతో ఇక్కడి ప్రజలు సావాసం చేయాల్సి వస్తోంది. ఈ సమస్యల మీద ప్రజలు అధికారులకు ఎన్నోసార్లు విన్నవించుకున్నారు. ఐనా ఫలితం సూన్యం.
ఆమ్ ఆద్మీ పార్టీ నిరసన
చంద్రగిరి నియోజకవర్గంలోని ఇందిరమ్మ ఇళ్ల పరిస్థితిపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత నవీన్ కుమార్ రెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇక్కడ సామాన్యులు నివసించే పరిస్థితి లేదని ప్రభుత్వం కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల పరిస్థితిని గమనించి వారి సమస్యలను తీర్చాలని నియాజకవర్గ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.