మహిళల అభివృద్ధి, శిశు సంక్షేమానికి సంబంధించి భాగస్వామ్యం వహిస్తున్న విభిన్న సంస్దలు క్షేత్రస్ధాయిలో మరింత మెరుగైన పనితీరును కనబరచాలని రాష్ట్ర మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ సంచాలకురాలు డాక్టర్ సిరి తెలిపారు. గుంటూరు సంచాలకుల కార్యాలయంలో యునిసెఫ్, కేర్ ఇండియా, ప్రధమ్, టాటా ట్రస్ట్, వరల్డ్ విజన్, ఐటిసి, అమెరికన్ ఇండియా పౌండేషన్, కేర్ ఎన్ గ్రో సంస్దల ప్రతినిధులతో ఉన్నత స్దాయి సమావేశం నిర్వహించారు. విభిన్న ప్రాజెక్టుల రూపంలో ఈ సంస్ధలు మహిళాభివృద్ది శాఖలో భాగస్వాములు కాగా, అయా సంస్థల ప్రతినిధులు తమ కార్యకలాపాలను గురించి సంచాలకులకు వివరించారు. డాక్టర్ సిరి మాట్లాడుతూ రాష్ట్రంలో ఐదేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల ఖచ్చితమైన బరువులు, ఎత్తులను కొలవడానికి, ఈనెల 20 తేదీ వరకు నిర్వహించనున్న వృద్ధి మానిటరింగ్ డ్రైవ్‌ను విజయవంతం చేయాలన్నారు. తద్వారా గ్రోత్ మానిటరింగ్ డేటా నాణ్యతను నిర్ధారించడానికి అవకాశం కలుగుతుందన్నారు. పిల్లల ఎత్తులు, బరువులను కొలిచే క్రమంలో అంగన్‌వాడీ వర్కర్లను ఎలా పర్యవేక్షించాలన్న విషయంపై సిడిపిఓలు, సూపర్‌వైజర్‌లకు ప్రత్యేక శిక్షణ అందిస్తామన్నారు. ఈ శిక్షణలో అన్ని భాగస్వామ్య సంస్థలను పాలుపంచుకోవాలని సూచించారు.
తక్కువ ఖర్చుతో పోషక సహితంగా లభించే స్ధానిక ఆహార వినియోగంపై ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. విభిన్న ప్రాంతాలలో పలు రూపాల్లో ఇవి అందుబాటులో ఉంటాయని వాటిని గుర్తించి తల్లులకు అందించాలన్నారు. ప్రసూతి రక్తహీనత రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నందున, దాని నివారణకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. పోషకాహార లోపాన్ని పరిష్కరించడంతో పాటు, కీలకమైన బాల్య వివాహాల నివారణపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉందన్నారు. జీవితచక్ర విధానంలో ముఖ్యమైన కౌమార ఆరోగ్యాన్ని మెరుగుపరచంపై ప్రతి భాగస్వామ్య సంస్థ దృష్టి సారించాలన్నారు. బాల్యవివాహాలకు కారకులైన వ్యక్తుల శిక్షలను హైలైట్ చేసే సందేశాలతో ఐఇసి మెటీరియల్‌ని అభివృద్ధి చేయాలన్నారు. పిల్లల దుర్వినియోగంపై ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ కేటాయించనున్నామని డాక్టర్ సిరి పేర్కొన్నారు. తగినంత స్థలం ఉన్న అన్ని అంగన్‌వాడీ కేంద్రాలలో పోషకాహార ఉద్యానవనాలను అభివృద్ది చేసేలా చూడాలన్నారు. సమావేశంలో అయా సంస్ధల ప్రతినిధులు, శాఖాధికారులు పాల్గొన్నారు.