ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యలపై రాజకీయ, సినీ వర్గాల్లో దుమారం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో అంబటి, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ట్రోల్స్‌పై దాడికి దిగడం చర్చకు దారి తీసింది. ఈ వివాదం వివరాల్లోకి వెళితే..
ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు గురించి అందరికీ తెలిసిందే. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఎవరైనా రాజకీయ విమర్శలు చేస్తే చాలు ఒంటికాలిపై లేచే ఈ సత్తెనపల్లి ఎమ్మెల్యే తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. సోషల్ మీడియా వేదికగా అంబటి రాంబాబును జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏకిపడేస్తున్నారు. ట్విట్టర్ లో #JaganShouldApologizeJrNTR అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అసలు ఇంతకీ ఏంటీ గొడవ..? జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అంబటి రాంబాబు, జగన్ క్షమాపణ చెప్పాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు..? అంబటి ఏం వ్యాఖ్యలు చేస్తే జూనియర్ ఫ్యాన్స్ కు అంత కోపమొచ్చింది..? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించాలి.
జూనియర్ ఎన్టీఆర్ బోనియర్ ఎన్టీఆర్ అంటూ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేష్‌ను విమర్శలు గుప్పించారు. మధ్యలో జూనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి.. జూనియర్ ఎన్టీఆర్ కాదు.. బోనియర్ ఎన్టీఆర్ అంటూ కామెంట్ చేశారు. దాంతో ఎన్టీఆర్ అభిమానులు ట్వీట్లు, ట్రోల్స్‌తో ఊగిపోతున్నారు. #JaganShouldApologizeJrNTR అనే ట్యాగ్‌ను ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రెండింగ్ చేస్తున్నారు.
ఈ వ్యాఖ్యలు జూనియర్ అభిమానులకు చిర్రెత్తుకొచ్చేలా చేశాయి. తమ హీరో రాజకీయాలకు దూరంగా సినిమాలు చేసుకుంటుంటే అనవసరంగా ఎన్టీఆర్ పేరును లాగి అంబటి నానా యాగీ చేస్తున్నారని మండిపడుతున్నారు. అంతేకాదు.. అడ్డూఅదుపూ లేకుండా అంబటి చేసిన ఈ వ్యాఖ్యల పట్ల అంబటితో పాటు జగన్ కూడా జూనియర్ ఎన్టీఆర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ #JaganShouldApologizeJrNTR అనే ట్విట్టర్ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. అంబటి చరిత్ర అందరికీ తెలుసని, గతంలో మహిళతో మాట్లాడిన కాల్ రికార్డ్ వీడియోలను జూనియర్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. అంతటితో కూడా అంబటిపై జూనియర్ ఫ్యాన్స్ కోపం చల్లారలేదు. అంబటి ఫొటోకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్టుగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అంబటి క్షమాపణ చెప్పకపోతే పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు హెచ్చరిస్తున్నారు.