‘పేద విద్యార్థులు ప్రపంచంతో పొటీపడేలా నాణ్యమైన, ఇంగ్లీష్ చదువు అందించాలన్నదే నా సంకల్పం.. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే’’ అని కర్నూలులో జరిగిన జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ కారక్రమంలో సీఎం వైఎస్.జగన్ పేర్కొన్నారు. రేపటి తరం పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పంతోనే అమ్మఒడి, విద్యా కానుక, ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యాదీవెన, వసతిదీవెన వంటి పథకాలు అమలు చేస్తున్నాం’’ అని జగన్ వివరించారు. కాని ఆచరణలో మాత్రం ఇందుకు విరుద్దంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు కొన్నిచోట్ల నిరసనలకు కూడా దిగుతున్నారు. రాష్ట్రంలో బడిగంట మోగింది. అయితే అనేక చోట్ల పాఠశాలలకు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా వచ్చారు.
ఏపీలో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, నూతన విద్యా విధానమంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలతో విద్యా వ్యవస్థలో అయోమయం నెలకొంది. పాఠశాలలను మూసేయకుండా విలీనం చేసేస్తున్నారు. ఊరిలోని బడిని మరోచోటకు తరలించడమంటే మూసివేత దిశగా పావులు కదపడం కాక మరేమిటి ? అంటూ విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. మరో వైపు వేసవి సెలవులు ముందు వరకు ఉన్న బడి ఇప్పుడు మాయమైపోయిందని పలుచోట్ల విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనలు చేపట్టారు. వేసవి సెలవులు ముందు వరకు ఉన్న బడి ఇప్పుడు మాయమైపోయింది. పాఠశాల తరలిపోయిందని ఉపాధ్యాయులు చెప్పడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఎవరు ఏ బడికి వెళ్లాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు. దీంతో పాఠశాలలు తెరచుకున్న తొలిరోజునే పలు చోట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి. ఏపీలో ప్రభుత్వం పలు పాఠశాలలను విలీనం చేయడంతో విద్యార్థులు కిలోమీటర్ల కొద్దీ ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) అమలు పేరుతో ప్రాథమిక పాఠశాలను విచ్ఛిన్నం చేస్తున్నారు. కరికులమ్, బోధనా విధానాల అమలు కోసమే పాఠశాల విద్యను ఎన్‌ఈపీ నాలుగు స్థాయిలుగా విభజించింది. పాఠశాలను భౌతికంగా విభజించాల్సిన అవసరం లేదని కేంద్ర పాఠశాల విద్యాశాఖ చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఉపాధ్యాయులు, పాఠశాలల సంఖ్యను తగ్గించుకునేందుకు చూస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న 42,000 పాఠశాలలు భవిష్యత్తులో 11,000కు తగ్గిపోనున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ఈ ఏడాది కిలోమీటరు దూరంలోని ప్రాథమికోన్నత, ఉన్నత బడుల్లో విలీనం చేస్తున్నారు. ఇప్పటికే 250 మీటర్ల దూరంలోని 3,627 ప్రాథమిక బడుల నుంచి 3, 4, 5 తరగతులను 3,178 ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. ఇప్పుడు కిలోమీటరు దూరంలోని 8,412 ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను తరలిస్తున్నారు. ఇదికాకుండా 6, 7, 8 తరగతుల్లో 100లోపు విద్యార్థులు ఉంటే వీరిని 3 కిలోమీటర్ల దూరంలోని ఉన్నత పాఠశాలల్లో కలిపేస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు ఊళ్లో అందుబాటులో ఉన్న పాఠశాలలు మూతపడుతున్నాయి.
తల్లిదండ్రులు, విద్యార్థుల ఆందోళన
శ్రీకాకుళం జిల్లా పలాసలోని మోగిలపాడు ప్రాథమికోన్నత పాఠశాలను పలాస జిల్లా పరిషత్ పాఠశాలలో విలీనం చేయొద్దంటూ తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చేశారు. శ్రీకాకుళం జిల్లా హిరమండలం శుభలై ఆర్.ఆర్.కాలనీ ప్రభుత్వ పాఠశాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు చేపట్టిన నిరసనకు మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మద్దతు తెలిపారు. అనంతపురం జిల్లా కనేకల్ ప్రాథమిక ఉన్నత పాఠశాల విలీనాన్ని తప్పుపడుతూ తల్లిదండ్రులు రాస్తారోకో చేశారు. బ్రహ్మసముద్రం మండలం చెలిమేపల్లిలో పాఠశాల ముందు ముళ్ళకంచె వేసి విద్యార్థులు, తల్లిదండ్రులు నిరసన తెలిపారు. సుదూర ప్రాంతానికి వెళ్లి తమ పిల్లలు ఎలా చదువుకుంటారని ప్రశ్నించారు. పల్నాడుజిల్లా పిల్లల భవిష్యత్తుతో చెలగాటం వద్దని పాత పాఠశాలనే కొనసాగించాలని నందిరాజుపాలెం గ్రామ ప్రజలు నిరసన చేపట్టారు. బెల్లంకొండ మండలంలోని నందిరాజుపాలెం గ్రామంలో ఉన్న ఎంపియుపి స్కూలు 6, 7, 8 వ తరగతలను బెల్లంకొండ జిల్లా పరిషత్ హైస్కూలులో విలీనం చేయవద్దని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల తమ పిల్లలు కష్టాలు ఎదుర్కొంటారని ఆవేదన చెందారు. స్కూలు వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు నిరసన తెలిపి మండల విద్యాశాఖ అధికారి రాజకుమారికి, శివారెడ్డి, మరియదాసుల ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు.
అనంతరపురం జిల్లా హిందూపురం టౌన్ స్కూళ్ల విలీనంపై విద్యార్థుల తల్లిదండ్రులు భగ్గుమన్నారు. బడుల పునఃప్రారంభం తొలిరోజునే తిరుగుబాటు చేశారు. దగ్గరలో ఉన్న తరగతులను తీసుకెళ్లి, దూరంగా ఉన్న బడిలో కలపడం ఏంటని మండిపడ్డారు. దూరంగా వెళ్లక తప్పదంటే.. బడి మాన్పిస్తాం గానీ, తమ పిల్లలను మాత్రం పంపించం అని స్పష్టం చేశారు. ఏకంగా పాఠశాలలోని టీచర్లను బయటకు పంపించేసి, తాళం వేశారు. అక్కడే నిరసనకు దిగారు. హిందూపురం పట్టణంలోని మేళాపురంలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలో 6 నుంచి 8వ తరగతి వరకు 86 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ మూడు తరగతులను 2కి.మీ., దూరంలో ఉన్న దండు రోడ్డులోని ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులంతా వెళ్లారు. వారిని దూరంగా ఉన్న ఉన్నత పాఠశాలకు వెళ్లాలని ఉపాధ్యాయులు చెప్పారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని, ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలోని ఉపాధ్యాయులు, విద్యార్థులను బయటకు పంపి, గేటుకు తాళాలువేసి నిరసన తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలను ఇక్కడే కొనసాగించాలని పట్టుబట్టారు. పాఠశాల దగ్గరలో ఉంటేనే విద్యార్థులు వస్తారనీ, దూరంగా ఉంటే వెళ్లరనీ, దీనివల్ల వారి భవిష్యత్తు నాశనమవుతుంది ఆవేదన చెందారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఎంఈఓ గంగప్ప సర్దిచెప్పడంతో పాఠశాలకు వేసిన తాళాలను తెరిచారు. తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లారు. అనంతపురం జిల్లా, కుందుర్పి మండలం, మాయదార్లపల్లి ప్రాథమికొన్నత పాఠశాల లోని 6,7,8 తరగతులను బాసాపురం ఉన్నత పాఠశాలలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ పాఠశాలకు తాళం వేసి, లోపలకు ఎవరూ వెళ్లకుండా కంపలు వేసి నిరసన చేయడం జరిగింది.
నెల్లూరు జిల్లావ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, రాజకీయ పార్టీల నాయకులు ఆందోళనబాట పట్టారు. ప్రాథమిక పాఠశాలలను విలీనం చేయడం ద్వారా తమ పిల్లలు బడులకు దూరమవుతారంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ సంఘాలు సైతం విలీనాన్ని నిరసిస్తూ ధర్నాలకు పిలుపునిచ్చాయి. జలదంకి, వలేటివారిపాళెం, సంగం, కొండాపురం, రాపూరు, బోగోలు తదితర మండలాల్లో ఆందోళన చేపట్టారు. విలీనం చేయవద్దని కోరుతూ ఎంఈవోలకు, హెచ్‌ఎంలకు వినతిపత్రాలు అందజేశారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని మాయాదార్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలోని 6,7,8 క్లాసులను బాసాపురం హైస్కూల్‌లో విలీనం చేశారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాలకు తాళం వేసి, కంప చెట్లు అడ్డు పెట్టి ఆందోళన చేశారు. శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం ప్రాథమిక పాఠశాలను హైస్కూల్లో విలీనం చేశారు. దీంతో ప్రాథమిక పాఠశాల వద్ద గ్రామస్థులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. వైసీపీకి సర్పంచ్ రామాంజనేయులు, మేడాపురం ఎంపీటీసీ-1 నాగేశ్వర్‌రెడ్డి సైతం ఆందోళనలో పాల్గొన్నారు.పెనుకొండలోని తిమ్మాపురం స్కూల్ విలీనాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు, సీపీఎం నాయకులు రాస్తారోకో చేశారు. గుత్తి ఆర్‌ఎ్‌సలోని నంబర్-2 ప్రైమరీ స్కూల్‌ను విలీనం చేయవద్దంటూ ఎంఈవో ఆఫీస్ వద్ద ఆందోళన చేశారు.మడకశిర రూరల్‌లోని మెళవాయి ప్రాథమిక పాఠశాల వద్ద నేలపై కూర్చుని విద్యార్థులు, తల్లిదండ్రులు నిరసన తెలిపారు. యాడికి మండలంలోని నెంబర్-5 ప్రాథమిక పాఠశాల వద్ద రోడ్డుకు అడ్డంగా బైఠాయించి ఆందోళన చేశారు. కృష్ణాజిల్లా లక్ష్మీపురంలోని ఆర్.సి.ఎం. పాఠశాలను ప్రభుత్వం మూసివేయడంతో రహదారిపై బైఠాయించి విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని ప్రభుత్వ పాఠశాలను ముదిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు ధర్నా చేశారు. ఉపాధ్యాయుల్ని బయటికి పంపి పాఠశాల గేటుకు తాళాలు వేసి నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా గలగల గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలను గొల్లపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విలీనం చేయడంతో స్థానికులు ఆందోళన చేశారు.
పేదలకు విద్యను దూరం చేయొద్దు : లోకేశ్ Lokesh Nara @naralokesh
జాతీయ విద్యావిధానం, పాఠశాలల విలీనంతో పేదపిల్లలకు ప్రభుత్వ విద్యను దూరం చేయొద్దని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు. ఇప్పటికే ఉపాధ్యాయుల కొరత, అరకొర సౌకర్యాలతో ప్రభుత్వ విద్యాలయాలు కునారిల్లుతుంటే, పాఠశాల విలీన నిర్ణయం మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా తయారైందని విమర్శించారు. పాఠశాలల ప్రారంభం రోజునే లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సీఎం నిర్ణయం శరాఘాతమయ్యిందని పేర్కొన్నారు. మూసేసిన స్కూళ్లు తక్షణమే తిరిగి ప్రారంభించాలని కోరుతున్నాను. పేదపిల్లలకి ప్రభుత్వ విద్యని దూరం చేసే ఈ నిరంకుశ నిర్ణయాలని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు,