కొత్త జిల్లాలు ప్రారంభమై నెల రోజులు అయ్యింది. కొన్ని జిల్లాల్లో విధులు ప్రారంభమయ్యాయి కానీ ఇంకా కొన్ని జిల్లాల్లో మాత్రం సరైన కార్యాలయాలు ఏర్పాటు కూడా కాలేదు..కొత్త జిల్లాలు ఏర్పడ్డాక మొదటి రోజు కింద కూర్చొనో వరండాలో, చెట్ల కిందో కూర్చుని అధికారులు పనులు చేశారు. చాలా చోట్ల సౌకర్యాలు కానీ, సిబ్బంది కానీ ఇంకా పూర్తి స్థాయిలో లేరు. కొత్త జిల్లాల్లో పాలన వ్యవస్థ తీరుతెన్నులపై ఒక సమగ్ర సమీక్ష…
అనంతపురాన్ని విభజించి పుట్టపర్తి కేందంగా శ్రీ సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేశారు. ఐతే ఇక్కడ సరైన భవనాలు, ఫర్నిచర్, నెట్ కనెక్షన్లు లేని కారణంగా ఇక్కడి పాలనను ఒకరో ఇద్దరో చూస్తున్నారు. ఐతే ఉద్యోగుల కోసం పుట్టపర్తిలోని దీనజనోద్ధరణ భవనంలో ఏర్పాటు చేసిన కార్యాలయాలు చాలా ఇరుకుగా ఉండడంతో ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. అసలే ఎండాకాలం…మండుతున్న ఎండలకు తోడు ఇరుకు గదుల్లో పని చేయడం నిజంగా కత్తి మీద సామే..
ఎన్టీఆర్, కృష్ణాజిల్లాకు కలిపి ఒకే డీపీవో పని చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో విద్యాశాఖ, ప్రణాళిక, సర్వే అండ్ ల్యాండ్స్ కార్యాలయాలు ఇంకా కొలువుదీరలేదు. కృష్ణాజిల్లా ఏర్పడేసరికి ప్రభుత్వ కార్యాలయాలన్నీ మచిలీపట్నానికే తరలివస్తాయని అనుకున్నారంతా .. ఉద్యోగుల విభజనపై స్పష్టమైన ఆదేశాలు లేకపోయే సరికి జిల్లాస్థాయి అధికారులు విజయవాడను వదిలి రావడం లేదు. అనకాపల్లిలోని ఉద్యోగులకు పూర్తిస్థాయిలో వసతులు కల్పించలేదు. కలెక్టర్ కార్యాలయంలో పరిపాలన ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కార్యాలయాలు ప్రారంభం కాలేదు. జిల్లా స్థాయి కార్యాలయాలు ఏవీ కూడా సిద్ధం కాలేదు. అధికారులను, సిబ్బందిని కూడా పూర్తిస్థాయిలో నియమించలేదు. జేసీ ధనుంజయ్‌ను రంపచోడవరం ఐటీడీఏ ఇన్‌చార్జి పీవోగా నియమించేసరికి ఇక్కడి ప్రజలకు ఆయన సేవలు అందడం లేదు.
పల్నాడు జిల్లాను ప్రారంభించినా జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో కార్యాలయాలను ఏర్పాటు చేశారు కానీ అధికారులు, ఉద్యోగులు ఇంకా గుంటూరు నుంచే విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్య కార్యాలయాలకు రాజీవ్ స్వగృహ భవనాలను కేటాయించారు కానీ సరైన వసతులైతే లేవు. బాపట్ల జిల్లా కేంద్రంలో కార్యాలయాలకు చేయాల్సిన మరమ్మతుల పనులు పూర్తి కాలేదు. ఆయా శాఖలకు నిబంధనల ప్రకారం సిబ్బందిని కేటాయించకపోయేసరికి ప్రజలు, ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పరిస్థితి చెప్పక్కర్లేదు.. సుమారు 73 కార్యాలయాలకు ప్రభుత్వం రూ.11.69 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కానీ ఆ నిధులు మాత్రం పూర్తి స్థాయిలో విడుదలకాలేదు. పార్వతీపురం మన్యం జిల్లా పరిస్థితి కూడా అంతే..‘స్పందన’ కార్యక్రమం కోసం వచ్చే ప్రజలకు తాగునీటి సదుపాయం కల్పించలేని దుస్థితి. పరిస్థితులను చక్కదిద్ది తమ మధ్య ఎలాంటి సమన్వయ లోపం లేకుండా చూడాలని ప్రజలు, అధికారులు కోరుతున్నారు..