రాష్ట్ర ప్రభుత్వం అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి. కొనసీమకు డా.బి.ఆర్. అంబేద్కర్ పేరును కొనసాగించాలి. అమలాపురం హింసాకాండపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలి. కాకినాడ సుబ్రమణ్యం కేసు ను సి.బి.ఐ కి అప్పగించాలి. ఎం.ఎల్.సి అనంత బాబును బర్తరఫ్ చేయాలి. రాష్ట్రంలో జరుగుతున్న పలు సంఘటనలపై విజయవాడ రాజ్ భవన్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ను కలిసి వినతి పత్రం అందించారు. .
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి విధ్వంసాలు, దాడులు, అవినీతి, అరాచకాలు పూటపూటకి పెచ్చుమీరుతున్నాయి. మహిళలపై అఘాయిత్యాలు హద్దు మీరి వాడవాడలా పెచ్చురిల్లుతున్నాయి. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణిస్తున్నాయి. హుందాగా పనిచేసుకునే పోలీస్వ్య వస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. సంక్షేమం ముసుగులో సంక్షోభం సృష్టిస్తున్నారు. స్కీముల పేరుతో స్కాములు చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో అనావృష్టి కారకులయ్యారు. సామాజిక న్యాయం పేరుతో అన్ని వర్గాలను డమ్మీ వర్గాలుగా మార్చేశారు. ఆర్థిక పదవులు సొంత వర్గానికి ఇచ్చి, కుర్చీలు, బల్లలు, ఖజానాలేని పదవులు మిగిలిన వర్గాలవారికి ఇచ్చారు. మితిమీరిన, హద్దు అదుపులేని,విచ్చలవిడి అప్పులు చేసి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని అగమ్య గోచరంగా మార్చేశారు. అన్నపూర్ణల్లాంటి ఆంధ్రప్రదేశ్ ను అన్ధకారప్రదేశ్ గా మార్చేశారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ ల పై దాడులు, హత్యలు, హత్యాచారాలు జరుగుతున్నా పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది.ఇటీవల జరిగిన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎంఎల్సీ అనంతబాబు పాత్రతో పాటు, ప్రశాంతంగా ఉండే పచ్చని కోన సీమ జిల్లాలో అసాంఘిక శక్తుల అరాచకాలు ఈ రాష్ట్రంలో పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంత బాబు దర్యాప్తు సమగ్రంగా లేనందున ఈ కేస్ ను సి.బి.ఐ కి అప్పజెప్పి విచారణ చేయించాలని, తక్షణమే అనంత బాబును ఎమ్.ఎల్.సి గా బర్తరఫ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటి డిమాండ్ చేస్తోంది.