ఆధాత్మిక నగరమైన హిందూవుల కలియుగ దైవంగా ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం కొలువుదీరిన తిరుమల-తిరుపతి నగరం హిందూవులకు అత్యంత పవిత్రం. తిరుమల దర్శనం కోసం విభిన్న ప్రాంతాల్నించి వచ్చే అశేష భక్తజనంలో మెజార్టీ రైల్వే మార్గం ద్వారానే వస్తుంటారు. రోజూ వేలాది మంది భక్తులతో తిరుపతి రైల్వేస్టేషన్ ఎప్పుడూ కిటకిటలాడుతుంటుంది. స్టేషన్ మాత్రం 25 ఏళ్లుగా అలాగే ఉంది. అత్యంత ప్రాముఖ్యత కలిగిన రైల్వే స్టేషన్లో ఒకటిగా ఏ1 గ్రేడ్ జాబితాలో స్వచ్ఛ స్టేషన్‌గా జాతీయ స్థాయిలో తిరుపతి స్టేషన్ మూడో స్థానాన్ని దక్కించుకుంది. కానీ ఈ స్టేషన్ పూర్తిస్థాయిలో అభివృద్ధికి నోచుకోవడం లేదు.
తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నా.. అందుకు తగినట్లుగా తిరుపతి స్టేషన్‌లో ప్లాట్ ఫాంల సంఖ్య లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సకాలంలో రైళ్లు చేరుకున్నా నిలిపేందుకు ఖాళీ లేక గంటల తరబడి రేణిగుంట జంక్షన్‌లోనే ఆపేస్తున్నారు.
దేశవిదేశాల నుంచి పెద్దఎత్తున భక్తులు ప్రయాణాలు చేస్తుండటంతో..తిరుపతి రైల్వే స్టేషన్‌ను ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్‌గా తీర్చిదిద్దేందుకు రైల్వేశాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించి డిజైన్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. వివిధ పనుల్ని వేర్వేరు కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. దీనికి సంబంధించి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తిరుపతి వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ డిజైన్ ఫోటోల్ని ట్విట్టర్‌లో విడుదల చేశారు. అద్భుతమైన రాజమహల్ తలపిస్తూ..ఠీవిగా కన్పిస్తోంది. దేశంలో ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్లుగా తొలిదశలో అభివృద్ధి చేస్తున్న 14 రైల్వే స్టేషన్లలో తిరుపతి ఒకటి. ఈ 14 రైల్వే స్టేషన్లను 5 వేల కోట్లతో అభివృద్ధి చేయనున్నారు.
భారతీయ రైల్వే తిరుపతి రైల్వే స్టేషన్‌ను వాల్డ్ క్లాస్ హబ్‌గా మారుస్తామని 2019 సెప్టెంబర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. 2023 నాటికి తిరుపతి రైల్వే స్టేషన్‌ను సుందరంగా తీర్చిదిద్దుతామని భారతీయ రైల్వే ప్రకటించింది. కానీ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పనుల్లో జాప్యం జరిగింది. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గిపోవడంతో మళ్లీ కదలిక వచ్చింది.
300 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బాలాజీ ఆలయానికి చేరుకోవడానికి తిరుపతి రైల్వే స్టేషన్ ద్వారా లక్షల సంఖ్యలో ఏటా భక్తులు ప్రయాణిస్తుంటారు అందువల్ల తిరుపతి రైల్వేస్టేషన్ అంతర్జాతీయ ప్రమాణలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలి అని ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నా ఆ దిశగా అడుగులు పడలేదు.
తిరుపతి రైల్వే స్టేషన్‌ను 299 కోట్ల రూపాయలతో “మేజర్ అప్‌గ్రేడేషన్ ఆఫ్ తిరుపతి” పేరుతో తిరుపతి స్టేషన్‌ను పునరాభివృద్ధి చేయాలని రైల్వే బోర్డు దక్షిణ మధ్య రైల్వేను ఆదేశించింది. దీని ప్రకారం దక్షిణ మధ్య రైల్వే ఒక మాస్టర్ ప్లాన్‌ను రూపొందించింది. ఇందులో భాగంగా బేస్మెంట్, గ్రౌండ్ +3 అంతస్తులతో దక్షిణం వైపు స్టేషన్ భవనం అభివృద్ధి, ఉత్తరం వైపు గ్రౌండ్ +3 అంతస్తులలో స్టేషన్ భవనం అభివృద్ధి. స్టేషన్ భవనానికి ఉత్తరం, దక్షిణం వైపులను కలుపుతూ 35 మీటర్ల వెడల్పుతో 2 ఎయిర్ కోర్సుల నిర్మాణం. దీంతో పాటుగా ఇప్పటికే ఉన్న స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌లను మెరుగుపరచడం, దక్షిణ భాగంలోని భవనంలో, బేస్‌మెంట్‌లో పార్కింగ్ సదుపాయం, డిపార్చర్ కన్‌కోర్స్, అరైవల్ కన్‌కోర్స్, టికెట్ కౌంటర్, గ్రౌండ్ ఫ్లోర్‌లో వెయిటింగ్ లాంజ్, కామన్ వెయిటింగ్ హాల్ ఏరియా, ఫిమేల్ వెయిటింగ్ ఏరియా, ఫుడ్ కోర్ట్, టాయిలెట్స్, క్లోక్ రూమ్, మొదటి, రెండవ అంతస్తులలో రైల్వే కార్యాలయాలు మరియు మూడవ అంతస్తులో విశ్రాంతి గదులు ఉన్నాయి.. ఉత్తరం భాగంలోని భవనంలో డిపార్చర్ కన్‌కోర్స్, అరైవల్ కన్‌కోర్స్, గ్రౌండ్ ఫ్లోర్‌లో టికెట్ కౌంటర్ వెయిటింగ్ లాంజ్, కామన్ వెయిటింగ్ హాల్ ఏరియా, వీఐపీ లాంజ్, టాయిలెట్స్, మొదటి అంతస్తులో క్లోక్ రూమ్, వెయిటింగ్ హాల్, షాపులు, కియోస్క్‌సిన్ సెకండ్ ఫ్లోర్, మూడో అంతస్తులో రైల్వే ఆఫీసులు. వెయిటింగ్ హాల్, దుకాణాలు, ఫుడ్ కోర్ట్, ఎయిర్‌కోర్స్‌లో బెంచీలు.
మొత్తంగా 23 లిఫ్ట్‌లు, 20 ఎస్కలేటర్‌లు, ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే సిస్టమ్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, సీసీటీవీ కెమెరాలు, కోచ్ ఇండికేషన్ బోర్డులు, ప్రయాణీకుల అవసరాలను తీర్చడానికి రైలు సూచిక బోర్డులతో తిరుపతి రైల్వేస్టేషన్ అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్త హంగులతో రూపుదిద్దుకోనుందని తిరుపతి.
తిరుపతి రైల్వేస్టేషన్ కొత్త డిజైన్‌లపై అభ్యంతరాలు
తిరుపతి రైల్వేస్టేషన్ డిజైన్‌కు సంబంధించి నాలుగు ఫోటోలను కేంద్రమంత్రి విడుదల చేసిన గ్రాఫిక్స్ చూసి చాలా మంది ఆసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేంద్రమంత్రి విడుదల చేసిన ట్విట్‌కుక .. రీట్విట్ చేస్తూ పలు కామెంట్లు చేస్తున్నారు. సౌకర్యాల కల్పిస్తారేమో లేదో కాని పైన పేర్కొన్న డిజైన్ మాత్రం తిరుపతి పుణ్యక్షేత్రాన్ని ప్రతిబింబించేలా లేదని.. ఓ సాదా సీదా భవనంలా ఉంది అంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఓ ఐటి కంపెనీ భవనంలా ఉందంటూ పేర్కొంటున్నారు. ముఖ్యంగా తిరుమల శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వరస్వామిని గుర్తు తెచ్చేలా డిజైన్ ఉండాలని సూచనలు చేస్తున్నారు.
కేంద్రమంత్రి అశ్వనీ వైష్టవ్ ట్విట్‌కు దర్శకుడు నాగ్ అశ్వీన్ కూడా ట్వీట్ చేసి పలు సూచనలు చేశారు. మీ వ్యాఖ్యలను చూడండి. దీన్ని ఎవరూ ఇష్టపడరు…డిజైన్ కొంత జెనరిక్ వెస్ట్రన్ కాపి, కొంత బ్యాడ్ ఐటి ప్కార్‌లాగా ఉంది. తిరుపతి పవిత్రమైంది. ఆధ్యాత్మిక నగరం.. భారత దేశం గొప్ప వాస్తు శిల్పాన్ని అర్థం చేసుకున్న వారిలో దీనిని రూపొందించడానికి ప్రయత్నించండి… గాజు, స్టీల్ కాపీలు వద్దు, అంటూ నాగ్ అశ్వీన్ ట్విట్ చేశారు.
తిరుపతి వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌కు సంబంధించిన డిజైన్లపై తిరుపతి వాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఎంపీ మద్దిల గురుమూర్తికి తమ అభ్యంతరాలను వెల్లడించారు. రైల్వే మంత్రి ప్రకటనపై గురుమూర్తి స్పందించారు. తిరుపతి రైల్వే స్టేషన్ నూతన డిజైన్లపై తిరుపతి వాసుల అభ్యంతరాలను రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు గురుమూర్తి ట్విట్టర్ వేదికగా తెలిపారు.