ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యామ్నయ రాజకీయ పార్టీగా ప్రజా విశ్వాసాన్ని పొందాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపునిచ్చారు. బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ ప్రజాహితం – సుపరిపాలన లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్న తరుణంలో ప్రతిపక్షాలు కుట్ర పూరితంగా దుష్ప్రచారం చేస్తున్నారని, దీనిని ఎండగడుతూ పార్టీ శ్రేణులు, బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని విస్తృతంగా ప్రచారం చేసి, రాష్ట్రంలో పార్టీని పటిష్టంచేసి ప్రత్యామ్నయ రాజకీయ పార్టీగా ప్రజా విశ్వాసాన్ని పొందాలని కోరారు.
యువత మద్దతు పొందాలి
యువ ఓటర్లకు పార్టీ శ్రేణులు చేరువ కావడానికి వివిధ కార్యక్రమాలను రూపొందించి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమర్థపాలన, మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియా, స్టార్టప్ సంస్థలకు ప్రోత్సాహం,నూతన విద్యావిధానం, స్వయం ఉపాధి శిక్షణా కార్యక్రమాలను వివరించి, వారు బీజేపీకి మద్దతు పొందాలని దీనిపై భారతీయ జనతా యువమోర్ఛా ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని పటిష్టం చేయాలి… ప్రజా విశ్వాసాన్ని పొందాలి
అన్ని అసెంబ్లీ నియోజకవర్గస్థాయిల్లో ప్రతి ముఖ్య నాయకుడు భాధ్యత స్వీకరించి, పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీని పటిష్టం చేయడానికి అవసరమైన అన్ని కార్యక్రమాలు చేపట్టి, ప్రజా విశ్వాసాన్ని పొందడం ద్వారా, నియోజకర్గస్థాయిలో పార్టీని పటిష్టం చేయడానికి కృషి చేయాలని కోరారు. హైదరాబాద్ లో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను వివరించారు.