పేద ముస్లిం యువతుల వివాహాలకు ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన దుల్హన్ పథకం అధికారుల నిర్లక్ష్యంతో విమర్శల పాలవుతోంది. అర్జీలు చేయడంలోనే ఆటంకాలు ఎదురవుతుండటంతో అర్హులకు ఈ పథకం ఫలాలు అందడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో, జిల్లాలో రెండు వందల మందికి పైగా పెళ్ళైన పేద ముస్లిం జంటలు ఈ పథకంలో లబ్ధిపొందకుండా, ఇబ్బందులు పడుతున్నారు. ఈ నగదు అందితే కొంత వరకూ ఇబ్బందులు నుంచి ఉపశమనం పొందవచ్చన్న ఆశ ఆడియాశలుగానే మిగిలి పోతున్నాయి.
పేద ముస్లిం యువతులకు వివాహానికి రూ. 50 వేలు ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం దుల్హన్ పథకాన్ని ప్రారంభించింది. వివాహం జరిగిన రెండు నెలల్లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. వధూవరుల ఆధార్‌కార్డులు, వివాహ ధ్రువీకరణ పత్రం, వధువు బ్యాంకు ఖాతా వంటి వాటిని ఆన్‌లైన్‌లో ఆప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. తాజాగా దుల్హన్” పథకాన్ని నిలిపివేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
నిరుపేద ముస్లిం మైనారిటీ యువతులకు వివాహ సందర్భంగా ఆర్థిక సహాయం అందించేందుకు ఉద్దేశించిన దుల్హన్ పథకాన్ని నిలిపివేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ పథకం అమలులో లేదని పేర్కొంది. తెదేపా ప్రభుత్వం హయాంలో దుల్హన్ పథకం కింద పేద ముస్లిం మహిళల వివాహానికి రూ.50 వేలు అందజేసింది.వైకాపా అధికారంలోకి వస్తే మైనారిటీలకు అన్ని విధాలా అండగా ఉంటామని… దుల్హన్ పథకం కింద యువతులకు రూ.లక్ష ఇస్తామని ప్రజాసంకల్ప యాత్రలో జగన్ హామీ ఇచ్చారని, ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటుతో ఆర్థికంగా తోడుంటామని భరోసా ఇచ్చారని, కానీ.. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్థిక సాయం పెంపు లేకపోగా ఎవరికీ ఎలాంటి సాయం అందించలేదని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు షారూఖ్‌షిబ్లి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ.. షారూఖ్‌షిబ్లి హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు.
దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా ధర్మాసనం విచారణ జరిపింది. మైనారిటీలు ఎదురుచూస్తున్న దుల్హన్ పథకం ద్వారా లబ్ధిదారులకు ఊరట కల్పించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది.. ఆర్థిక ఇబ్బందుల వల్లే ప్రభుత్వం ఈ పథకం అమలు చేయలేకపోతోందని తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం.. అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది.