పెంచిన పాల రేట్లు వెంటనే తగ్గించాలని కృష్ణాజిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ ఆంజనేయులుకు సీఐటీయూ అధ్వర్యంలో ఐద్వా, వామపక్షాల నాయకులు వినతి ప్రతం అందజేశారు. అనంతరం పాల ఫ్యాక్టరీ వద్ద మహిళా కార్మిక సంఘాలు ఆందోళన నిర్వహించారు. పెంచిన పాల ధర తగ్గించాని పక్షంలో భవిష్యత్తు ఆందోళన తీవ్రతరం చేస్తామని ఐద్వా జిల్లా కార్యదర్శి ఎం.శ్రీదేవి బి.సత్యబాబు హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ధరల భారాలు తో సతమతమవుతున్న సామాన్య ప్రజలపై పాలధరల పెంపు గోరుచుట్టు పై రోకలి కోట్ల ఉందని తెలిపారు. ఫిబ్రవరిలో అన్ని రకాల పాల ధర పెంపుదల చేసి నాలుగు నెలలోపు లీటరుకు 2 రూపాయలు చొప్పున విడుదల చేయడం అన్యాయమన్నారు. పౌష్టికాహారం లోపంతో గర్భిణులు, పసిపిల్లలు మరణాలు పెరుగుతున్న భయంకరమైన పరిస్థితుల్లో పాల ధర పెంపు వల్ల పేదలకు పౌష్టికాహారం దూరంచేసే విధానమన్నారు. ప్రజలకు అవసరం లేని మద్యం ధరలు తగ్గిస్తూ పసిపిల్లల నుండి అందరికీ అవసరమైన పాల ధరలను పెంచడం వంటి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం నివారించాలని కోరారు. పాడి రైతులకు పాల వినియోగదారులకు నష్టం లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు కాకుండా సహకార సంఘాలకు చేయూతనివ్వాలని డిమాండ్ చేశాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, నిత్యావసర సరకుల ధరలు పెంచకూడదని చెప్పి, ఇప్పుడు పాల ధరలు పెంచడం ఎంతవరకు సమంజసమని సిహెచ్. బాబూరావు అన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండి, సహకార సంఘాలు నిర్వహించే సంస్థల్లోనే ధరలు పెరిగితే ప్రైవేటు సంస్థలు ఎలా అదుపులో ఉంటాయని పేర్కొన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్పప్పుడు ఆదుకోవాల్సిన ప్రభుత్వమే ఇలా చేయడం సరికాదన్నారు. విజయ పాల ధరలు పెంచడం దుర్మార్గమని సీపీఎం నాయకులు దోనేపూడి కాశీనాథ్ పేర్కొన్నారు. ప్రజలు కరోనా ప్రభావానికి గురై ఆర్థికంగా, ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఇలాంటి సంక్షోభ సమయంలో అండగా ఉండాల్సిన సహకార సంస్థలు ధరలు పెంచుతూ వారిపై భారం మోపడం సరైంది కాదని పేర్కొన్నారు. ఆరోగ్య సంక్షోభ సమయంలో ప్రజల ఆరోగ్యం కన్నా లాభాలను మిన్నగా భావించడం గర్హనీయమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పెంచిన పాల ధరను ఉపసంహరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.