దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజువారీ కేసులు ఒక్కసారిగా 4 వేలను దాటడం కలవర పెడుతోంది . దేశవ్యాప్తంగా గురువారం 4 లక్షల 25 వేల 379 కరోనా నిర్ధారణా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 4వ వేల 41 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 2 వేల 363 మంది కోలుకోగా… ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 4 కోట్ల 26 లక్షల 22 వేల 757 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 21 వేల 177 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గురువారం కరోనా వల్ల 10 మంది మృతి చెందారు.దీంతొ దేశ వ్యాప్తంగా 5 లక్షల 24 వేల 651 మంది మృతి చెందారు. రోజువారీ కేసులు ఒక్కసారిగా 4 వేలను దాటడంతో ప్రజలు అప్రమత్తంగా వుండాలని కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేస్తోంది. బయటకు వెళ్లినప్పుడు తప్పకుండా మాస్క్ ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, చేతులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవాలని సూచిస్తోంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రారంభించిన జాతీయ స్థాయి టీకా కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. గురువారం 12 లక్షల 5 వేల 840 మందికి టీకాను అందించారు.దీంతో ఇప్పటి వరకు టీకా తీసుకున్న వారి సంఖ్య 193 కోట్ల 83 లక్షల 72 వేల 365 కి చేరింది.
కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే టీకా తీసుకోవడం కూడా ఒక ఉత్తమమైన మార్గమని,కనుక ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేస్తోంది. టీకా తీసుకోని వారికి టీకా పట్ల అవగహన కల్పించి వారు కూడా టీకా తీసుకునేలా ప్రతిపౌరుడు కృషి చేయాలని పిలుపునిస్తోంది.