తెలంగాణకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో సాధారణం కన్నా 60 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు ప్రకటించింది. వరుసగా మూడో రోజు తెలంగాణను వర్షం ముంచెత్తింది. ఎడతెరిపి లేకుండా వాన కురవడంతో వాగులు వంకలు పొంగిపొర్లాయి. జనమంతా ఇళ్లకే పరిమితమయ్యారు. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం ఆదివారం దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రా తీర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వెల్లడించింది. ఇక నిన్న ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, నిజామాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో సగటున 11.5 నుంచి 20.4 సెంటీమీటర్ల వర్షం పడింది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నేటి నుంచి కూడా ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో సాధారణం కన్నా 60 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు ప్రకటించింది.
తెలంగాణకు భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ రానున్న మూడు రోజులూ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అంచనా వేస్తోంది. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాలు పరిసర ప్రాంతాల్లో ఏకంగా 61 సెంటీమీటర్ల మేర వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని లెక్కకట్టింది. దాదాపు ఎక్కువ ప్రాంతాల్లో 35 సెంటీమీటర్ల దాటి వర్షపాతం నమోదయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
రాష్ట్రంలో పలుచోట్ల వాగులు పొంగడంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాంతంలో జులై నెలలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు ఏకంగా 35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 61 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.