తిరుపతి సమీపంలోని పాత కాల్వ వద్ద పేరూరు బండపై నూతనంగా నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయంలో జూన్ 23వ తేదీన మహా సంప్రోక్షణ నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో శ్రీ ఏవి. ధర్మారెడ్డి పేర్కొన్నారు. పాత కాల్వ వద్ద పేరూరు బండపై ఉన్న శ్రీ వకుళమాత ఆలయాన్ని ఈవో అధికారులతో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి మాతృమూర్తి అయిన శ్రీ వకుళమాత ఆలయం ప్రాచీన కాలం నుండి పాత కాల్వ వద్ద పేరూరు బండపై ఉన్నట్లు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తుందన్నారు. రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అమ్మవారి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారని చెప్పారు. టీటీడీ లోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మరోమారు రాష్ట్ర మంత్రివర్యులతో కలిసి ఆలయంలో జరుగుతున్న పనులను పరిశీలించనున్నట్లు తెలిపారు.అనంతరం తిరుపతి శ్రీ పద్మావతి అతిథి భవనంలో జెఈవో శ్రీ వీరబ్రహ్మం శ్రీ వకుళమాత ఆలయ నిర్మాణ పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
జూన్ 22 నుండి వస్త్రాల ఈ -వేలం
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన 149 లాట్ల వస్త్రాలను జూన్ 22 నుండి 24వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ-వేలం వేయనున్నారు. ఇందులో పాలిస్టర్ నైలాన్ / నైలెక్స్ చీరలు, ఆర్ట్ సిల్క్ చీరలు, బ్లౌజ్‌పీస్‌లు కొత్తవి, వినియోగించిన వస్త్రాలున్నాయి. ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరును కార్యాలయం వేళల్లో గానీ, రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in / www.tirumala.org వెబ్‌సైట్‌ను గానీ సంప్రదించగలరు.