వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే.. సుందరానికీ’. ఈ చిత్రంలో నాని, నజ్రియా జంటగా నటించారు.దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. నరేశ్, నదియా, హర్షవర్ధన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం విశాఖపట్నంలో చిత్ర ట్రైలర్ విడుదల చేశారు.
ఈ సినిమాలో సుందర్ ప్రసాద్ అనే బ్రాహ్మణ యువకుడిగా నాని.. లీలా థామస్ అనే క్రిస్టియన్ యువతిగా నజ్రియా నటించారు. ఏడు సముద్రాలు దాటి యూఎస్‌లో దిగాలనేది సుందర్ కోరిక. అలాగే లీలాకి ఓ కల ఉంటుంది. మరి వీళ్లిద్దరి పరిచయం.. ప్రేమగా ఎలా మారింది? వీరి ప్రేమకు, కలలకు వారి కుటుంబాల నుంచి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? అన్నది ట్రైలర్‌లో వినోదాత్మకంగా చూపించారు. సుందర్ అనే సంప్రదాయ బ్రాహ్మణ కుర్రాడిగా నాని చెప్పిన సంభాషణలు, పలికించిన హావభావాలు నవ్వులు పూయించేలా సాగాయి.
మరి ఈ విభిన్నమైన ప్రేమకథ ఏ కంచికి చేరింది? ప్రేక్షకుల్ని ఏ స్థాయిలో నవ్వించనుంది? తెలియాలంటే జూన్ 10 వరకు వేచి చూడక తప్పదు. ఈ చిత్రానికి కూర్పు: రవితేజ గిరిజాల, ఛాయాగ్రహణం నికేత్ బొమ్మి,వివేక్ సాగర్ సంగీతం అందించారు.