విజయవాడలో కీలక నేత వంగవీటి రాధాకృష్ణ, వంగవీటి మోహన రంగా కుమారుడు,.. జనసేన పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ సమక్ష్యంలో వంగవీటి రాధా జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయాన్ని అటు వంగవీటి రాధా వర్గంగానీ, జనసేన వర్గాలు గానీ అధికారికంగా ప్రకటించలేదు. జులై 4న వంగవీటి రంగా 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని వంగవీటి రంగా ఏర్పాట్లు చేస్తున్నారు… నిర్వహించనున్నారు. జులై 4న విజయవాడలో జరిగే కార్యక్రమంలో వంగవీటి రాధా జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో విజయవాడలో రంగా విగ్రహానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూలమాల వేసి నివాళి అర్పించనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అనంతరం పవన్ కళ్యాణ్.. అక్కడ నుంచి వంగవీటి రాధా నివాసానికి వెళ్లనున్నట్లు సమాచారం.
కొన్ని రోజుల కిందట పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా వంగవీటి యువసేన పేరుతో ఉన్న బ్యానర్లు విజయవాడలో దర్శనమిచ్చాయి. నాటి నుంచి వంగవీటి రాధా త్వరలోనే జనసేనలో చేరబోతున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. కృష్ణా జిల్లాలో.. ప్రధానంగా విజయవాడ రాజకీయాల్లో వంగవీటి కుటుంబం ముద్ర బలంగా ఉంది. కాపు సామాజిక వర్గంలో వంగవీటి రంగాకు అనుచరగణం ఎక్కువగా ఉంది. పదవిలో ఉన్నా, లేకున్నా దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో రంగా కుటుంబం రాజకీయాల్లో చక్రం తిప్పుతోంది. గతంలో చంద్రబాబు నాయుడు సమక్షంలో వంగవీటి రాధా టీడీపీలో చేరారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపన సమయంలో చిరంజీవితోనూ సన్నిహితంగా ఉన్నారు. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల వేళ వైఎస్సార్‌సీపీ నుంచి ఆయనకు టిక్కెట్ దక్కలేదు. విజయవాడ సెంట్రల్ స్థానాన్ని మల్లాది విష్ణుకి ఇచ్చారు. వంగవీటి రాధా విజయవాడ తూర్పు సెగ్మెంట్ నుంచి బరిలోకి దిగుతారని ప్రచారం జరిగినా.. అది వార్తల వరకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో వంగవీటి రాధా కొంత కాలంగా వైఎస్సార్‌సీపీకి దూరంగా ఉంటున్నారు. ఒక దశలో టీడీపీలో చేరబోతున్నారంటూ ప్రచారం జరిగింది. తాజాగా ఆయన జనసేనలో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే.. విజయవాడ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది!