తెలంగాణ సీఎం కేసీఆర్, చంద్రబాబు పై ఓ కొత్త చర్చ మొదలైంది. వారి చేతికి కొత్త ఉంగరం కనిపిస్తోంది అంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చించుకుంటున్నారు. వాస్తవానికి ఈ చర్చ చంద్రబాబు నుంచి మొదలైంది. ఇటీవల చంద్రబాబు ఓ ఉంగరాన్ని ధరించారని, అది స్మార్ట్ అంగుళీకమంటూ కొందరు ప్రచారం చేశారు. ఇప్పుడు కేసీఆర్ వేలికి కూడా ఇన్నాళ్లు కనిపించని ఉంగరం కనిపిస్తుందని అంటున్నారు. గతంలో చేతికి ఎర్ర స్టోన్ ఉన్న ఉంగరం ధరించిన కేసీఆర్ ఇప్పుడు గ్రీన్ కలర్ స్టోన్ తో కూడిన అంగుళీకాన్ని ధరించారు. అయితే కేసీఆర్ ఆ ఉంగరం ఎందుకు ధరించారు..? దాని వెనుక ఉన్న రహస్యమేంటి..?
ప్రస్తుతం కేసీఆర్ చేతికి గ్రీన్ స్టోన్ కలిగిన ఉంగరం ఉంది. సాధారణంగా పదోన్నతి కోసం దీనిని ధరిస్తారని కొందరు జ్యోతిష్యులు పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు చూస్తున్న విషయం తెలిసిందే. అందుకే ఈ ఉంగరాన్ని ధరించారని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. గతంలో రెడ్ స్టోన్ కలిగిన ఉంగరాన్ని కేసీఆర్ ధరించారు. రెడ్ స్టోన్ ఆరోగ్యరీత్యా బాగుండాలని ధరిస్తారట. అయితే ఆ సమయంలో కేసీఆర్ ఆరోగ్యం కోసం రెడ్ స్టోన్ ధరించారని, ఇప్పుడు పదోన్నతి కోసం గ్రీన్ స్టోన్ కలిగిన అంగుళీకాన్ని వేసుకున్నారని అంటున్నారు.
ఇదిలా ఉండగా చంద్రబాబు వేలికున్న ఉంగరంపై తెగ చర్చ పెట్టిన కొన్ని మీడియా సంస్థలు ఇప్పుడు కేసీఆర్ చేతికి ఉన్న వేలి ఉంగరంపై ఎలాంటి ప్రచారం చేయడం లేదని అంటున్నారు. అయితే చంద్రబాబు చేతికి ఉన్న ఉంగరం సాంకేతికతో కూడుకున్నదని, కేసీఆర్ చేతికి ఉన్న ఉంగరం జాతకం ప్రకారంగా వేసుకున్నదని అంటున్నారు. టెక్నాలజీ ఎక్కువగా తెలిసిన బాబు ఆ ఉంగరాన్ని వాడుతున్నారని అంటున్నారు. ఆధ్యాత్మిక భావాలున్న కేసీఆర్ ఇలాంటి ఉంగరాన్ని ధరించారని అంటున్నారు. అయితే ఈ ఇద్దరివి వేర్వేరు ఉంగరాలైనా వారి భవిష్యత్ పై మాత్రం ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకుంటున్నారని అనుకుంటున్నారు.
చంద్రబాబు రింగ్‌పై సీఎం జగన్ స్పందన
చంద్రబాబు రింగుపై సీఎం జగన్ సెటైర్లు వేశారు. రింగ్‌లో చిప్ ఉందని చంద్రబాబు చెబుతున్నారు. చిప్ వేళ్లకి, మోకాళ్లకు, అరికాళ్లకు ఉంటే లాభం ఉండదు. చిప్ ఉండాల్సింది మెదడులోనూ, గుండెలోనూ అంటూ చురకలు అంటించారు.