ఏపీపీఎస్సీ తొలి జాబితాలో ఎంపికైన అభ్యర్థుల పేర్లు, డిజిటల్ మూల్యాంకనం వల్ల ఏర్పడిన అవకతవకల వల్ల తుది జాబితా వచ్చేసరికి చాలా మంది పేర్లు లేకపోవడం తమను తీవ్రంగా కలిచివేసిందని, తమకు న్యాయం చేయవలసినదిగా ఏపీపీఎస్సీ తొలి జాబితా సభ్యులు కే.శివ కుమార్, డి.చంద్రమోహన్, హరికిరణ్, కృష్ణమూర్తి, మనోహర్, విజయ్ ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. ఏపీపీఎస్సీ ఫలితాలలో తప్పెవరిదైనా దానికి శిక్ష మాత్రం తాము అనుభవిస్తున్నామని కన్నీరుమున్నీరయ్యారు. దయచేసి తమ దయనీయ స్థితిని ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ఏపీపీఎస్సీ తొలి జాబితా సబ్యులు ఉమామహేశ్వరనాయుడు, చంద్రమోహన్, అనురాధాలు మాట్లాడుతూ గతంలో ఏపీపీఎస్సీ నిర్వహించిన డిజిటల్ మూల్యాంకనం ద్వారా గ్రూప్ 1 ఇంటర్వ్యూ కి 326 మంది తొలి జాబితాలో ఎన్నికైనట్లు పేర్కొన్నారు. డిజిటల్ మూల్యాంకనం మీద ఏపీపీఎస్సీలో ఏర్పడిన అవకతవకల కారణంగా 326 మందిలో 202 మంది ని ఎంపిక చేయలేదని, తమ తప్పు లేకపోయినా తమ భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మముల్ని నమ్ముకున్న మా కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తాము పడ్డ శ్రమ వృధా అయినందుకు కన్నీటిపర్యంతమయ్యారు. తాము పడ్డ శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరయ్యింది, తమ తప్పు లేకపోయినా తమ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిపోయిందని కన్నీరుమున్నీరయ్యారు. దీనిపై భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలన్నారు. ఒక స్వతంత్ర సంస్థతో విచారణ జరిపి మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేయాలని ఏపీపీఎస్సీ వారిని విన్నవించడం జరిగింది.
అవకతవకలపై విచారణ జరపాలి : రామకృష్ణ
గ్రూప్-1 అభ్యర్థుల ఎంపికలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (Jaganmohan reddy)కి ఆయన లేఖ రాశారు. ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1లో భారీ కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. గ్రూప్-1లో అవకతవకల వల్ల ప్రజల్లో వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉందన్నారు. మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థుల పేపర్లను తిరిగి సమగ్ర మూల్యాంకనం జరిపి, అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.