వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 140 కొత్త బ్రాండ్స్ : నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో కొత్త మద్యం పాలసీకి రంగం సిద్ధమైంది. దీన్ని ఓ కొలిక్కి తెచ్చేందుకు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. మద్యపాన నిషేధం (Liquor Ban) పై ప్రభుత్వం దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్లుగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రైవేట్ మద్యం దుకాణాల స్థానంలో ప్రభుత్వమై వైన్ షాపులను తెరిచింది. అలాగే మద్యం షాపుల సంఖ్యను కూడా భారీగా తగ్గించింది. మద్యం వినియోగాన్ని తగ్గించేందుకు ధరలు పెంచింది. ఐతే దీనిపై వ్యతిరేకత రావడం, నాటుసారా, అక్రమ మద్యం అమ్మకాలు బాగా పెరిగిపోవడంతో ధరలు తగ్గించింది. తాజాగా కొత్త బార్ పాలసీపై సీఎం జగన్ సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది. ప్రస్తుతం 2017-22 మధ్య కాలానికి గత ప్రభుత్వం రూపొందించిన బార్ పాలసీ అమల్లో ఉంది. తాజాగా దీనిలో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతమున్న విధానం జూన్ తో ముగుస్తుండడంతో జూలై నుంచి కొత్త పాలసీ అమల్లోకి రానుంది. దీంతో కొత్త బార్ పాలసీపై జగన్ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్రంలో ప్రస్తుతం 840 బార్లు ఉన్నాయి. ఆ సంఖ్యను యథాతథంగా కొనసాగించనున్నారు. అయితే లైసెన్సు ఫీజులు మాత్రం భారీగా పెంచుతారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మూడు శ్లాబుల్లో 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.10 లక్షలు, 3 లక్షలలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.20 లక్షలు, 3 లక్షలకు పైగా ఉన్న ప్రాంతాల్లో రూ.30 లక్షలు ఫీజులుగా ఉన్నాయి.
వాటిని ఇప్పుడు వరుసగా రూ.20 లక్షలు, రూ.30 లక్షలు, రూ.50 లక్షలుగా చేయాలని కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఐటీ పరిధిలోకి రాకుండా లైసెన్సు ఫీజును తక్కువగా, నాన్ రిఫండబుల్ రిజిస్ర్టేషన్ చార్జ్‌ను భారీగా చూపిస్తున్నారు. దానిపై ఏడాదికి 10 శాతం పెంపు ఉంటుంది అంటే తర్వాత సంవత్సరాల్లో లైసెన్సు ఫీజులు ఇంకా పెరగనున్నాయి. కొత్త పాలసీకి నెల రోజులే సమయం ఉన్నందున వారం పది రోజుల్లో బార్ పాలసీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఎక్సైజ్ శాఖ సిద్ధమవుతోంది. అనంతరం దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, ఎంపిక విధానం ఉంటాయి. కాగా ఇప్పటివరకూ ఎప్పటికప్పుడు ప్రస్తుత బార్లను రెన్యువల్ చేసే విధానమే ఉండగా, ఇప్పుడు అన్ని బార్లకు కొత్తగా దరఖాస్తులు స్వీకరించబోతున్నారు. వాస్తవానికి వైసీపీ అధికారంలోకి రాగానే ప్రస్తుత బార్ యాజమాన్యాలను సాగనంపేందుకు ప్రయత్నాలు చేసింది. 2019 నవంబరులోనే కొత్త పాలసీకి శ్రీకారం చుట్టింది. కానీ తమకు 2022 వరకు గడువు ఉందంటూ బార్ల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వం చేసిన ప్రయత్నం అక్కడితో ఆగిపోయింది. ఇప్పుడు పాలసీ గడువు పూర్తిగా ముగిసిపోవడంతో కొత్త దరఖాస్తుల ద్వారా పూర్తిగా నూతన విధానం సిద్ధమవుతోంది.
రెన్యువల్ ఎన్నేళ్లు ?
ప్రస్తుత పాలసీకి ముందు ప్రతి రెండేళ్లకోసారి బార్ల లైసెన్సులను రెన్యువల్ చేసేవారు. గత పాలసీలో ఒకేసారి ఐదేళ్ల కాలానికి రెన్యువల్ చేశారు. ఇప్పుడు ఎన్నేళ్లకు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే హామీ ప్రకారం జగన్ ప్రభుత్వం మిగిలిన రెండేళ్లలో మద్యనిషేధం అమలుచేయాల్సి ఉంది. అంటే బార్ పాలసీ గడువు పూర్తిగా రెండేళ్లు కూడా ఉండదు. అలా కాకుండా ఒకేసారి ఐదేళ్లకు పాలసీ ప్రకటిస్తే నిషేధం మాటేంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి.
ఒకవేళ పాలసీ ఎన్నేళ్లు ప్రకటించినా మధ్యలో నిషేధించవచ్చని ప్రభుత్వం చెబితే.. కొత్త లైసెన్సీలు ధైర్యంగా ముందుకొచ్చే అవకాశం ఉండదు. షాప్ ఏర్పాటు చేసుకోవాల్సి వస్తే ఒకటిరెండు రోజుల్లో ఏదైనా దుకాణం అద్దెకు తీసుకుని ఏర్పాటుచేసుకోవచ్చు. కానీ బార్ అంటే.. మద్యంతో పాటు రెస్టారెంట్ ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కనీస విస్తీర్ణం, పార్కింగ్ సౌకర్యం ఉండాలి. అందుకే మద్యం వ్యాపారంలో బార్ అంటే దీర్ఘకాలిక వ్యాపారంగా చూస్తారు. అంత పెట్టుబడి పెట్టి ఒకట్రెండు ఏళ్లు మాత్రమే వ్యాపారం అంటే ఎవరూ ముందుకు రాకపోవచ్చు. దీంతో పేరుకు కొత్త పాలసీ అయినా ప్రస్తుత లైసెన్సీలే దాదాపుగా మళ్లీ వచ్చే అవకాశం ఉంది.
రాష్ట్రంలో కల్తీ సారా, నకిలీ మద్యం ఏరులై పారుతోందని.. ఇదేనా మద్యపాన నిషేధమని ప్రజలు, ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు. మద్యం అమ్మకాలు నియంత్రిస్తే రూ. 6500 కోట్లు ఉన్న ఆదాయం రూ.16500 ఎలా పెరిగిందో జగన్‌రెడ్డి చెప్పాలన్నారు. 2019 ప్రచారంలో భాగంగా ప్రతిపక్ష నేత జగ న్ మద్యపానాన్ని నిషేధిస్తామని గద్దెనెక్కి అదే మద్యంతో వ్యాపారం చేస్తూ కోట్లను దోచుకుం టున్నారన్నారు. రాష్ట్రంలో కల్తీసారా, నకిలీ మద్యంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే అధికార పార్టీ పాలకులు పట్టించుకోకపోగా, అవి సారా వల్ల కాదని, ఇతర ఆరోగ్య సమస్యలని చెప్పడం అన్యాయమన్నారు. మద్యం వ్యాపారమే లక్ష్యంగా పెట్టుకున్న వారికి ప్రజల ప్రాణాలపై బాధ్యత లేదని, ప్రజాసంక్షేమం, శ్రేయస్సు కోసం పాటుపడాల్సిన ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందన్నారు.
మద్యం అమ్మకాలు మారుమూల గ్రామాల వరకు విస్తరించాయంటే మద్యపాన నిషేధం ఏ విధంగా అమలుచేసిందో తెలుస్తుందన్నారు. ఈ మూడేళ్లలో మద్యంపై తప్ప ఇతర ఎటువంటి అంశాలపై దృష్టి సారించలేదన్నా రు. నాడు వైసీపీ నాయకులు చెప్పిన అబద్ధపు హామీలు నమ్మి గద్దెనెక్కిస్తే రాష్ట్రాభివృద్ధిని 20 ఏళ్లు వెనక్కి నెట్టేశారన్నారు. గత మద్యం పాలసీలో దుకాణాలకు సంబంధించి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లపై న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. రిజర్వేషన్ల ప్రక్రియ సరిగా లేదంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వ్యాపారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశమైంది.
మద్యంపై 10 వేల కోట్ల ఆదాయమే సీఎం జగన్ లక్ష్యం : టీడీపీ
మద్యంపై ఐదేళ్లలో 10 వేల కోట్ల ఆదాయమే ముఖ్యమంత్రి లక్ష్యమని, అందుకోసమే కొత్త బ్రాండ్లు, కొత్త పాలసీ తెచ్చారని ధ్వజమెత్తారు. బ్రాండ్లు మద్యంపై ఐదేళ్లలో పది వేల కోట్ల ఆదాయమే ముఖ్యమంత్రి లక్ష్యమని టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. అందుకోసమే కొత్త బ్రాండ్లు, కొత్త పాలసీ తెచ్చారని ధ్వజమెత్తారు. డిస్టిలరీలను నడుపుతున్నది జగన్ బినామీలు కాదా ? అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. డిస్టిలరీలు చంద్రబాబు హయాంలోవి అంటున్న జగన్ ఎందుకు రద్దు చేయట్లేదని నిలదీశారు. తెలుగు జాతి ఉన్నంత వరకు చంద్రబాబు బ్రాండ్ ఉంటుందని.. చంద్రబాబు.. జగన్ మాదిరిగా ఛీప్ లిక్కర్ బ్రాండ్ కాదని అచ్చెన్నాయుడు అన్నారు.
సారా ఆదాయంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తామనడం సిగ్గుచేటని.. టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసపోయామన్న భావనలో రాష్ట్ర ప్రజలు ఉన్నారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ పతనం ప్రారంభమైందని 2024లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబును అనుమతించిన డిస్టలరీలన్నింటినీ జగన్ మనుషులు, సలహాదారులే లాక్కున్నారని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 140 కొత్త బ్రాండ్స్ తీసుకువచ్చారని నారా లోకేష్ దుయ్యబట్టారు.