రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌లో టైలర్ దారుణహత్య దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇద్దరు వ్యక్తులు టైలర్ షాపులోకి వచ్చి.. టైలర్‌ను గొంతు కోసి దారుణంగా చంపేశారు. ఈ హత్య తరువాత ఉదయ్‌పూర్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హంతకులకు కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తూ ర్యాలీ తీశారు. హత్య చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు హంతకులు ఈ మర్డర్ తరువాత వీడియో కూడా రిలీజ్ చేశారు. గౌస్ మహ్మద్ , మహ్మద్ రియాజ్ అనే వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ ఘటన తరువాత రాజస్థాన్‌లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఉదయ్‌పూర్‌లో దుకాణాలను మూసేశారు. బీజేపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన నేత నూపుర్ శర్మ (Nupur Sharma)కు మద్దతిచ్చినందుకు ఆయనను హత్య చేయడాన్ని బాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.
నూపుర్ శర్మ మే నెలాఖరులో ఓ టీవీ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రవక్త మహమ్మద్‌పై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆమెకు కన్హయ్య లాల్ మద్దతు పలుకుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టారు. అనంతరం ఆయనపై కేసు నమోదైంది. ఆయన బెయిలుపై విడుదలయ్యారు. ఆయన టైలరింగ్ దుకాణంలోకి ఉదయ్‌పూర్‌లో నివసిస్తున్న గోస్ మహమ్మద్, అబ్దుల్ జబ్బార్ ప్రవేశించి, తమకు బట్టలు కుట్టాలని కోరినట్లు తెలుస్తోంది. ఆయన వారిలో ఒకరికి కొలతలు తీస్తూ ఉండగా మరొకరు దాడి చేసి, దాదాపు 26 సార్లు పొడిచి, హత్య చేసినట్లు పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది. ఇదిలావుండగా, ఆయన కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ, బెయిలుపై విడుదలైన కన్హయ్య లాల్‌ను ఫోన్ ద్వారా విపరీతంగా బెదిరించేవారని, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని తెలుస్తోంది. ఓ రోజు ఇరు పక్షాలను పిలిచి పోలీసులు రాజీ కుదిర్చినట్లు తెలుస్తోంది. ఈ హత్య చేసిన తర్వాత గోస్ మహమ్మద్, అబ్దుల్ జబ్బార్ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఇస్లాంకు జరిగిన అవమానానికి తాము ప్రతీకారం తీర్చుకున్నామని తెలిపారు. వీరిద్దరినీ రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు.
ఈ నేపథ్యంలో బిహార్ మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు శివానంద తివారీ, బాలీవుడ్ సెలబ్రిటీలు కంగన రనౌత్, స్వర భాస్కర్, గౌహర్ ఖాన్, అనుపమ్ ఖేర్ తదితరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బిహార్ మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ ఇచ్చిన ట్వీట్‌లో, ఉదయ్‌పూర్‌లో జరిగిన హత్య అత్యంత బాధాకరమని, దిగ్భ్రాంతికరమని తెలిపారు. ఓ మతాన్ని కాపాడుతున్నామని చెప్పుకునేవారిపై వేగంగా విచారణ జరిపి, నడి బజారులో ఉరి తీయాలని, మతం ముసుగులో ఇలాంటి అమానుష చర్యలకు మరొకరు పాల్పడకుండా ఈ శిక్ష ఉండాలని డిమాండ్ చేశారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఇచ్చిన ట్వీట్‌లో, ఉదయ్‌పూర్ సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. మతపరమైన తీవ్రవాదం ఏ మతస్థులనైనా గుడ్డివారిని చేస్తుందని, అంతేకాకుండా వారి ఆలోచనా శక్తిని వారికి దూరం చేస్తుందని అన్నారు. ఈ కేసులో హంతకులను తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఆర్జేడీ నేత శివానంద తివారీ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఈ హత్య సంఘటనను తాను తీవ్రంగా ఖండించానని చెప్పారు. ఈ అమానుష నేరానికి పాల్పడినవారు మన దేశంలో అస్థిరతను సృష్టించాలనుకుంటున్నారని చెప్పారు. ఇలాంటి నేరాలకు పాల్పడాలని ఆలోచించే సాహసం మరొకరు చేయని విధంగా సాధ్యమైనంత కఠినంగా హంతకులను శిక్షించాలని రాజస్థాన్ ప్రభుత్వాన్ని కోరారు. కంగన రనౌత్ ఇచ్చిన పోస్ట్‌లో, ‘‘నూపుర్ శర్మకు మద్దతిచ్చినందుకు ఈ వ్యక్తి తలను తెగనరికారు. తలను తెగనరకడాన్ని జీహాదీలు వీడియో తీశారు. వాళ్ళు ఆయన దుకాణంలోకి బలవంతంగా చొరబడ్డారు, శరీరం నుంచి తలను వేరు చేయాలంటూ నినాదాలు చేశారు. ఇదంతా దేవుడి పేరుతో జరిగింది! వాళ్ళు ఉదయ్‌పూర్‌లో కన్హయ్య లాల్ తలను దేవుని పేరుతో తెగ్గోశారు! ఆ తర్వాత ఇలా పోజు ఇచ్చారు. అంతేకాకుండా అనేక వీడియోలను చిత్రీకరించారు, వాటిని చూసే సాహసం నాకు లేదు. నేను స్థాణువైపోయాను’’ అని పేర్కొన్నారు.
స్వర భాస్కర్ ఇచ్చిన పోస్ట్‌లో, కన్హయ్య లాల్ హత్య అత్యంత హేయమైనదని, తీవ్రంగా ఖండించదగినదని పేర్కొన్నారు. హంతకులను చట్టం ప్రకారం కఠినంగా, సకాలంలో శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ తీవ్రమైన నేరం సమర్థించదగినది కాదన్నారు.
గౌహర్ ఖాన్ ఇచ్చిన పోస్ట్‌లో, తన కడుపులో ఎవరో చెయ్యి పెట్టి దేవినట్లయిందని తెలిపారు. మీ మతానికి ప్రాతినిధ్యం వహించే పద్ధతి ఇదేనా? అని ప్రశ్నించారు. ఓ పోస్ట్ పెట్టినందుకు హత్య చేసినవారికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. నేరస్థులంతా ఒకే విధంగా ఉంటారన్నారు. అనుపమ్ ఖేర్ ఇచ్చిన ట్వీట్‌లో, కన్హయ్య లాల్ హత్య అత్యంత భయానకంగా ఉందని, ఇది అత్యంత విచారకరమని, చాలా కోపంగా ఉందని పేర్కొన్నారు. రణ్‌వీర్ షోరే ఇచ్చిన ట్వీట్‌లో, భారత దేశంలో ఇస్లాం పాటిస్తున్నవారిని ఆత్మావలోకనం చేసుకోవడానికి, దానిలోని మతఛాందసవాదం, తీవ్రవాదం సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రోత్సహించడానికి బదులుగా, వారు బాధితులని చిత్రీకరించడంలో సహాయపడినవారందరికీ ఇది మేలుకొలుపు అని చెప్పారు. అయితే నిద్రపోతున్నట్లు నటిస్తున్నవారిని మేలుకొలపడం సాధ్యం కాదన్నారు.
కన్హయ్య హత్య జరిగిన కొన్ని గంటల్లోనే దిల్లీ కేంద్ర కార్యాలయం నుంచి ఉదయ్‌పుర్‌కు చేరుకుంది ఎన్‌ఐఎ దర్యాప్తు బృందం. ఎన్ఐఏ బృందానికి రాజస్థాన్ పోలీసులు, సిట్, ఏటీఎస్ సహకరిస్తోంది. ఈ బృందాలన్నీ హత్య జరిగిన ప్రదేశాన్ని బుధవారం సందర్శించాయి.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఈ ఘటన జరిగిన మరునాడే అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రజలను భయాందోళను గురి చేసేందుకు నిందుతులు ఈ కిరాతక చర్యకు పాల్పడినట్లు చెప్పారు. నిందితులకు ఇతర దేశాలతో సంబంధాలున్నట్లు తెలిసినందు వల్ల చట్టవ్యతిరేక కార్యకాపల నిరోధక చట్టం(UAPA)కింద కూడా కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇకపై కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుందని రాజస్థాన్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. తన తండ్రిని దారుణంగా హత్య చేసిన కిరాతకులను ఎన్కౌంటర్ చేయాలని, లేదా ఉరి తీయాలని టైలర్ కన్హయ్య కుమారుడు డిమాండ్ చేశాడు. అప్పుడే ఇలాంటి దారుణాలకు పాల్పడాలనేవారు భయపడతారని తెలిపాడు.
నుపుర్ శర్మనూ అరెస్టు చేయాలి: అసదుద్దీన్ ఒవైసీ
రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో హిందూ టైలర్ ను ఇద్దరు దుండగులు తల నరికి హత్య చేయడాన్ని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఖండించారు.వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మను కేవలం పార్టీ నుంచి సస్పెండ్ చేసి వదిలి పెట్టడం సరికాదని అసదుద్దీన్ పేర్కొన్నారు. ఆమెను కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ఇలాంటి ఘటనలకు నుపుర్ శర్మ వ్యాఖ్యలే కారణమయ్యాయని మండిపడ్డారు.
మంత్రి కేటీఆర్ ట్వీట్
ఉదయ్‌పూర్‌లో జరిగిన దారుణ హత్య నమ్మలేని విధంగా ఉందని… ఈ ఘటనతో భయాందోళనకు గురయ్యానని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరిగిన సంచలన సంఘటనపై స్పందించిన కేటీఆర్… ఈ అనాగరిక హింసకు పౌర సమాజంలో స్థానం లేదన్నారు.