సంక్రాంతి సందర్భంగా గుడివాడలో నిర్వహించిన ‘గోవా క్యాసినో’ వ్యవహారం మరువక ముందే కృష్ణాజిల్లాలో మరో ఈవెంట్‌కు పెద్దలు రంగం సిద్ధం చేశారు. గోవా కల్చర్‌తో క్యాసినో మందు పార్టీలు, సినీతారల డ్యాన్సులు, విందులు, ఇలా అన్నీ ఏర్పాటుచేసుకున్నారు. దీనికి ఈసారి పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు వేదికగా మారింది. ఈ రోజు రాత్రి నిర్వహించేందుకు పటిష్ఠ ఏర్పాట్లు చేసుకున్నారు. శ్రీమంతులు, అతికొద్ది మంది నేతలు, ప్రముఖులకు ఇందుకు సంబంధించిన ఆహ్వానపత్రాలు పంపారు. ఈ విషయం బయటకు రావడంతో కలకలం రేగింది.
కంకిపాడులో క్యాసినో వివరాలు ఇలా ఉన్నాయి. కంకిపాడులో ఒక హోటల్, కన్వెన్షన్ సెంటర్‌లో క్యాసినో నిర్వహణకు భారీగా ఏర్పాట్లు చేసుకున్నారు. దీనికి ప్రత్యేకంగా ఆహ్వాన పత్రం ముద్రించి ఎంపిక చేసిన వారికి మాత్రమే పంపారు. ఇక్కడ గెట్ టు గెదర్ తరహాలో ఈవెంట్ నిర్వహించుకుంటున్నామని, అనుమతి ఇవ్వాలని కంకిపాడు పోలీసులకు దరఖాస్తు చేశారు. దీన్ని గన్నవరం ఏసీపీ కార్యాలయానికి పంపారు. కేవలం డాన్సులు, డీజే కోసం ఈ దరఖాస్తు చేశారు.
మద్యం తాగేందుకు అనుమతి ఇవ్వాలని ఎక్సైజ్ పోలీసులకు దరఖాస్తు చేసుకోగా వారు అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. అయితే పోలీసులు మాత్రం ఈవెంట్ నిర్వహణకు అనుమతి ఇవ్వలేదు. ఉన్నతస్థాయి నుంచి ఇందుకు ఒత్తిళ్లు వచ్చినట్లు తెలిసింది. సామాజిక మాధ్యమాల్లో ఈ వ్యవహారం వెలుగు చూసింది. క్యాసినో నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈవెంట్ పేరుతో గోవా నుంచి అమ్మాయిలు, టాలీవుడ్, బాలీవుడ్ సినీ తారలు, ప్రముఖ గాయకులు కూడా వస్తున్నట్లు తెలిసింది. వీరికి భారీగానే అడ్వాన్సులు కూడా చెల్లించారు. కన్వెన్షన్ సెంటర్‌కు క్యాసినో పేరుతో అడ్వాన్సులు చెల్లించారు. ఎంట్రీ రుసుము రూ.20 వేల వరకు పెట్టినట్లు సమాచారం. గత రెండు రోజులుగా కంకిపాడులో దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం ఈ క్యాసినో జరుగుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై కంకిపాడు పోలీసులను వివరణ కోరగా క్యాసినో విషయం తమ దృష్టికి రాలేదని, ఈవెంట్ నిర్వహణకు మాత్రమే దరఖాస్తు అందిందని, అనుమతి ఇంకా ఇవ్వలేదని చెప్పారు. ఆఖరి నిమిషంలో ఈ క్యాసినో ఈవెంట్ రద్దైనట్లు ప్రచారం జరుగుతోంది.