రాగల ఐదు రోజుల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ నెల 7, 8, 11 తేదీల్లో కోస్తాంధ్ర, తెలంగాణ, యానాంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో 9 న అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.
రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం
గోదావరి నదికి ఆకస్మిక వరదలు వచ్చే హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో అప్రమత్తం చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె.మాధవిలత ప్రకటనలో తెలియజేశారు. ప్రస్తుతం అధికార యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో అప్రమత్తం చేశామని జిల్లా స్థాయి, డివిజన్ పరిధిలో కంట్రోల్ రూం ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టరేట్, రెవెన్యూ డివిజన్ పరిధిలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి 24 గంటలు షిఫ్ట్ లలో సిబ్బందిని నియమించామన్నారు.
కలెక్టరేట్ పరిధిలో కంట్రోల్ రూం
8977935609 నంబర్ ప్రజలకు అందుబాటులో ఉంచామన్నారు. అదేవిధంగా షిఫ్ట్ ల వారీగా సిబ్బంది నియమించినట్లు తెలిపారు. జూలై 8 వ తేదీన నుంచి జూలై 11 వ తేదీ వరకు షిఫ్ట్ లలో కలెక్టరేట్ సిబ్బంది అందుబాటులో ఉంచి, ఎప్పటికప్పుడు సమాచారం అందుకుని అధికారులతో సమన్వయం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.
గోదావరి జిల్లాలో డివిజన్ పరిధిలో
జిల్లాలోని రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో కంట్రోల్ రూం ఏర్పాటుచేసినట్లు తెలిపారు. రాజమహేంద్రవరం 0883 2442344, కొవ్వూరు 088132 31488 ల్యాండ్ లైన్ నంబర్లను అందుబాటులో ఉంచామని, 24 x 7 సిబ్బంది షిఫ్ట్ లలో అందుబాటులో ఉంటారని కలెక్టర్ తెలిపారు.