సినీ, రాజకీయరంగాల్లో చెరగని ముద్రతో చరిత్ర సృష్టించి ప్రత్యేకత చాటుకున్న యుగపురుషుడు. తెలుగుజాతి ఉన్నంత కాలం తన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా జీవించారు. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రతో జనంలో చైతన్యానికి నాంది పలికారు. ఆయనే ఆంధ్రుల అన్న ఎన్టీఆర్. ఆ మహానేత శత జయంతిని నిర్వహించేందుకు టీడీపీ శ్రీకారం చుట్టింది. “సరిలేరు నీకెవ్వరు తారకరామా” పేరిట యుగపురుషుడికి ఇవాళ మహానాడు నివాళులర్పించనుంది. ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలని, ఇదే వేదికగా శ్రేణులంతా ముక్తకంఠంతో నినదించనున్నారు.
నందమూరి తారక రామారావు తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. సినీ, రాజకీయ రంగాలను శాసించి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని దశదిశలా వ్యాపింపజేసిన మహానేత. తెలుగు నాట ప్రఖ్యాత ఆంధ్రుడెవరంటే ఎన్టీఆర్ పేరు తప్ప మరెవరి పేరు వినపించదు. కాలే కడుపులకు పట్టెడన్నం పెట్టలేని ప్రభుత్వాలు ఎందుకని ఆలోచించిన వాస్తవిక వాది. అందుకే సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లని నినదించారు. జనమే ఊపిరిగా రాజకీయాలు చేశారు. టీడీపీని స్ధాపించి దేశ రాజకీయాల్లోనే తొలిసారిగా సంక్షేమ రాజ్యానికి బీజం వేశారు. పార్టీ ప్రారంభించిన 13 నెలల్లోనే అధికారం చేపట్టి ముఖ్యమంత్రయ్యారు. 2 రూపాయలకే కిలో బియ్యం, పక్కా ఇళ్లు, జనతా వస్త్రాలు, మహిళలకు ఆస్తి హక్కు. ఇలా ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టారు. అనతికాలంలోనే తెలుగుదేశం పార్టీకి పార్లమెంట్‌లో ప్రతిపక్షహోదా లభించేలా అవతరింపచేసి.. ఆ ఘనత సాధించిన తొలి ప్రాంతీయ పార్టీగా చరిత్ర సృష్టించారు.
శతజయంతి వేళ – ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్
ఇది ఎన్టీఆర్ శత జయంతి సంవత్సరం..28న ఆయన నూరో సంవత్సరంలో అడుగుపెట్టినట్టు..వచ్చే ఏడాది..అంటే..2023 మే 28 నాటికి ఆ చారిత్రక పురుషుడికి నూరు నిండుతుంది. ఆయనకు భారతరత్న పురస్కారం ఇవ్వడానికి ఇంతకు మించి సందర్భం ఏముంటుంది.. గతంలో ఎవరూ చెయ్యని విధంగా ఎన్టీఆర్ పేరు జిల్లాకి పెట్టింది ఈ ప్రభుత్వమే.అదే స్ఫూర్తితో తెలుగుబిడ్డ రామారావుకి భారతరత్న రావడానికి కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చెయ్యాలి.
నిమ్మకూరులో శతజయంతి వేడుకలకు బాలయ్య
కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. వేడుకలను పురస్కరించుకొని ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. నిమ్మకూరుకు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ లో బాలకృష్ణకు టీడీపీ నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. శతజయంతి వేడుకల లోగో కలిగిన సంచులను నందమూరి బాలకృష్ణ ఆవిష్కరించారు.
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్
టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత సీఎం నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద వేడుకలు నిర్వహిస్తున్నారు.ఈ తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ సమాధి వద్దకు వచ్చిన ఇద్దరు సోదరులు పుష్పగుచ్ఛాలు ఉంచి తాతను స్మరించుకున్నారు. మరోవైపు ఎన్టీఆర్ జయంతి వేళ ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు.