ఈ రోజు ప్రపంచ పాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.పాడి రంగాన్ని అభివృద్ధి చేయడం, పాల ఉత్పత్తుల విలువ,పాల ఉపయోగాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం ఐక్యరాజ్యసమితికి సంబంధించిన ఆహార,వ్యవసాయ సంస్ధ-ఎఫ్ ఏ ఓ ప్రతిఏటా జూన్ 1వ తేదీన ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. 2001 సంవత్సరం నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వివిధ రకాలుగా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు.ప్రపంచ పాల దినోత్సవాన్ని ప్రపంచ ఆహారంగా గుర్తించి, పాడి పరిశ్రమపై దృష్టిని తీసుకురావడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దేశం యొక్క స్థిరమైన అభివృద్ధికి పాడి పరిశ్రమ రంగం సహాయం చేస్తుంది కాబట్టి ఆర్థిక వృద్ధి మరియు అభివృద్ధికి సంబంధించి సమాజంలో పాల ఉత్పత్తుల యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేసుకోవడానికి ప్రపంచ పాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ ఏడాది ప్రపంచ పాల దినోత్సవం యొక్క థీమ్ “Enjoy Dairy Rally” .ఈ ఏడాది థీమ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం వాతావరణ చర్యలను వేగవంతం చేయడానికి , పాడి పరిశ్రమ ప్రభావాన్ని తగ్గించడానికి ఇప్పటికే చేస్తున్న పనిని హైలెట్ చేస్తుంది. ప్రపంచ పాల దినోత్సవం అనే ప్లాట్ ఫామ్ ను ఉపయోగించి ధరణిని కాపాడుకునేందుకు డైరీ నెట్ జిరో పట్ల మేనేజింగ్ మరియు చర్యల గురించి అందరిలో అవగాహన కలిగేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇక రోజూ పాలు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరంలో కొన్ని రకాల హార్మోన్ల ఉత్పత్తికి అవసరమయ్యే కొవ్వుపదార్థాలు పాలద్వారా లభిస్తాయి. పాలలోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడు కణాలు చురుగ్గా పని చేసేందుకు కావలసిన పోషకాలను అందిస్తాయి. రోజూ మూడు గ్లాసుల పాలు తాగేవారు వ్యాధులకు దూరంగా ఉంటారని పలు పరిశోధనల్లో తేలింది. పాలు తాగడం వల్ల బరువు పెరుగుతామన్నది అపోహ మాత్రమే. పాలలోని కొవ్వులు అధిక బరువును తగ్గించడంలో సాయపడుతాయి. నిద్ర లేమితో బాధపడేవారు, పడుకునే ముందు ఓ గ్లాసు పాలలో కాస్త తేనె కలుపుకొని తాగితే చక్కని ఫలితం ఉంటుంది.
చిన్నప్పటినుంచీ పాలు తాగే అలవాటు ఉన్నవారిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే ఆస్కారం చాలా తక్కువని ఓ అంచనా. పాలలోని క్యాల్షియం, సహజ కొవ్వులు క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతాయి. పాలు తాగడం వల్ల కంటిచూపు మెరుగవుతుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. కరోనా సమయంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో పాలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. పసుపు, మిరియాలు, శొంఠి వంటివి కలుపుకొని తాగడం వల్ల వైరస్, బ్యాక్టీరియా వంటి రోగకారకాలు నశిస్తాయి.
భారతదేశంలో వ్యవసాయపరంగా అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి, కానీ ఇప్పటికీ గ్రామీణ పేదరికం ఎక్కువగా ఉంది. మిశ్రమ పంట-పశువుల పెంపకం అనేది రాష్ట్రంలోని 80 శాతానికి పైగా గ్రామీణ కుటుంబాలు ఆచరించే ప్రధానమైన వ్యవసాయ విధానం. ఈ వ్యవసాయ రకాల నుండి పాల ఉత్పత్తిని పెంచడం గ్రామీణ జీవనోపాధిని మెరుగుపరచడానికి సమర్థవంతమైన మార్గం.
ఆంధ్రప్రదేశ్ లోని పాడిపరిశ్రమలో సమూల మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమూల్ మిల్క్ కు బాధ్యతలు అప్పజెప్పింది. ఏపీ డెయిరీ ఆస్తులతో పాటు ఇతర వ్యవహారాలన్నీ అమూల్ కు ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా పశ్చిమ గోదావరి జిల్లాలో అమూల్ పాలసేకరణను ప్రారంభించింది. ఐతే అమూల్ పాలకి ప్రజల నుంచి స్పందన కరువైనట్లు తెలుస్తోంది. అమూల్ ఆశించిన స్థాయిలో కనీస సేకరణ కూడా జరగలేదు. వ్యవసాయ, పాడి పరిశ్రమ ప్రధానంగా ఉన్న రాష్ట్రం కావడంతో ప్రభుత్వం జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. కలెక్టర్ సహా అనేక శాఖలను ఇందులో భాగస్వాములను చేసింది. కానీ ఫలితం మాత్రం సాధించలేకపోయింది.
మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవలని కాంక్షించి సీఎం జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ చేయూత ద్వారా రాష్ట్రంలోని మహిళలకు పాడి పశువులను పంపిణీ చేయాలని నిర్ధారించినప్పటికీ దీనివల్ల ఉపయోగంలేకుండా పోయింది. రాష్ట్రంలోని మహిళలు స్వయం శక్తితో ఎదిగేందుకు ఈ పథకం దోహదం చేస్తుందని గొప్పలు చెప్పుకున్నప్పటికీ నిరుపయోగంగా ఈ పధకం తయారైంది. ఇప్పటికైనా ప్రభుత్వం పాడిపరిశ్రమ అభివృద్దికి కృషి చేయాలని దీని మీద ఆధారపడిన కుటుంబాలు కోరుకుంటున్నాయి.