తిరుమల తిరుపతి దేవస్థానం నేతృత్వంలో అమరావతిలో నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్ధానం ప్రారంభోత్సవానికి హాజరు కావాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి ఆహ్వానం అందించారు. నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా ఎంపిక చేసిన అమరావతిలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం ఉండాలన్న దిశగా గత టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కార్యరూపం దాల్చింది. టీడీపీ పాలనలోనే అమరావతిలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఈ పనులు ఇప్పటికే పూర్తి కాగా ఈనెల ఆలయ ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది.
రాజ్ భవన్‌లో గవర్నర్‌ను కలిసిన సుబ్బారెడ్డి ఆలయ వివరాలను తెలిపారు. ఈ నెల 4నుంచి విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన పూజా కార్యక్రమాలు, 9న విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. గవర్నర్‌కు స్వామి వారి కార్యక్రమ ఆహ్వాన పత్రిక, ప్రసాదాలు అందజేసారు. సీఎం క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి వేద పండితులతో కలిసి సీఎం జగన్‌ను కలిశారు. అమరావతిలో నిర్మాణం పూర్తి చేసుకున్న శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ ప్రారంభోత్సవానికి జగన్‌ను ఆహ్వానించారు. ఆలయ ప్రారంభోత్సవంలో భాగంగా ఈ నెల 4 నుంచి పూజా కార్యక్రమాలు, 9న విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఉంటాయని వైవీ.సుబ్బారెడ్డి వివరించారు.