గ్యాస్ లీకుపై దర్యాప్తునకు ముఖ్యమంత్రి ఆదేశం
విశాఖపట్నం సమీపంలోని అచ్యుతాపురం బ్రాండిక్స్ సెజ్‌లో గ్యాస్ లీకయ్యింది. క్వాంటం సీడ్స్ యూనిట్‌లో ఒక్కసారిగా ఘాటైన వాయువు ఒక్కసారిగా బయటికి వచ్చేసరికి వాంతులు, తల తిరిగి ఉద్యోగులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. బ్రాండిక్స్ లో అమ్మోనియా లీకై దాదాపు 200 మంది మహిళా కార్మికులకు అస్వస్థతకు లోనయ్యారు. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం, యాజమాన్యం వెంటనే బాధితులను హుటాహుటిన బ్రాండిక్స్ ఎస్ఈజేడ్‌లో ఉన్న ఆరోగ్య కేంద్రంలో చేర్చి చికిత్స అందజేస్తున్నారు.
అస్వస్థతకు గురైన వారికి మంచి వైద్యం అందించాలని సీఎం ఆదేశాలు
విశాఖపట్నం సమీపంలోని అచ్యుతాపురంలో అమ్మోనియా గ్యాస్ లీక్, బ్రాండెక్స్‌లో పనిచేస్తున్న మహిళలకు అస్వస్థత ఘటనపై సమగ్ర సమాచారం కావాలని అధికారులను ఆదేశించారు. ఘటనకు దారితీసిన కారణాలను వివరించిన సీఎంఓ అధికారులు. సంబంధిత జిల్లా కలెక్టర్ వెంటనే వెళ్లి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారని వెల్లడించిన అధికారులు. గ్యాస్ లీక్‌ను కూడా నియంత్రించారని తెలిపిన అధికారులు. బ్రాండిక్స్‌లో ఒక యూనిట్‌లో పనిచేస్తున్న మహిళలను అందర్నీ ఖాళీ చేయించామని, అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలించారని తెలిపిన అధికారులు. అంతా కోలుకుంటున్నారని, క్షేమంగా ఉన్నారని వివరించారు. అమ్మోనియా ఎక్కడనుంచి లీకైందన్న అంశంపై అధికారులు దర్యాప్తు చేపట్టారన్నారు. అస్వస్థతకు గురైన వారికి మంచి వైద్యాన్ని అందించాలని సీఎం ఆదేశించారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేసి, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సంబంధిత శాఖ అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు. ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా స్థానిక మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను సీఎం ఆదేశించారు. వెంటనే ఆయన విజయవాడ నుంచి అనకాపల్లి బయల్దేరి వెళ్లారు.
గ్యాస్ లీకేజీ ఘటనపై హోంమంత్రి ఆరా
అనకాపల్లి గ్యాస్ లీకేజీ ఘటనపై హోంమంత్రి తానేటి వనిత ఆరా తీశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో హోంమంత్రి సమీక్షించారు. సహాయ చర్యలు ముమ్మరంగా చేపట్టాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు. గ్యాస్ పీల్చి ఇబ్బందిపడ్డ 32 మంది బాదితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని, గ్యాస్ లీక్ అవుతున్న పరిశ్రమని అధికారులు కంట్రోల్ లోకి తీసుకోవాలని ఆదేశించారు.
బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలి- కింజరాపు అచ్చెన్నాయుడు
విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్ లోని సీడ్స్ కంపెనీ నుండి విషవాయువులు లీకై 200 మంది అస్వస్థకు గురవ్వడం బాధాకరం. బాధితుల్లో గర్భిణులు కూడా ఉన్నారు. జగన్ రెడ్డి కంపెనీల నుండి జే-ట్యాక్స్ వసూలు చేసుకోవడంపై ఉన్న శ్రద్ధ రక్షణ చర్యలు తీసుకోవడం, రెగ్యులర్ తనిఖీలు నిర్వహించడంపై లేకుండా పోయింది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విశాఖలో ఎల్జీ పాలిమర్స్, చిత్తూరు పూతలపట్టులో హాట్సన్ డైరీలో అమ్మోనియా లీకేజీ, ఏలూరు పోరస్ కంపెనీలో గ్యాస్ లీకేజీ, నంద్యాలలో ఎస్పీవై ఆగ్రో ఇలా వరుసగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. పరిశ్రమల నిర్వహణలో ప్రభుత్వం చూపిస్తున్న అలసత్వం, తనిఖీలు సరిగా లేకపోవడమే కారణం. అచ్యుతాపురం సెజ్ లో జరిగిన ప్రమాదానికి కూడా ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్షయమే కారణం. వరుస ఘటనలు జరిగినా, వందలాది మంది ప్రాణాలు పోతున్నా ప్రభుత్వంలో కనీస చలనం లేకపోవడం దుర్మార్గం. అచ్యుతాపురం ఘటనలో అదృష్ట వశాత్తు ప్రాణాపాయం జరగలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి పరిశ్రమల్లో సేఫ్టీ మెజర్స్ పై తనిఖీలు నిర్వహించాలి. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి. రసాయన ప్రమాదాల్లో వాయువులు బాధితులపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉన్నందున హెల్త్ కార్డులు అందించి విష వాయువుల ప్రభావం తగ్గేవరకు ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం.