కేంద్రంలోని అధికార బీజేపీ, రాష్ట్రంలోని అధికార వైసీపీ ప్రత్యక్షంగా ఎప్పుడూ ఒకరి మీద ఒకరు విమర్శించకున్నది లేదు. పైగా అనేక కీలక బిల్లుల సమయంలో అతు లోక్ సభలోనూ, ఇటు రాజ్య సభలోనూ వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగానే వ్యవహరిస్తూ వస్తుంది. అటు కేంద్రం కూడా వైసీపీ ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తునే ఉంది. పరిమితికి మించి అప్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శించింది లేదు. అలాగే పార్లమెంట్ లో కొన్ని కీలక పదవులు కూడా ఇస్తూ వచ్చింది.
తాజాగా వైసీపీ మహిళా ఎంపీకి కీలక పదవి దక్కింది. కాఫీ బోర్డు సభ్యురాలిగా అరకు వైసీపీ ఎంపీ గొడ్డేటి మాధవి నియమితులు అయ్యారు. ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాఫీ బోర్డును తిరిగి నియమిస్తూ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్‌లో సభ్యులుగా ఎంపీ ప్రతాప్ సిన్హా, రాజ్యసభ సభ్యుడు ఎన్.చంద్రశేఖరన్ కూడా ఉన్నారు. తనకు ఈ పదవి రావడంపై ఎంపీ మాధవి సంతోషం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా ఈ బోర్డులో కాఫీ సాగు చేసే రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధుల విభాగంలో ఏపీ గిరిజన సంక్షేమ విభాగం కార్యదర్శి కాంతిలాల్‌దండేకు అవకాశం దక్కింది. అలాగే కాఫీ పండించే వారి విభాగంలో కొత్త పాడేరుకు చెందిన కురుస ఉమామహేశ్వరరావు, విశాఖ జిల్లా దోమంగికి చెందిన విశ్వనాథం వాణిజ్య విభాగంలో విశాఖ జిల్లా కిన్నెర్లకు చెందిన జయతు ప్రభాకర్‌రావు,ఇన్‌స్టంట్ కాఫీ ఉత్పత్తిదారుల విభాగంలో హైదరాబాద్‌కు చెందిన చల్లా శ్రీశాంత్‌లను వాణిజ్య శాఖ సభ్యులుగా నియమించింది.