వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి విజయలక్ష్మి వైసీపీకి రాజీనామా చేశారు. తన కుమారుడు కంటే కుమార్తె కోసం ఎక్కువగా కష్టపడాలని నిర్ణయించుకున్నానని అందుకే వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. వైఎస్సార్ బిడ్డగా షర్మిల వైఎస్సార్‌టీపీ పెట్టుకుంది. తండ్రి ఆశయాల మేరకు ప్రజాసేవ చేయాలనే నిర్ణయించుకుందని.. వైఎస్సార్ భార్యగా, బిడ్డకు తల్లిగా షర్మిలకు అండగా ఉండాలనుకుంటున్నానని తెలిపారు. ఏపీ ప్రయోజనాల కోసం వైఎస్ జగన్ ఇక్కడ అవసరం. తెలంగాణ కోడలిగా షర్మిల అక్కడ ప్రజాసేవలో ఉండాలనుకుంది. ‘కష్టాల్లో ఉన్నప్పుడు నా కొడుకు జగన్‌తో ఉన్నా. సంతోషం ఉన్నప్పుడు కూడా అండగా ఉంటే నా రక్తం పంచుకున్న బిడ్డ షర్మిలకు అన్యాయం చేసిన దాన్ని అవుతానేమోనని నా మనస్సాక్షి చెబుతోంది. నా ఉనికి ఎవరికీ వివాదాస్పదం కాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. ఈ విషయంలో నన్ను క్షమించాలి’’ అని ఆమె అన్నారు.
తెలంగాణలో ఏపీ కంటే ముందుగానే ఎన్నికలు వస్తున్నాయన్నారు. అందుకే అక్కడ సమయం కేటాయిస్తానన్నారు. రెండు పార్టీల్లో కొనసాగడం సాధ్యం కాదన్నారు. వైఎస్సార్ బిడ్డలే అయినా ఇద్దరు వేర్వేరు పార్టీలకు ప్రతినిధులు. తల్లిగా జగన్‌కు ఎప్పుడూ అండగా ఉంటానని ప్రకటించారు. ప్లీనరీ వేదికపై మొదట జగన్ మాట్లాడారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. తాను రెండు పార్టీల్లోనూ కొనసాగడం సరికాదన్నారు. అందుకే రాజీనామా నిర్ణయం తీసుకుంటున్నానని విజయలక్ష్మి పేర్కొన్నారు. వక్రీకరణ, విమర్శలకు తావులేకుండా ఉండేందుకే రాజీనామా చేస్తున్నానన్నారు. ఇలాంటి రోజు వస్తుందని తాను అనుకోలేదన్నారు. వైసీపీ అభిమానులు క్షమించాలని విజయలక్ష్మి కోరారు. జగన్, షర్మిలకు ఎల్లప్పుడూ అండగా ఉన్నానని విజయలక్ష్మి అన్నారు. ఏపీలో తన సోదరుడు జగన్‌కు ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే షర్మిల తెలంగాణలో వైఎస్‌ఆర్ టీపీ ఏర్పాటుచేసిందన్నారు. వైఎస్‌ఆర్ సంక్షేమ పాలన అందించడానికే షర్మిల పోరాటం చేస్తోందని విజయలక్ష్మి అన్నారు. ఆమెకు అండగా ఉండేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నానని విజయలక్ష్మి స్పష్టం చేశారు.
చెల్లెలి కోసం తల్లి మాట కాదనలేక పోయిన జగన్
తెలంగాణలో రాజకీయ పార్టీ స్ధాపించి వేల కిలో మీటర్ల పాదయాత్ర ద్వారా ప్రజల్లో మమేకం అవుతున్న చెల్లెలికి అండగా ఉంటానని అందుకు వీలుగా వైసీపీ గౌరవాధ్యక్షురాలి బాధ్యతల నుంచి తప్పుకుంటానని తల్లి విజయమ్మ అడిగిన మాటను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి కాదనలేకపోయారు. ఎన్నో నెలలుగా విజయమ్మ పెడుతున్న ఒత్తిడికి చెల్లి షర్మిల కోసం తలొగ్గక తప్పలేదు జగన్మోహనరెడ్ఢికి. దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి, విజయమ్మ దంపతులకు తమ ఇద్దరు బిడ్ఢలంటే పంచప్రాణాలు. అలాగే అన్నా చెల్లెళ్ళైన వైఎస్.జగన్, షర్మిలలకు కూడా ఒకరిపై ఒకరికి విపరీతమైన ప్రేమానురాగాలు. ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో ఒక్క పచ్చ మందకు తప్ప మిగిలిన ప్రజలందరికీ సుస్పష్టం. మరీ ముఖ్యంగా వైఎస్ కుటుంబాన్ని దగ్గర నుంచి చూసిన వారికైతే వైఎస్ కుటుంబసభ్యుల మధ్య ఎంత అన్యోన్యత ఉంటుందో అందరికీ బాగా తెలుసు. తెలంగాణ కోడలిగా, ఇక్కడే పుట్టి పెరిగిన బిడ్డగా వైఎస్ షర్మిల ఈ రాష్ట్రంలో తన రాజకీయ ప్రస్ధానం కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై తొలుత వైఎస్సార్సీపీ కొంత విముఖతతో ఉన్నా, షర్మిల అకుంఠిత దీక్షతో పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళండం చూసి ఆ పార్టీ కూడా గమ్మునుండిపోయింది. ఈ దశలో వైఎస్ విజయమ్మ తనకు తోడుగా ఉండాలని, తన రాజకీయపుటడుగుల్లో తనతో పాటు తన తల్లి కూడా నడవాలని షర్మిల కోరుకుంది. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యుల మధ్య ఆమె ప్రస్తావించడం కూడా జరిగింది. అయితే వైసీపీ ప్రారంభం నుంచి ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా విజయమ్మ కొనసాగుతుండంతో ఈ ప్రతిపాదనను తొలుత వైఎస్.జగన్ సున్నితంగా తిరస్కరించారు. కుమారుడిని ఎలాగైనా ఒప్పించి షర్మిల స్ధాపించిన వైఎస్సార్టీపీలో క్రియాశీలం అవుతానని గడచిన మూడు నెలలుగా విజయమ్మ జగన్మోహనరెడ్డిపై ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలి బాధ్యతల నుంచి తప్పుకుని షర్మిల రాజకీయ ప్రస్ధానంలో భాగస్వామి అవుతానని జగన్ ను పదే పదే కోరుతూ వస్తున్నారు విజయమ్మ. తెలంగాణలో రాజకీయాల పట్ల, అక్కడి ప్రజలకు తన తండ్రి వైఎస్సార్ పాలన అందించాలని చెల్లెలు షర్మిల చిత్తశుద్ధి చూసి జగన్ ఈ విషయంలో మౌనం వసించక తప్పలేదు. తన తోడబుట్టిన చెల్లెలి కోసం తల్లి కోరిన మాట ప్రకారం విజయమ్మ రాజీనామాకు జగన్మోహనరెడ్డి అయిష్టంగానే అంగీరించి ఉంటారు. కుటుంబ సభ్యులందరూ చర్చించి, అందరి పరస్పర అంగీకారంతో తీసుకున్న ఈ నిర్ణయాన్ని పచ్చ మీడియా, పచ్చ సైకో గ్యాంగులు వక్రీకరించి తప్పుడు ప్రచారం చెయ్యడం ప్రారంభించారు. అయితే వైఎస్సార్ కుటుంబం గురించి క్షుణ్ణంగా తెలిసిన రాష్ట్ర ప్రజలకు నిజానిజాలు ఏంటో స్పష్టంగా తెలుసు.
వైసీపీకి పెద్దదెబ్బ : శ్రవణ్‌కుమార్
వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ రాజీనామా వైసీపీ కి పెద్దదెబ్బ అని న్యాయవాది శ్రవణ్‌కుమార్ పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్ విజయం ప్రజలతో వచ్చింది కాదని, ఆయన గెలుపు వెనుక విజయమ్మ కష్టం ఉందని గుర్తు చేశారు. అధికారం, డబ్బు కోసం తల్లిని దూరం పెట్టడం దారుణమన్నారు. తల్లి, చెల్లికి అన్యాయం చేసినవాడు రాష్ట్రానికి ఏం మంచి చేస్తాడని శ్రవణ్‌కుమార్ ప్రశ్నించారు. అధికార పార్టీగా జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విలువలు, విశ్వసనీయత అని మాట్లాడే అర్హత జగన్ కోల్పోయారని తెలిపారు. వైఎస్సార్, విజయమ్మ ఫొటోలు పెట్టుకోకుండా జగన్ గెలవలేరని శ్రవణ్‌కుమార్ పేర్కొన్నారు.