సంస్కరణల పేరుతో పాఠశాలలను మూసేస్తామంటే ఎలాగని హైకోర్టు నిలదీసింది. జాతీయ విద్యావిధానమంటూ విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ఎలా చేపడతారని రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జీవో 117 విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా ఉందని పేర్కొంది. పాఠశాలల విలీనం కారణంగా చిన్నారులు 1 నుంచి 3 కిలోమీటర్ల దూరం వెళ్లి చదువుకోవలసి వస్తుందని పేర్కొంది. చిన్నారులను దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోమనడం సరికాదని వ్యాఖ్యానించింది. విద్యా హక్కు చట్టం మేరకు విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిని పాటిస్తున్నట్లు కనిపించడం లేదని అభిప్రాయపడింది. ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం మంచిదే అయినప్పటికీ తెలుగు మాధ్యమాన్ని తొలగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలని విద్యా హక్కు చట్టం చెబుతోందని గుర్తుచేసింది. ప్రభుత్వ వైఖరి చూస్తుంటే తెలుగు మాధ్యమంలో బోధనే లేకుండా చేసేటట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. సర్కారు చర్యలు విద్యా వ్యవస్థను బలపరిచేలా ఉండాలని.. నిర్వీర్యం చేసేలా ఉండకూడదని వ్యాఖ్యానించింది. ప్రస్తుత విధానం కొనసాగిస్తూనే సంస్కరణలు ప్రవేశపెట్టవచ్చని సలహా ఇచ్చింది.
ఒక దశలో జీవో అమలుపై స్టే విధించేందుకు సిద్ధపడింది. ప్రస్తుతం ఉన్న విధానానే కొనసాగించేలా యథాతథ స్థితి ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది. అడ్వకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ స్పందిస్తూ.. చట్టబద్ధమైన నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఈ వ్యాజ్యం రోస్టర్ ప్రకారం డివిజన్ బెంచ్ ముందు విచారణకు రావాలని తెలిపారు. ఆ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం, వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించడమే మంచిదని అభిప్రాయపడింది. వ్యాజ్యం తగిన బెంచ్ ముందు విచారణకు వచ్చేందుకు వీలుగా ఫైలును సీజే ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈమేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.గంగారావు ఆదేశాలిచ్చారు. జాతీయ విద్యావిధానం అమలు పేరుతో పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను రద్దు చేయాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు పి.సత్యవతి, మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు వచ్చింది.
ఏ ప్రాతిపదికన విలీనం చేస్తున్నారు ? : ఏపీటీఎఫ్
‘ప్రాథమిక పాఠశాలల విలీనానికి ప్రాతిపదిక ఏమిటో ప్రభుత్వం చెప్పాలి’’ అని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు, ఎస్.చిరంజీవి డిమాండ్ చేశారు. నూతన విద్యా సంవత్సరం ఇంత గందరగోళంగా గతంలో ఎప్పుడూ ప్రారంభం కాలేదన్నారు.
డీఈవో కార్యాలయాల ముట్టడికి ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య పిలుపు
పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల రేషనలైజేషన్ కోసం ప్రభుత్వం ఇచ్చిన జీవో 117ని వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమానికి సిద్ధమయ్యాయి. శుక్రవారం అన్ని ఉమ్మడి జిల్లాల డీఈవో కార్యాలయాలను ముట్టడించాలని నిర్ణయించాయి. ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) పిలుపునిచ్చింది. ఇదే అంశంపై ఫ్యాప్టో చైర్మన్ ఎన్.వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ సీహెచ్ మంజుల, నేతలు ఎల్.సాయి శ్రీనివాస్, ఎస్.చిరంజీవి విజయవాడలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ‘జాతీయ విద్యా విధానంలోగానీ, విద్యా హక్కు చట్టంలోగానీ ఎక్కడా ప్రాథమిక పాఠశాలలను విభజించాలని లేదు. కానీ ప్రభుత్వం ఇష్టానుసారంగా పాఠశాలలను విడగొడుతోంది. జీవో 117ను యథావిథిగా అమలుచేస్తే 24 వేల ఉపాధ్యాయ పోస్టులు మిగిలిపోతాయి. ఇప్పటికే ఉన్న ఖాళీలను కలిపితే మొత్తం 48 వేలు అవుతాయి. మొత్తంగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీల్లేవని చూపడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. తల్లిదండ్రులు నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. ఈ చర్యలను వ్యతిరేకిస్తూ డీఈవో కార్యాలయాలు ముట్టడిస్తున్నాం. ఉపాధ్యాయులంతా పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
స్కూళ్ల మూతకు పథకం: టీడీపీ
రాష్ట్రంలో 34 వేల ప్రభుత్వ స్కూళ్ల మూతకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ‘‘రాష్ట్రంలో ఇప్పుడు 45 వేల స్కూళ్లు ఉంటే వాటిని 11 వేలకు తేవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రేషనలైజేషన్ పేరుతో ఇప్పటికే రాష్ట్రంలో 10 వేల ప్రభుత్వ పాఠశాలలు మూసివేసి 3 కిలోమీటర్ల అవతల ఉన్న ఇతర స్కూళ్లలో కలిపారు. ప్రభుత్వ స్కూళ్లను మూయవ ద్దని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్లెక్కి ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. పేద వర్గాల పిల్లలు చదువు మానేసే దుస్థితి కల్పిస్తున్నారు. స్కూళ్ల మూతతో 10 వేల టీచర్ పోస్టులు రద్దయ్యాయి. ఎయిడెడ్ పాఠశాలల విలీనంతో మరో 10 వేల ఎస్జీటీ పోస్టులు రద్దయ్యాయి. మోడల్ స్కూళ్లలో టీజీటీ పోస్టులను ఎస్జీటీలుగా మార్చడం వల్ల 6 వేల పోస్టులు రద్దయ్యాయి. పోయిన ఏడాది, ఈ ఏడాది కలిపి మొత్తం 54 వేల పోస్టులను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది అని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్.రామకృష్ణ విమర్శించారు. విద్యా బోధనను పట్టించుకోకుండా ప్రచారానికి రూ.వందల కోట్లు ఖర్చు పెట్టడంపైనే ఈ ప్రభుత్వానికి ధ్యాస ఎక్కువైందని ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు.