భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టిందా? వచ్చే ఎన్నికల్లో తెలంగాణపై జెండా ఎగురవేయడానికి ప్రయత్నిస్తోందా? మరో తెలుగు రాష్ట్రం ఏపీని కూడా హస్తగతం చేసుకోవాలని భావిస్తోందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కేంద్రంలో రెండోసారి సునాయాసంగా అధికారంలోకి వచ్చిన బీజేపీకి దక్షిణాదిలో పట్టు దొరకకపోవడం మాత్రం మింగుడు పడని విషయం. ప్రధాని మోదీ, షా ద్వయం ఎంతలా ప్రయత్నిస్తున్నా వారి పాచిక పారడం లేదు. వ్యూహాలకు మాత్రం రాష్ట్రాలు చిక్కడం లేదు. అయితే తెలంగాణలో మాత్రం గతం కంటే పార్టీ బబోపేతం అయ్యింది. అక్కడ దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీకి ఒక ఊపు వచ్చిన మాట నిజం. అయితే వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే స్థితికి రాలేదు. అందుకు బీజేపీ శ్రేణులతో పాటు నాయకత్వం శ్రమిస్తోంది. టీఆర్ఎస్ పై గట్టి పోరాటమే చేస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి సత్ఫలితాలు వస్తాయని ఆశిస్తోంది. అయితే ఏపీ విషయానికి వచ్చే సరికి మాత్రం బీజేపీ ఆశించిన స్థాయిలో బలోపేతం కావడం లేదు. నాయకులు ఉన్నా పార్టీ మాత్రం క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లడం లేదు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ స్వతంత్రంగా పోటీచేసే పరిస్థితి లేదు. అటు జనసేనతోనే.. లేకుంటే జనసేన, టీడీపీలతోనే కలిసి పోటీ చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఏపీలో ఎన్నాళ్లు అయినా పార్టీ బలోపేతం కాకపోవడం కేంద్ర పెద్దలకు చిరాకు తెప్పిస్తోందన్న టాక్ నడుస్తోంది. అందుకే రాష్ట్ర నాయకత్వానికి పట్టించుకోవడం మానేశారన్న ప్రచారమైతే ఉంది. అందుకు తగ్గట్టుగానే రాష్ట్రంలో బీజేపీ నాయకులకు కనీస పరిగణలోకి తీసుకోవడం లేదు. అసలు పదవులు సైతం కేటాయించడం లేదు. అయితే బీజేపీ పెద్దల మనసులో ఏముందని మాత్రం బయటపడడం లేదు.
ఇప్పుడు తాజాగా ఒక ప్రచారం రాజకీయవర్గాల్లో గుప్పుమంటోంది. మహారాష్ట్ర తరహాలో ఒక ఎపిసోడ్ నడుపుతారని… ఆంధ్రాలో ఒక ఏక్ నాథ్ ఉన్నారని మాజీ ప్రభుత్వ విప్, టీడీపీ సీనియర్ నాయకుడు కూన రవికుమార్ బాంబు పేల్చారు. అయితే ఏపీ ఏక్ నాథ్ ఎవరబ్బా అన్న టాక్ ఏపీ సర్కిల్ లో ప్రారంభమైంది. ప్రధానంగా బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల ముందు బీజేపీ నేతలు బొత్స సత్యనారాయణకు టచ్ లోకి వెళ్లారని టాక్ నడిచింది. దీంతో ఇప్పుడు ఆయన పేరు ప్రస్తావనకు వస్తోంది. అయితే బొత్సకు అంత సీన్ లేదని అధికార పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో సీనియార్టీ, సామాజికవర్గ భేరీజు వేసుకొని జగన్ మంత్రి పదవి ఇచ్చారని గుర్తుచేస్తున్నారు. ఇక మిగిలింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే. అయితే ఆయన పార్టీలో నంబర్ టూ అన్న టాక్ ఎప్పటి నుంచో ఉంది.
పార్టీ ఆవిర్భావం నుంచే జగన్ వెంట కొనసాగుతున్నారు. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుకు చెందిన రామచంద్రారెడ్డికి జిల్లాతో పాటు రాయలసీమలో మంచి పట్టుంది. ఆయన కుమారుడు మిథున్ రెడ్డి ఎంపీగా కూడా కొనసాగుతున్నారు. మొన్న మంత్రివర్గ విస్తరణలో పెద్దిరెడ్డిని తప్పిస్తారని టాక్ నడిచింది. అయితే ఆయన జగన్ కు గట్టి అల్డిమేటం పంపడంతో వెనక్కి తగ్గారని టాక్ నడిచింది. ఆయన్ను తప్పిస్తే పార్టీలో చీలిక వచ్చే ప్రమాదముందని సంకేతాలు అందడంతో మంత్రిగా కొనసాగింపు ఇచ్చారని ప్రచారం జరిగింది. ఏట్ దీ సేమ్ టైమ్ ఆంధ్రాలో కూడా ఏక్ నాథ్ లు ఉన్నారంటూ వైసీపీ కీలక నేత సజ్జల రామక్రిష్ణారెడ్డి ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. అది పెద్దిరెడ్డిని ఊహించి చేసిన వ్యాఖ్యాలేనంటూ అనుమానాలు ప్రారంభమయ్యాయి. జగన్ కేంద్ర ప్రభుత్వంపై చూపుతున్న వీర విధేయతకు కారణం ఇదేనంటూ విపక్షాలు ఆరోపణలు ప్రారంభించాయి. కూన రవికుమార్ ఒక అడుగు ముందుకేసి ఏపీ ఏక్నాథ్ పెద్దిరెడ్డి అని ప్రకటించడంతో తేనె తుట్ట కదిలించినట్టయ్యింది.