ఆరోగ్యశ్రీ కార్డులపై ప్రధాని మోదీ చిత్రాలు లేకపోవడంపై కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రధానమంత్రికి ఫిర్యాదు చేస్తానని ఆమె హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ పథకం ఆయుష్మాన్ భారత్‌ను సమూలంగా మార్చి వేశారని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఏపీ పర్యటనకు వచ్చారు. విజయవాడలో వివిధ కార్యక్రమాల అమలు తీరును ఆమె పరిశీలించారు.కేంద్ర మంత్రి వెంట ఆరోగ్య శాఖ అధికారులతో పాటు ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడ ఉన్నారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో పర్యటిస్తున్న సమయంలో ఆమె అక్కడి బోర్డులను పరిశీలించారు. ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం బోర్డులు ఉన్నాయి కానీ.. పీఎం నరేంద్ర మోదీ ఫొటో లేదు. దీంతో ఆమె అసనానికి గురయ్యారు.
కేంద్ర మంత్రి ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలించడానికి వెళ్లారు. కానీ ఎక్కడా ఆమెకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోటో కనిపించలేదు. దీంతో అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతీ దానికి నిధులు ఇస్తూంటే.. కనీసం మోదీ ఫోటో కూడా పెట్టరా అని అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో స్కీమ్ అమలు చేస్తూ.. ప్రధాని ఫోటో ఎందుకు లేదని భారతి ప్రవీణ్ పవార్ .. రాష్ట్ర ఆరోగ్య శాఖ కమీషనర్ నివాస్‌ను నిలదీశారు. సెంట్రల్ స్కీమ్‌ను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణును కూడా కేంద్ర మంత్రి ప్రశ్నించారు. వారెవరూ పూర్తి స్థాయిలో సమాధానం చెప్పలేకపోయారు. నీళ్లు నమలడంతో వెరీ బ్యాడ్ ని ఆమె వ్యాఖ్యానించారు. తర్వాత గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లోని టెలిమెడిసిన్ హబ్ , ఆయుష్మాన్ భారత్ , ఈ సంజీవని హాస్పటల్ , జీనోమ్ సీక్వెన్సింగ్ లాబ్ లను ఆమె పరిశీలించారు. ఎక్కడా ప్రధానమంత్రి ఫోటో కనిపంచలేదు.
కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే పథకాలు అమలు చేస్తూ..కనీసం పేరు కూడా పెట్టడం లేదని.. మోదీ ఫోటో కూడా చూపించడం లేదని బీజేపీ నేతలు ఇటీవలి కాలంలో పలుమార్లు ఆరోపణలు చేశారు.కేంద్రానికి కూడా ఫిర్యాదులు చేశారు. ఈ కారణంగా రైతు భరోసా కేంద్రాల పేర్లను కూడా మార్చాలని ఇటీవల ప్రభుత్వానికి ఆదేశాలు వచ్చాయి. రైతు భరోసా పథకం కింద ఇస్తున్న నిధుల్లో కేంద్రం వాటా కూడా ఉండటంతో … ఆ పథకం చివర పీఎం కిసాన్ అని చేర్చారు. అయితే చాలా వరకూ కేంద్ర పథకాల్లో ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్ అనే ఫోటో ఉండదు. ఇటీవల రైతులకు పంపిణీ చేసిన ట్రాక్టర్లు.. యాంత్రీకరణ పరికరాలకు కూడా కేంద్ర ప్రభుత్వమే నిధులిస్తోందని.. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని బీజేపీ నేతలు విమర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు కేంద్ర మంత్రి కూడా అదే రకంగా వ్యాఖ్యానించారు.
తొలుత కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ బెజవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.ఈవో, అర్చకులు ఆలయ మర్యాదలతో ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఈవో భ్రమరాంబ అమ్మవారి ఫోటో, లడ్డు ప్రసాదం అందజేశారు.