ఆగష్టు 5 న తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు జెఈఓ వీరబ్రహ్మం తెలిపారు. వరలక్ష్మీ వ్రతం ఏర్పాట్లపై జేఈఓ తిరుచానూరులోని ఆస్థాన మండపంలో అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. వరలక్ష్మి వ్రతంలో పాల్గొనే భక్తులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, ప్రత్యేక క్యూ లైన్ లు ఏర్పాటుచేస్తామని, జేఈవో తెలిపారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు.
వర్చువల్ గా కూడా పాల్గొనే అవకాశం
వరలక్ష్మీ వ్రతం చేసుకునే భక్తులు నేరుగా, వర్చువల్ గా వ్రతంలో పాల్గొనేందుకు ఆన్ లైన్ లో కూడా టికెట్లు జారీ చేస్తామన్నారు. తిరుచానూరు అమ్మవారి ఆలయం ఆస్థాన మండపంలో వివిధ రకాల పుష్పాలంకరణలతో పాటు, విద్యుత్ అలంకరణలతో కూడా సర్వాంగ సుందరంగా అలంకరిస్తామన్నారు. ఆగస్టు 5 ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు జరిగే వరలక్ష్మీ వ్రతాన్ని, ఎస్ విబిసి భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తామన్నారు. భక్తులు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని అమ్మవారి కరుణాకటాక్షాలు పొందాలని జేఈవో ఆకాంక్షించారు.. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.