పట్టణ సంస్కరణలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీంతో పేద, మధ్య తరగతి వారి పరిస్థితి రోజురోజుకి దయనీయంగా మారింది. ఆస్తి పన్నులు పెంచటం చెత్త పన్నులు కరంట్ చార్జీలు పెంచటం. దీనికి తోడు నిత్యావసరాల వస్తువులు ఆకాశాన్ని తాకటంతో పేద వాడి పరిస్థితి దినదిన గండం నూరేళ్ళ ఆయుష్షులా మారింది. పట్టణ సంస్కరణల పేరుతో ఆస్తి పన్ను చెత్త పన్ను పెంచేందుకు కొత్తగా ఎన్నికైన పంచాయితీలు మున్సిపాలిటీలు తీర్మానాలు చేసాయి. జీవో నెంబర్. 198 ప్రకారం ఆస్తి విలువ ఆధారంగా పన్ను నిర్ణయించాలని అన్ని మున్సిపాలిటీలకు నోటిఫికేషన్స్ జారీ చేసారు. ఐతే ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు ౩ కోట్ల మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. వీరందరి మీద ఇప్పుడు అదనపు భారం పడి ఏం చేయాలో తెలియని పరిస్థితి పట్టణ సంస్కరణలకు పన్నులు ఒకటే మార్గమా అనే ప్రశ్న ఇప్పుడు అందరిలో తలెత్తుతుంది వాస్తవానికి పట్టణీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నా అభివృద్ధి చేయాలన్నా ప్రభుత్వ ప్రణాళిక కేవలం ప్రభత్వం వసూలు చేసే పన్నుల మీద ఆధార పడి ఉండకూడదు మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి దాని నుండి ఆదాయ మార్గాల అన్వేషణ చేయవచ్చు తద్వారా ప్రజలపై భారాన్ని తగ్గించవచ్చు కానీ వాటిపై శ్రద్ద పెట్టకపోగా ప్రజలపై భారం మోపటం ఒక్కటే ప్రభుత్వ తక్షణ కర్తవ్యంలా ఉంది ఈ పట్టణ భారాలను ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ముక్తకంఠంతో వ్యతిరేకిస్తుంది.
ఏపీలో ఆస్తి పన్ను ఎంత పెరిగింది ?
ఏపీలో 15 మునిసిపల్ కార్పోరేషన్లు, 76 మునిసిపాలిటీలు, 31 నగర పాలక సంస్థలున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 2,82,18,075 మంది అంటే ఏపీ జనాభాలో 33.36 శాతం మంది పట్టణాల్లో ఉన్నారు. ఇటీవల ఈ సంఖ్య పెరగడంతో పట్టణ జనాభా సుమారుగా 3 కోట్లు దాటి ఉంటుందని అంచనా.ఇంత పెద్ద సంఖ్యలో పట్టణ జనాభా పెరుగుదల పట్టణీకరణకు సంకేతంగా చెప్పుకోవచ్చు పట్టణాల్లో పరిశ్రమలు వ్యాపార ఉపాధి హామీ ఉండటం తో గ్రామ ప్రజానీకం పట్టణాలకు తరలివెళ్తుంది ఐతే పట్టణ ప్రాంతాల్లో భూమి, భవనాలకు సంబంధించి వసూలు చేసే ఆస్తి పన్నును చెల్లించే కుటుంబాల సంఖ్య సుమారు కోటి వరకు ఉంటుందని అంచనా. మునిసిపల్ అధికారుల లెక్కలు రమారమీ ఇలాగే ఉన్నాయి. అర్బన్ ప్రాంత పాలక మండళ్ల పరిధిలో ప్రస్తుతం పదేళ్ల కిందట నిర్ణయించిన ఆస్తి పన్ను అమలవుతోంది. మధ్యలో కొన్నిసార్లు మంచినీటి కుళాయి పన్ను సహా వివిధ పన్నులు సవరించారు. కానీ ఆస్తి పన్నుల్లో మార్పులు జరగలేదు.
ప్రస్తుతం ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఆస్తి పన్ను పెంపుదల నిర్ణయం తీసుకుంది. వాటిని ఈ ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేస్తూ జీవో కూడా విడుదల చేసింది. వాటి ప్రకారం నివాస గృహాల ఆస్తి విలువపై 0.15 శాతం, వాణిజ్య సంస్థలు, నివాసేతర భవనాలపై 0.3 శాతం, ఖాళీ స్థలాలపై 0.5 శాతం పన్ను వేస్తారు. ఈ పన్ను శాతాలు కూడా ఈ సంవత్సరానికి పరిమితం. వచ్చే సంవత్సరం వాటిని సవరించే అవకాశం ఉంది. గతంలో ఉన్న విధానం కాకుండా ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. మొన్నటి వరకూ అద్దె విలువను బట్టి ఇంటిపన్ను విధించేవారు. ఇకపై రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నిర్ణయించే భూముల విలువలు, కట్టడం విలువల ఆధారంగా ఇంటి పన్నులు వసూలు చేసేలా మార్పు చేశారు. దాంతో ఆస్తి విలువ పెరుగుతున్న కొద్దీ పన్నులు పెరిగే అవకాశం ఉంటుంది ఇళ్ల నుండి వచ్చే ఆదాయాన్ని బట్టి అస్తి పన్ను నిర్ణయించినా ఒక అర్ధం ఉంటుంది కానీ ఆస్తి విలువ ఆధారంగా ఆస్తి పన్ను వేయటం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు పూర్వీకుల నుండి కొంత ఆస్తులు రావచ్చు దాని నుండి ఏం ఆదాయం లేకపోవచ్చు పేరుకి మాత్రం ఆస్తులున్నా వారికీ ఎటువంటి ఆదాయం వాటి నుండి రాకపోవచ్చు మరి అలాంటివాళ్ళు పూర్వీకుల నుండి వచ్చే ఆస్తులను అమ్ముకోవాలా అని ప్రజానీకం ప్రశ్నిస్తున్నారు.
చెత్తకు యూజర్ చార్జీల మోత !
పట్టణ ప్రాంతంలో ప్రజలు పొందే అన్ని సేవలకు యూజర్ ఛార్జీలు చెల్లించాలనే పేరుతో మునిసిపల్ సిబ్బంది చెత్త సేకరణపై కూడా పన్ను విధించే ప్రతిపాదన వచ్చింది. ప్రభుత్వం ప్రయత్నించినా ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో అప్పట్లో విరమించుకున్నారు. జగన్ ప్రభుత్వం మాత్రం చెత్త సేకరణపై పన్ను విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. దానికి అనుగుణంగా కొన్ని మునిసిపల్ కౌన్సిల్ సమావేశాల్లో తీర్మానాలు చేస్తున్నారు.చెత్తను తరలించడానికి అయ్యే ఖర్చును ప్రభుత్వం ప్రజల నుండి వసూలు చేసేటట్టయితే సంక్షేమ పాలన అని గొప్పలు చెప్పటం దేనికి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాలు ప్రజల భారాన్ని తగ్గించాలికాని పెంచటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు మౌలిక సదుపాయాల మీద ప్రభుత్వ ఆస్తులమీద ఆదాయాన్ని ప్రభుత్వం పెంచుకోవాలి కానీ సామాన్య ప్రజానీకం పై పన్నులు వేయటం దుర్మార్గమని ప్రజలు నినదిస్తున్నారు.
కరెంట్ చార్జీల పెంపు – ప్రజలకు ముప్పు
విద్యుత్ ఛార్జీల పెంపు పై సామాన్యులు, ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు అమ్మో ఈ బాదుడు ఏంటి అని భయపడుతున్నారు. అంతేకాదు ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బాదుడే.. బాదుడు అంటూ అప్పటి ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇప్పుడు సీఎం జగన్ ఆధ్వర్యంలో భారీగా చార్జీల మోత మోగింది. ప్రతిపక్షాలు కరెంట్ చార్జీలు తగ్గించాలని ఇప్పటికే ఆందోళన బాటపట్టాయి. ప్రస్తుతం పెరిగిన ధరలు చూస్తుంటే.. స్విచ్ ముట్టకుండానే విద్యుత్ షాక్ కొట్టేలా తయారైంది ఐతే ఏపీలో విద్యుత్ వినియోగం పెరిగిందని ప్రభుత్వం అభిప్రాయపడింది ప్రస్తుతం ఏపీ విద్యుత్ వాడకం చాలా అధికమౌతోందని, బొగ్గు ధరలు పెరగడం.. బొగ్గు ట్రాన్స్ పోర్టు ఖర్చు కారణంగా విద్యుత్ ఉత్పత్తి వ్యయం పెరిగిపోతుందని అందుకే తప్పని సరి పరిస్థితుల్లో విద్యుత్ చార్జీలు పెంచడం జరిగిందని ప్రభుత్వం వాదిస్తోంది 2022 – 23లో రూ. 2100 కోట్లు మాత్రమే ప్రజలపై భారం పడుతుందని అధికారులు వెల్లడించారు. బోగ్గు ధరలు పెరగడం, బొగ్గు రవాణా ఖర్చులు పెరగడంతో చార్జీలు పెంచాల్సి వచ్చిందని ప్రభుత్వం చెప్తుంది ఏడాదికి 14 శాతం ఇన్పుట్ రేటు పెరగడంతో స్వల్పంగా రేట్లు పెంచాల్సి వచ్చినట్లు, యూనిట్ విద్యుత్ 6.98 రూపాయలు పడుతుందని ప్రభుత్వం చెప్తోంది వాస్తవానికి ప్రభుత్వ విధానాల్లో నిజం ఉన్నాలేకున్నా ప్రజలకు సంక్షేమం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అంతేకాకుండా వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతా అనటం ప్రభుత్వ అనాలోచిత చర్యగా ప్రజలు భావిస్తున్నారు ప్రభుత్వం ఇలాంటి కుంటి సాకులు ఆపి ప్రజల పరిస్థితి అర్ధం చేసుకోవాలని ఇప్పటికే కరోనా పరిస్థితుల్లో సామాన్య ప్రజల కుటుంబాలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయని ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోతే ఆందోళన బాటపడతామని ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్నాయి.