హిందూ ధర్మ ప్రచారం, వేద పరిరక్షణ కోసం టీటీడీ విశేష కృషి చేస్తోందని టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి చెప్పారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు వసతుల కల్పన, శీఘ్ర దర్శనం కోసం నిరంతరం చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. హిందువుల ఆధ్యాత్మిక రాజధాని అయిన తిరుమల పట్ల, టీటీడీ పట్ల భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత మీడియా మీద కూడా ఉందని చెప్పారు. తిరుపతిలోని శ్వేత భవనంలో టీటీడీ కార్యక్రమాలపై మీడియా ప్రతినిధులకు నిర్వహిస్తున్న రెండు రోజుల వర్క్ షాప్ సోమవారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈవో శ్రీ ధర్మారెడ్డి మీడియా ప్రతినిధులనుద్దేశించి మాట్లాడారు. గత మూడేళ్ళుగా టీటీడీ హిందూ ధర్మ వ్యాప్తి, పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఆయన తెలిపారు. కొంతమంది వ్యక్తులు తమ ప్రచారం కోసం టీటీడీ మీద చేసే విమర్శలు సద్విమర్శలా కాదా అని ఆలోచించాకే టీటీడీ వివరణతో ప్రచురించాలని కోరారు. టీటీడీ లాంటి వ్యవస్థను అత్యున్నతంగా తీర్చిదిద్ది, భవిష్యత్ తరాలవారికి మరింత ఉన్నతంగా అందించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. టీటీడీ భక్తుల విశ్వాసం మీదే నడుస్తోందని, దీన్ని కాపాడాల్సిన బాధ్యత టీటీడీ అధికారులు, ఉద్యోగులతో పాటు మీడియా మీద కూడా ఉందని ఈవో చెప్పారు. ఆయన టీటీడీ నిర్వహిస్తున్న పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర సామాజిక సేవా కార్యక్రమాల గురించి వివరించారు. జెఈవో వీర బ్రహ్మం మాట్లాడుతూ, టీటీడీ భగవంతుడు నడిపిస్తున్న సంస్థ అన్నారు. ఇక్కడ ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించే తీరుతారని చెప్పారు. సివి ఎస్వో నరసింహ కిషోర్ టీటీడీ లో నిఘా, భద్రత విభాగం పనితీరు, అధికారుల విధులు, బాధ్యతలు గురించి వివరించారు. ఈ విభాగంలో 3019 మంది అధికారులు, ఉద్యోగులు పనిచేస్తున్నారని, ఇంత పెద్ద వ్యవస్థ లో ఎక్కడైనా పొరబాట్లు జరిగితే తమ దృష్టికి తెస్తే సరిచేసుకుంటామన్నారు. కోవిడ్ అనంతరం సొంత వాహనాల్లో తిరుమల కు వస్తున్న భక్తుల సంఖ్య చాలా పెరిగిందన్నారు. భక్తుల భద్రత, క్యూ లైన్ల నిర్వహణ, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లు, శ్రీవారి ఆలయంలో జరిగే భద్రత ఏర్పాట్లు, తనిఖీలు ఎలా ఉంటాయో విపులంగా తెలియజేశారు. తిరుమల లో తప్పి పోయిన పిల్లలను వెదికి తల్లిదండ్రులు, వారి కుటుంబీకులకు అప్పగించడంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎంతో చక్కగా పని చేస్తోందని సంతృప్తి వ్యక్తం చేశారు.
రాబోయే రోజుల్లో తిరుమల ఔటర్ కారిడార్ ను సిసి కెమెరాలు ఏర్పాటు చేసి విజిలెన్స్ కంట్రోల్ లోకి తీసుకునే ఆలోచన చేస్తున్నామన్నారు. అలాగే ఘాట్ రోడ్లల్లో సిసి కెమెరాల ఏర్పాటు, అగ్నిప్రమాదాల నివారణకు శ్రీవారి ఆలయం, పోటు, నెయ్యి ట్యాంక్ లు, గ్యాస్ పైప్ లైన్ ల వద్ద నైట్రోజన్ లిక్విడ్ కార్పెట్స్ ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందన్నారు. ఆభరణాల రవాణాకు బులెట్ ప్రూఫ్ వాహనాలు, బాంబ్ డిస్పోజల్ సూట్స్, స్పీడ్ గన్స్, స్పీడ్ రికార్డింగ్ కెమెరాల ఏర్పాటు వంటి ప్రతిపాదనలు కూడా ఉన్నాయన్నారు. శ్రీవారి ఆలయ పరిధి విస్తరించే అవకాశం లేనందున ఉన్నంతలో ఎక్కువ మంది భక్తులకు స్వామి వారి దర్శనం ఎలా కల్పించాలనే విషయం మీద పరిశోధన జరగాల్సిన అవసరం ఉందని శ్రీ నరసింహ కిషోర్ చెప్పారు. ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామ్స్ ఆఫీసర్ శ్రీ విజయ సారధి టీటీడీ అమలు చేస్తున్న ధార్మిక కార్యక్రమాల గురించి వివరించారు. మనిషి శరీరంలో గుండెకు, శ్వాస కు ఉన్నంత ప్రాధాన్యం టీటీడీ లో ధర్మ ప్రచారానికి ఉందన్నారు.గుడికో గోమాత, కళ్యాణమస్తు, అర్చక శిక్షణ, ఎస్సీ, ఎస్టీ, బిసి కాలనీలు, గ్రామాల్లో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిర్మించిన ఆలయాలు, అందులో ఇప్పటికే పని చేస్తున్న వారికి ఇస్తున్న అర్చక శిక్షణ గురించి తెలియజేశారు. భజన మండళ్లు, ప్రాజెక్టుల లక్ష్యాలు, వాటిప్రగతి, విద్యార్థి దశ నుంచి పిల్లల్లో ఆధ్యాత్మిక, నైతికత పెంపొందించేందుకు చేస్తున్న కార్యక్రమాల గురించి చెప్పారు. డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్ర నాథ్ శ్రీవారి ఆలయ నిర్వహణ, దిన, వార, పక్ష, మాస, వార్షిక ఉత్సవాలు, సేవల గురించి తెలిపారు. ప్రసాదాల తయారీ, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లు, ఆలయంలో రద్దీ నిర్వహణ అంశాలు వివరించారు. శ్రీవారి కి ఏ ఉత్సవంలో ఏ ఆభరణాలు అలంకరిస్తారు, వాటిని ఎలా భద్ర పరుస్తారో తెలిపారు.