- భూ సర్వే ముగిసాక కూడా ట్రిబ్యునళ్ల కొనసాగింపు
- శాశ్వత ప్రాతిపదికన రెవిన్యూ డివిజన్స్ లో ట్రిబ్యునల్స్
- సమగ్ర సర్వే అప్పీళ్ల థర్డ్ పార్టీ పర్యవేక్షణ ఉండాల్సిందే
భూ వివాదాల నేపథ్యంలో శాశ్వత పరిష్కారం కోసం ఏపీ సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. లంచాలు ఇచ్చే వ్యవస్థకు బై బై చెప్పేసి జవాబుదారీతనాన్ని పెంపొందించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. భూ వివాదాల పరిష్కారం తర్వాత కూడా ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్స్ ను సర్వే తర్వాత కూడా కంటిన్యూ చేయాలనీ అధికారులను ఆదేశించారు. భూముల రీసర్వే టైంలో ఎదురయ్యే సమస్యలు వాటి పరిష్కారాల కోసం ఏర్పాటయ్యే మొబైల్ ట్రిబ్యునళ్లను ఆ తరువాత కూడా రెవెన్యూ డివిజన్లలో పూర్తి స్థాయిలో కొనసాగించాలని సూచించారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో భూవివాదాల పరిష్కారం కోసం శాశ్వత ప్రాతిపదికన ట్రిబ్యునళ్లను ఏర్పాటుచేసేందుకు సన్నద్ధమయ్యారు. జగనన్న శాశ్వత భూ-హక్కు, భూరక్ష పథకంపై ఆయన నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రతి మండలంలో ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేసి శాశ్వత ప్రాతిపదికన నిర్వహించాలని ఆఫీసర్స్ ని కోరారు. భూములను సర్వే చేసే టైంలో ఎదురయ్యే భూ వివాదాలను పరిష్కరించడానికి సరైన టీమ్ ఉండాలని గట్టిగా చెప్పారు. ప్రజలు తమ భూమిపై ఉండే మొత్తం హక్కులను సాధించుకోవడానికి ఈ ట్రిబ్యునల్స్ ఉపయోగపడాలన్నారు. సర్వే నంబర్ల ప్రకారం భూమికి సంబంధించిన వివరాలు అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయో లేదో పరిశీలించాలని అధికారులకు వివరించారు. భూ-హక్కుదారుల క్లెయిమ్ చేసుకున్నప్పుడు వివరాలను పారదర్శకంగా ఉండేలా చూసుకోవాలన్నారు. తప్పు చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
భూమి హక్కుదారు ఎప్పుడు దరఖాస్తు చేసుకుంటే అప్పుడే సర్వే చేయాలన్నారు. మునిసిపాలిటీలు, కార్పొరేషన్స్ లో సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. నెలకు 1000 గ్రామాలను ఇప్పటికే కవర్ చేస్తున్నాం, సెప్టెంబర్ 2023 నాటికి మొత్తం సర్వేను పూర్తి చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సర్వేలన్నీ పూర్తయ్యేలోపు గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలను అందుబాటులోకి తేవాలని, రిజిస్ట్రేషన్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించడానికి వీలుగా ఎక్కువ మొత్తంలో డమ్మి డాకుమెంట్స్ ని అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. భూ హక్కుదారుల సమక్షంలో డ్రోన్ల సాయంతో వ్యవసాయ భూములను సర్వే నంబర్ల ప్రకారం కొలిచి వారి సమక్షంలోనే పట్టాలను జారీ చేశాకే సర్వే టీములు ముందుకెళ్తాయన్నారు. రికార్డులు సవరించే టైంలో ఈ వివరాలన్నీ ఉపయోగపడతాయని అధికారులు పేర్కొంటున్నారు. అలాగే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ని అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో పోస్టర్ల ద్వారా ప్రదర్శించాలన్నారు.