కన్నతల్లి కళ్ల ఎదుటే మరణిస్తే అది ఎంత బాధాకరం చెప్పనక్కర్లేదు. అలాంటిది కళ్లెదుటే చనిపోయిన కన్నతల్లి శవాన్ని ఇంటి వరకు తీసుకెళ్లేందుకు అంబులెన్స్ లేక ఓ యువకుడు పడిన అవస్థ, ఆవేదనతో కూడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తల్లి మృతదేహంతో 80 కిలోమీటర్లు ప్రయాణించిన ఈ అమానవీయ ఘటన నెటిజన్ల మనస్సును కదిలించింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని షాడోల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఉన్న అనుప్పూర్ జిల్లాకు చెందిన జైమంత్రి యాదవ్ కొద్ది రోజుల కిందట ఛాతినొప్పి రావడంతో అనప్పూర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. ఆమె పరిస్థితి రోజురోజుకూ క్షీణించడంతో అనప్పూర్ జిల్లా ఆస్పత్రి అధికారులు షాడోల్ జిల్లాలోని మెడికల్ కాలేజీ కమ్ డిస్ట్రిక్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతున్న జైమంత్రి సోమవారం కన్నుమూసింది.
Video: Sons carry mother's dead body on motorcycle in Madhya Pradesh https://t.co/QH7wEtLLD4 pic.twitter.com/lpyRlt30Ce
— The Times Of India (@timesofindia) August 1, 2022
తల్లి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్, మార్చురీ వాహనం కోసం ఆస్పత్రి వర్గాలను అడిగితే అందుబాటులో లేవని చెప్పారని కొడుకు సుందర్ యాదవ్ చెప్పాడు. దాంతో ప్రైవేట్ వాహనం కోసం ప్రయత్నిస్తే వాళ్లు రూ.5 వేలు అడగడంతో అంత డబ్బుల్లేక ఇలా బైక్‌పై కట్టుకుని వెళ్లాల్సి వచ్చిందని సుందర్ కన్నీటి పర్యంతమయ్యాడు. మధ్యప్రదేశ్‌లో అంబులెన్స్‌లు అందుబాటులో లేక ఇలా మృతదేహాలను తీసుకెళ్లడం ఇదే మొదటిసారేమీ కాదు. జులై 11న గుణ జిల్లాలో ప్రభుత్వ అంబులెన్స్‌లు దొరక్క ఒక ఎనిమిదేళ్ల బాలుడు తన తమ్ముడి శవంతో రోడ్డుపైనే కూర్చొన్న వీడియో ఒకటి వైరల్ అయింది. ఆ సమయంలో స్పందించిన పోలీసులు మృతదేహాన్ని వారి స్వగ్రామానికి తరలించే ప్రయత్నం చేశారు.