ముందు ప్రభుత్వం చేసిన అప్పులనే అప్పులుగా చూపించారు. మరి కార్పొరేషన్ల అప్పులు కూడా అప్పులే అన్నారే గాని.. లెక్కల్లో కలపలేదు. మామూలుగా జనానికి ఈ లెక్కలవీ పెద్దగా అర్ధం కావు. ఎందుకంటే మన క్లాజులు, రూల్స్ అంత గజిబిజిగా ఉంటాయి. అయినా గాని కార్పొరేషన్ల అప్పులు కేంద్రం కూడా పట్టించుకోనట్లే కనపడింది. ఇక్కడ మనం అర్ధం చేసుకోవాల్సింది ఏంటంటే… రాష్ట్రం అప్పులు చేయాలంటే ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితి దాటి అప్పులు చేయాలంటే కేంద్రం అనుమతి తీసుకోవాలి. ఇక్కడ రెండు విషయాలు జరిగాయి. ఒకటి పరిమితి దాటి అప్పులు తీసుకోవడం జరిగిపోయింది. దానికి కేంద్రం అనుమతి ఇవ్వడం కూడా జరిగిపోయింది. ఎలా అంటే కేంద్రం విద్యుత్ మీటర్లు పొలాల్లో కూడా పెట్టాలన్న సంస్కరణలను ఆమోదిస్తే ఓకె అంది. అలాగే ప్రభుత్వోద్యోగులకు సంబంధించిన సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) అమలు చేస్తే మళ్లీ ఓకె చెప్పింది.
ఒకవైపు కేంద్రం నుంచి ఇలా లాగేస్తూనే.. వైసీపీ ప్రభుత్వం మరో తెలివైన ప్లాన్ వేసింది. అదేంటంటే.. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి.. వాటి పేరుతో లోన్లు తీసుకున్నారు. ఆ లెక్కలు ప్రభుత్వ అప్పుల లెక్కల్లో కలపలేదు. దీంతో పరిమితి దాటినా.. దాటనట్లే నటించారు. అన్నీ తెలిసినా కేంద్రం కూడా దాగుడుమూతలాడినట్లు అర్ధమవుతోంది. ఇవన్నీ చర్చ నడుస్తుండగానే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఒక ప్రశ్న వేశారు. ఈ అప్పుల వివరాలు చెప్పాలని అడిగారు. పాపం కేంద్రం నుంచి మొన్న చెప్పినట్లే సమాధానం వస్తుందని ఆశించారు. కాని కేంద్రం రివర్స్ అయింది. కేంద్ర ఆర్ధిక సహాయమంత్రి భగవత్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న రుణాలు కూడా ప్రభుత్వ రుణాలే అవుతాయని చెప్పారు. గత మార్చిలోనే ఈ విషయం రాతపూర్వకంగా తెలియచేశామని గుర్తు చేశారు. అంతే కాదు కార్పొరేషన్లకు లోన్లు ఇచ్చిన బ్యాంకులు కూడా సరిగా వ్యవహరించలేదని ఆర్బీఐ నివేదిక అడిగిన విషయం కూడా నిజమే అని తేల్చి చెప్పారు.
దీంతో విజయసాయిరెడ్డి వ్యూహం తలకిందులైంది. తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పత్రికలు రాసిన కథనాలు అబద్దాలని చెప్పించడానికి ఈ ప్రశ్న వేసిన ఎంపీ.. వచ్చిన సమాధానంతో షాకయ్యారు. అయితే ఇక్కడ అందరికీ అర్ధం కాని విషయం ఏమంటే.. పరిమితి దాటి రుణాలు తీసుకోకూడదని వార్నింగ్ ఇస్తున్నారు.. తీసుకున్నారని కూడా చెబుతున్నారు.. మరి రూల్స్ అతిక్రమిస్తే యాక్షన్ ఏముంటుంది.. అని అడుగుతున్నారు. అంతే కాదు.. బ్యాంకులు రూల్స్ వయిలెట్ చేసి కార్పొరేషన్లకు లోన్లు ఇచ్చింది అంటున్నారు.. మరి యాక్షన్ ఏంటి? కేవలం వార్నింగులిస్తూ ఉంటే.. పనవుతుందా? అసలే కోర్టు తీర్పులను లెక్క చేయనివారు ఉన్నారని..అలాంటివారు ఇలాంటి వార్నింగులను ఎందుకు పట్టించుకుంటారని తెలుగుదేశం వారు మండిపడుతున్నారు.