ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు వెలువడుతున్నా నేపధ్యంలో ఎన్నికలు ఎప్పుడొచ్చిన సిద్ధంగా ఉన్నట్టు అన్ని రాజకీయ పక్షాలు సంకేతాలు పంపుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన నిర్ణయాలు ప్రధాన విపక్షం టీడీపీని డిఫెన్స్ లో పడేశాయి. వైసీపీ ప్రభుత్వ మానస పుత్రిక అయిన వలంటీరు వ్యవస్థపై ఈసీ కొరడా ఝుళిపించింది. దీంతో అధికార పార్టీ నేతల నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టయ్యింది. టీడీపీ ఈసీ షాకిచ్చింది. టీడీపీ ప్రాంతీయ పార్టీయే తప్ప జాతీయ పార్టీ కాదని ప్రకటించింది. జాతీయ పార్టీ హోదా జాబితా నుంచి టీడీపీని తొలగించింది.
టీడీపీకి పోయిన జాతీయ హోదా..
మరోవైపు కేంద్ర ఎన్నికల కమిషన్ జాతీయ పార్టీలను ప్రకటించింది. దేశంలో 7 జాతీయ పార్టీలు, 57 ప్రాంతీయ పార్టీలు ఉన్నట్టు తేల్చింది. ఇందులో బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, నేషనల్ పిపుల్స్ తదితర పార్టీలకు జాతీయ పార్టీల జాబితాలో చోటు దక్కింది. అయితే ఇన్నాళ్లూ టీడీపీ జాతీయ పార్టీ జాబితాలో ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొనసాగేది. జాతీయ పార్టీగా చెప్పుకునేది. అందుకే చంద్రబాబు జాతీయ పార్టీ అధ్యక్షుడి హోదాలో ఉండేవారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా అధ్యక్షులను నియమించేవారు. కానీ నిబంధనల ప్రకారం తెలంగాణాలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేకపోవడంతో ఈసీ జాతీయ హోదాను రద్దు చేసింది.
జాతీయ పార్టీ స్థాపించడానికి అర్హతలేమిటి…
జాతీయ పార్టీ స్థాపించడానికి కావాల్సిన అర్హతలు ఏమిటి? విధి విధానాలేమిటి? ఒక పార్టీని జాతీయ పార్టీగా ఎలా గుర్తిస్తారు. భారత్‌లో బహుళ పార్టీల రాజకీయ వ్యవస్థ అమల్లో ఉంది. అంటే దేశంలో ఎన్ని పార్టీలైనా ఉండొచ్చు. అలాగే, ఈ పార్టీలను జాతీయ, ప్రాంతీయ పార్టీలుగా ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అయితే, ఇవే కాకుండా ఎన్నికల సంఘంలో నమోదు చేసుకున్న రిజిస్టర్డ్ పార్టీలు కూడా ఉంటాయి. ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధన -1968 ప్రకారం ( ఈ నిబంధనను కాలానుగుణంగా మార్చుతున్నారు) చివరగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానాల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అభ్యర్థులు పోటీ చేయాలి. ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధించాలి. దీనితోపాటు ఏదైనా ఒక రాష్ట్రం లేదా రాష్ట్రాల నుంచి కనీసం నలుగురు అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికవ్వాలి లేదా కనీసం నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలి. గత సాధారణ ఎన్నికల్లో లోక్‌సభలోని మొత్తం సీట్లలో కనీసం రెండు శాతం సీట్లను గెలుచుకొని ఉండాలి. గెలుపొందిన అభ్యర్థులు మూడు రాష్ట్రాల నుంచి ఎన్నికవ్వాలి. ప్రస్తుతం దేశంలో 7 జాతీయ పార్టీలు ఉన్నాయి.. 1. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 2. భారతీయ జనతా పార్టీ 3. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా – సీపీఐ 4. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) – సీపీఎం 5. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ 6. బహుజన్ సమాజ్ పార్టీ 7. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీలుగా ఉన్నాయి.