టీడీపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఏపీ రాజకీయాలు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాయి. 2019లో రెండు పార్టీల అనుభవాలతో..ఈ సారి ఎన్నికలకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా ఎన్డీఏకు వైసీపీ అనధికారిక మిత్రపక్షం గా వ్యవహరిస్తున్న వేళ..టీడీపీ సైతం అదే బాట పట్టింది. ఎన్డీఏ కోరకపోయినా..వారికి మద్దతు ఇచ్చేందుకు..టీడీపీ వారితోనే ఉంటుందనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా.. టీడీపీ తమంతట తామే ముందుకొచ్చి రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధికి మద్దతు ప్రకటించింది. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ తమ వైఖరి స్పష్టం చేసింది.
ఎన్డీఏ అభ్యర్ధికే తమ మద్దతు అని తేల్చి చెప్పింది. ఢిల్లీలోని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి నివాసంలో టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు… జగ్‌దీప్ ధనకర్‌ను కలిశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగ్‌దీప్ ధనకర్కు పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఇప్పటికే వైసీపీ ఎంపీలు సైతం ధనకర్ ను కలిసి తమ మద్దతు ప్రకటించారు. అదే తరహాలో ఇప్పుడు టీడీపీకి చెందిన నలుగురు పార్లమెంట్ సభ్యులు ఆయన్ను కలిసారు. ఇదే సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ప్రహ్లాద్ జోషి నివాసంలోనే ఉన్నారు. టీడీపీ ఎంపీలు ఆయన్ను కలిసారు.తాము ధనకర్ కు మద్దతు ఇస్తున్నట్లు అమిత్ షా తోనూ చెప్పుకొచ్చారు.
ఇక, ఎన్డీఏకు తాము మద్దతు ఇవ్వటం ద్వారా వైసీపీ – బీజేపీ ముఖ్య నేతల మధ్య సంబంధాల పైన ప్రభావం పడేలా టీడీపీ వ్యవహరిస్తోంది. 2019 ఎన్నికల వేళ..జగన్ అనుసరించిన వ్యూహాన్నే ఇప్పుడు టీడీపీ అమలు చేస్తోంది. నాడు టీడీపీ ఎన్డీఏలో కొనసాగుతూ..బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ తీసుకొనే నిర్ణయాలకు మద్దతు ఇచ్చేది. కానీ, వైసీపీ ఎన్డీఏలో నాడు – నేడు భాగస్వామి కాకపోయినా మద్దతుగానే నిలుస్తోంది. ఇప్పుడు టీడీపీ సైతం ఎన్డీఏలో భాగస్వామి కాదు. కానీ, 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలు టీడీపీ భవిష్యత్ కు కీలకం. దీంతో..జగన్ కు బలం పెంచే ప్రతీ అంశం పైన టీడీపీ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా.. కేంద్రంలో అధికారంలో ఉన్న వారి నుంచి మద్దతు విషయంలో ఆలోచన చేస్తోంది. బీజేపీ – టీడీపీ మధ్య గ్యాప్ తగ్గించుకొనేందుకు ప్రయత్నాలు చేస్తోంది.