శ్రీశైల క్షేత్రం భక్తుల పుణ్య ధామం.. ఈ క్షేత్రానికి ఎంతో చారిత్రాత్మక వైభవం ఉంది. గతించిన చరిత్రలో ఎందరో రాజులు, చక్రవర్తులు ఈ పుణ్యాధామాన్ని సేవించారు. వారిలో ప్రధానంగా ఇక్ష్వాక్షులు, రెడ్డి రాజులు, చాళుక్యులు, కాకతీయులు, ముసునూరి,పెమ్మసాని, విజయ నగర రాజులు వంటి వారు ఎందరో సేవలు చేసిన మహాక్షేత్రం. శ్రీరాముడు, పాండవులు వంటి పురాణ పురుషులు పూజలు చేసిన శ్రీ మల్లికార్జునుని పవిత్ర ధామం. శ్రీశైల దేవస్థానానికి రక్షణ కోసం కొందరు రాజులు చుట్టూ కోట లాంటి పటిష్ట కట్టడాన్ని నిర్మించారు. నాలుగు వైపులా నాలుగు పెద్ద ద్వారాలు, సుదూరానికి సైతం కనిపించేలా బ్రహ్మాండమైన నాలుగు గోపురాలు, అత్యద్భుతమైన కట్టడాలుగా దేవాలయాన్ని నిర్మించారు. శ్రీశైలం ఒక భాస్కర క్షేత్రము. శ్రీశైలం ద్వాదశ (12) జ్యోతిర్లింగాలలో రెండవది. అష్టాదశ శక్తి పీఠాలలో ఆరవది. దశ భాస్కర క్షేత్రాలలో శ్రీశైలం ఆరవది. ఇంతటి విశిష్ట చరిత్ర కల, పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం శ్రీశైలం.
స్థల పురాణం
పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పాలించేవాడు .అతను చాలా కాలం పాటు గాయత్రి మంత్రాన్ని జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపాదాలచే చతుష్పాధాలచే మరణం లేకుండా వరం పొందాడు. అరుణాసురుని వర ప్రభావంతో భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు. ఆదిశక్తి ప్రత్యక్షమై, అరుణాసురుడు తన భక్తుడని అతను నిత్యం గాయత్రీ మంత్రం జపిస్తున్నంతవరకు అతనిని ఎవరూ ఏమీ చేయలేరని చెబుతుంది. అనంతరం , దేవతలు పథకం ప్రకారం దేవతల గురువు అయిన బృహస్పతిని అరుణాసురుని దగ్గరకు పంపిస్తారు .అరుణాసురుడు దేవగురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యాన్ని వ్యక్తపరచగా, బృహస్పతి అందుకు సమాధానంగా, ఇద్దరం ఒకే అమ్మ వారిని గాయత్రీ మంత్రంతో పూజ చేస్తున్నామని తాను రావడంలో వింత ఏమీ లేదని చెబుతాడు. అందుకు అరుణాసురుడు ,దేవతలు పూజ చేసే అమ్మవారికి, నేనెందుకు పూజ చేయాలని అహంకారంతో గాయత్రి మంత్ర జపాన్ని మానేస్తాడు. దానికి కోపించిన ఆదిశక్తి, భ్రమర (తుమ్మెద) రూపం ధరించి అసంఖ్యాకంగా భ్రమరాలని సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు అరుణాసురుడుని, అతని సైన్యాన్ని సంహరిస్తాయి. ఈ విధంగా శ్రీశైల పుణ్యక్షేత్రంలో, భ్రమరాంబ సమేత మల్లికార్జునుడిగా స్వామి, పూజలు అందుకుంటున్నారు.
ఈ క్షేత్రం ఎక్కడ ఉంది ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అత్యంత సుందరమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న పర్వత ప్రాంతం శ్రీశైలం. కర్నూలు జిల్లాలో ఉన్న శ్రీశైల పట్టణం పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రం .ఇక్కడ జనాభా పది వేల కంటే తక్కువగా ఉంటుంది. సనాతన హిందూ మత సాంప్రదాయాలకు , సంస్కృతికి ఈ ప్రాంతం ఒక ధార్మిక చిహ్నం. శ్రీశైల క్షేత్ర పర్యటనకు, ప్రతి ఏటా దేశ, విదేశీ టూరిస్టులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. కేవలం ఆధ్యాత్మిక క్షేత్రం గానే కాకుండా ప్రముఖ పర్యాటక కేంద్రంగానూ, శ్రీశైలంకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడకు సమీప విమానాశ్రయం హైదరాబాదులోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ప్రముఖ నగరాలైన హైదరాబాద్ , విజయవాడ నుంచి అన్నివేళలా బస్సు రవాణా సౌకర్యం , అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా శీతాకాలంలో, శ్రీశైలం పర్యటన, ఎంతో మనోహరంగా అనిపిస్తుంది.
ప్రముఖ శైవ క్షేత్రం
నల్లమల కొండలపై ఉన్న శ్రీశైల మల్లికార్జున ఆలయం ప్రముఖ దైవ క్షేత్రం .ఇక్కడ ,పూజలు అందుకుంటున్న మల్లికార్జునుడి లింగ రూపం, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి .అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన భ్రమరాంబిక అమ్మవారు కూడా, మల్లికార్జునుడి సన్నిధికి సమీపంలో కొలువై భక్తులకు దర్శనమిస్తారు. కార్తీకమాసం సమయంలో ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ముఖ్యంగా ప్రతి ఏటా ఇక్కడ జరిగే, మహాశివరాత్రి పండుగను వీక్షించేందుకు, దేశ విదేశాల నుంచి నలుమూలల భక్తకోటి తరలివస్తారు. ద్రావిడ నిర్మాణ శైలిలో రూపొందించబడిన ఈ ఆలయం శిల్పకళా వైభవం అబ్బురపరుస్తుంది. శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాంతం. అక్క మహాదేవి గుహలు, పాతాళ గంగ, శ్రీశైలండ్యాం, ఇష్టకామేశ్వరి గుడి, అంతేకాకుండా పంచ మఠాలు ఇక్కడ ఉన్నాయి. గంటా మఠం, భీమ శంకర మఠం, విభూతి మఠం, సారంగధర మఠం, విశ్వామిత్ర మఠం, నంది మఠం, రుద్రాక్ష మఠం ఉన్నాయి.
రుద్రాక్ష మఠం
రుద్రాక్ష మఠంలో శివలింగం రుద్రాక్ష రూపంలో ఉండడం ఈ మఠం యొక్క ప్రత్యేకత .కాబట్టి ఇంతటి ప్రాశస్త్యం ఉన్న క్షేత్రాన్ని మీరు కూడా ఒకసారి సందర్శించండి.